Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
Aadi Saikumar's Telugu Movie Black Review: ఆది సాయికుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'బ్లాక్'. ఈ రోజు సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
జి.బి. కృష్ణ
ఆది సాయికుమార్, దర్శనా బానిక్, కౌశల్ మండ, ఆమని తదితరులు
సినిమా రివ్యూ: బ్లాక్
రేటింగ్: 1.5/5
నటీనటులు: ఆది సాయికుమార్, దర్శనా బానిక్, కౌశల్ మండ, ఆమని, పృథీరాజ్, సూర్య, 'సత్యం' రాజేష్, 'తాగుబోతు' రమేష్, ఆనంద చక్రపాణి తదితరులు
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: మహంకాళి దివాకర్
రచన, దర్శకత్వం: జి.బి. కృష్ణ
విడుదల తేదీ: మే 28, 2022
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న యువ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar). ఆయన నటించిన 'బ్లాక్' సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా (Black Telugu movie Review) ఎలా ఉంది?
కథ: ఆదిత్య (ఆది సాయికుమార్) పోలీస్ కానిస్టేబుల్. తండ్రి మరణించడంతో ఆ ఉద్యోగం అతడికి వస్తుంది. డ్యూటీలో చేరిన తొలి రోజు కాలనీలో ఒక వ్యాపారి ఇంట్లో రూ. 50 లక్షలు చోరికి గురి అవుతాయి. రెండో రోజు గ్యాంగ్ స్టర్ రావత్ తమ్ముడు దాదూ హత్య చేయబడతాడు. ఆ రెండు నేరాలు చేసింది ఎవరు? తన తమ్ముడిని ఆదిత్యే హత్య చేశాడని రావత్ ఎందుకు అనుకుంటున్నాడు? ఆ హత్య చేయడంతో పాటు 50 లక్షల రూపాయలను దొంగల నుంచి ఆదిత్య కొట్టేశాడని ఎస్ఐ విహాన్ వర్మ (కౌశల్ మండ) ఎందుకు భావిస్తున్నారు? ఈ సమస్య నుంచి ఆదిత్య ఎలా బయట పడ్డాడు? పోలీసులు, రావత్ నుంచి ఎలా తప్పించుకున్నాడు? హానిక (దర్శనా బానిక్) ఎవరు? ఈ కథలో ఆమె పాత్ర ఏమిటి? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: హీరోకి ఏదొక డిజార్డర్ (లోపం) ఉంటే... బాక్సాఫీస్‌కు హిట్ ఫార్ములా దొరికేసినట్టే! ఒక 'గజినీ', ఒక 'భలే భలే మగాడివోయ్', ఒక 'మహానుభావుడు'ను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే... హీరోకి ఉన్న లోపంతో కామెడీ చేయాలా? ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తూ థ్రిల్లర్ సినిమా తీయాలా? అనేది దర్శకుడి చేతిలో ఉంటుంది. 'బ్లాక్' దర్శకుడు జీబీ కృష్ణ థ్రిల్లర్ తీయాలని అనుకున్నారు. అయితే, తీయడంలో ఫెయిల్ అయ్యారు.
దర్శకుడు జీబీ కృష్ణ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా రాసుకున్నారు. సినిమాకు మంచి ముగింపు ఇచ్చారు. అయితే... ఇంటర్వెల్‌కు ముందు, తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, సన్నివేశాలు, మాటలు రాసుకోవడంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్లు, లవ్ ట్రాక్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత అయినా సరే కథను ఆసక్తిగా నడిపారా అంటే అదీ లేదు. మెయిన్ ట్విస్ట్ రివీల్ చేశాక... సన్నివేశాలు మరింత బోర్ కొట్టించాయి. ఉన్నంతలో క్లైమాక్స్ బెటర్. అవుట్ డేటెడ్ డైలాగులు ఇరిటేట్ చేశాయి. సినిమాలో హీరోయిన్ పేరు హానిక. డైలాగుల్లో హానికరం అనే పదం వాడటం కోసం ఆ పేరు పెట్టరేమో అనిపించింది. 'వినేవాడు ఉంటే హెడ్ సెట్ పెట్టి ఇంగ్లిష్‌లో హరికథ చెప్పాడంట' లాంటి డైలాగులు సినిమాలో ఉన్నాయి.
హీరో హీరోయిన్లు ప్రేమలో పడిన తర్వాత వచ్చే పాట 'నా గుప్పెడంత' బావుంది. పిక్చరైజేషన్ కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతంతో సన్నివేశాల్లో ఉత్కంఠ పెంచే ప్రయత్నం చేశారు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి. సినిమాటోగ్రఫీ జస్ట్ ఏవరేజ్. కొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ అసలు బాలేదు. మధునందన్, 'తాగుబోతు' రమేష్‌తో కారులో సీన్ ఎడిట్ చేయొచ్చు. అటువంటి కొన్ని సన్నివేశాలకు ఎడిటర్ కత్తెర వేసి ఉంటే బావుండేది.
ఆది సాయికుమార్ ఫైట్స్‌లో బాగా చేశారు. ఎమోషనల్ అండ్ సస్పెన్స్ సీన్స్‌లో ఇంటెన్స్ చూపించే ప్రయత్నం చేశారు. తన పాత్రకు న్యాయం చేశారు. కనీసం లిప్ సింక్ కూడా కుదరలేదు... దర్శనా బానిక్ నటన గురించి అంతకు మించి చెప్పలేం! హీరో తల్లిగా ఆమని కనిపించిన సన్నివేశాలు తక్కువే. అయితే, ఆమె నటన బావుంది. ఆనంద చక్రపాణి ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపించారు. 'సత్యం' రాజేష్, పృథ్వీ, 'తాగుబోతు' రమేష్, కౌశల్ వంటి ఆర్టిస్టులు ఉన్నా... వాళ్ళ నుంచి బెస్ట్ అవుట్‌పుట్ తీసుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు.
ఫైనల్ పంచ్: ఆది సాయికుమార్ హిట్ కోసం మరో ప్రయత్నం చేయక తప్పదు. ఒక ట్విస్ట్, ఒక సాంగ్, రెండు మూడు సీన్లు బావున్నా పర్లేదు థియేటర్లకు వెళ్లి చూసి వస్తామనుకునే ప్రేక్షకులు వెళ్ళవచ్చు. దర్శకత్వ లోపం వల్ల ఆది సాయికుమార్ ప్రయత్నం, నిర్మాత డబ్బులు వృథా అయ్యాయి.