Raju Weds Rambai Review - 'రాజు వెడ్స్ రాంబాయి' రివ్యూ: అంత బోల్డ్ & కల్ట్ కాన్సెప్ట్ ఏముంది? సినిమా ఎలా ఉంది?
Raju Weds Rambai Review Telugu: వేణు ఊడుగుల నిర్మాతగా మారిన సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ మీద తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. మరి సినిమా?
సాయిలు కంపాటి
అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతూ జొన్నలగడ్డ, అనితా చౌదరి, కవితా శ్రీరంగం తదితరులు
Raju Weds Rambai Movie Review In Telugu: 'నీది నాదీ ఒకే కథ', 'విరాటపర్వం'తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు వేణు ఊడుగుల. ఆయన నిర్మాతగా మారి రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించిన సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. అఖిల్ రాజ్, తేజస్విని రావు జంటగా నటించారు. శివాజీ రావు, అనితా చౌదరి, చైతూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలు పోషించారు. సాయిలు కాంపాటి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Raju Weds Rambai Story): రాజు (అఖిల్ రాజ్)ది తెలంగాణలో మారుమూల పల్లె. తండ్రి రమేష్ (శివాజీ రావు) వ్యవసాయ కూలీ. రాజు జన్మించే ముందు వరకు బ్యాండ్ కొట్టేవాడు. ఆ తర్వాత మానేశాడు. అయితే, పెరిగి పెద్దయిన తర్వాత రాజు బ్యాండ్ కొట్టడం మొదలు పెడతాడు.
ఊరిలోని అమ్మాయి రాంబాయి (తేజస్విని రావు)ని రాజు ప్రేమిస్తాడు. ఆ ప్రేమకు అమ్మాయి సైతం దాసోహం అంటుంది. రాంబాయి తండ్రి వెంకన్న (చైతూ జొన్నలగడ్డ) కాంపౌండర్. తన కుమార్తెను ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతాడు. అతడిని ఒప్పించడం కష్టమని, పెళ్లికి ముందు గర్భవతి అయితే తప్పకుండా మరో మార్గం లేక వివాహానికి అంగీకరిస్తారని రాజు, రాంబాయి ఒక్కటి అవుతారు. రాంబాయి గర్భవతి అవుతుంది? ఆ తర్వాత ఏమైంది? అంతకు ముందు ఎటువంటి గొడవలు జరిగాయి? చివరకు పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది సినిమా.
విశ్లేషణ (Raju Weds Rambai Review Telugu): మనసుతో చూసే కథలు కొన్ని, మెదడును ఆలోచింపజేసే సినిమాలు మరికొన్ని ఉంటాయి. 'రాజు వెడ్స్ రాంబాయి' చూశాక మెదడుతో పాటు మనసు సైతం ఆలోచనలో పడుతుంది. ఏ కన్నతండ్రి అయినా సరే అటువంటి ఘాతుకానికి ఎలా పాల్పడతాడు? అని! ఆ స్థాయిలో మనసును, మెదడును డిస్టర్బ్ చేస్తుందీ సినిమా.
వాస్తవంగా జరిగిన కథ ఆధారంగా రూపొందిన సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. ఓ విధంగా చెప్పాలంటే... పరువు హత్య నేపథ్యంలో తీసిన సినిమా. ఒక్క బొట్టు రక్తం చిందించకుండా, కూతుర్ని - అల్లుడిని కాటికి పంపిన కసాయి తండ్రి కథ 'రాజు వెడ్స్ రాంబాయి'. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు షాక్ ఫ్యాక్టర్ & సినిమా బలం పతాక సన్నివేశాలు. తండ్రి చేసే ఘాతుకం. ఇప్పటి వరకు తెలుగు తెరపై, ఆ మాటకు వస్తే ఏ సినిమాలోనూ అటువంటి ఎండింగ్ చూసి ఉండరు. అయితే... క్లైమాక్స్‌లో ఉన్న బలం సినిమా ప్రారంభంలో లేదు. ఇంటర్వెల్ ముందు బలమైన ఎమోషనల్ మూమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చింది.
'రాజు వెడ్స్ రాంబాయి'లో ప్రేమ కథ గానీ, ఆ మాటకు వస్తే సన్నివేశాల్లో గానీ కాస్త కూడా కొత్తదనం లేదు. ఇంతకు ముందు పలు సినిమాల్లో అటువంటి సన్నివేశాలు చూశాం. అమ్మాయి - అబ్బాయి మధ్య పరిచయం... తండ్రి 'నో' చెప్పడం... తెలిసీ తెలియని వయసులో జంట చేసే తప్పులు... క్లైమాక్స్ ముందు వరకు కొత్తగా ఉన్న పాయింట్ లేదు. చిన్న పిల్లల వ్యవహారంలా ఉంటుంది. అయితే పల్లె ప్రేమలోని స్వచ్ఛత కనిపిస్తుంది. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి సంగీతం - మిట్టపల్లి సురేందర్ సాహిత్యం - దర్శక రచయిత సాయిలు కాంపాటి తెరకెక్కించిన తీరు నెమ్మదిగా కథలోకి తీసుకు వెళతాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఈ కథకు పల్లె సొగసు అద్దాయి. మధ్యలో హీరో చేసే మేనరిజం చికాకు పెడుతుంది. పెట్రోల్ బంక్ ఎపిసోడ్ సాగదీత వ్యవహారంలా ఉంటుంది. ఓ సాధారణ కథకు అసాధారణ క్లైమాక్స్, ఎమోషనల్ సన్నివేశాలను దర్శకుడు తీసిన తీరు మనసులో చోటు దక్కించుకుంటాయి.
Also Read: 'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
రాజు పాత్రలో అఖిల్ రాజ్ జీవించాడు. కొత్త కుర్రాడు కావడం, అతడికి ఎటువంటి ఇమేజ్ లేకపోవడం కలిసి వచ్చింది. తెరపై కేవలం పాత్ర మాత్రమే గుర్తు ఉండేలా నటించాడు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశాడు. తేజస్విని రావు ముఖంలో, నటనలో అమాయకత్వం పాత్రకు ప్లస్ అయ్యింది. ఆమె చక్కగా చేసింది. హీరో తండ్రిగా శివాజీ రావు కనిపించారు. నటనలో ఆయనకున్న అనుభవం ఇంటర్వెల్ ముందు సన్నివేశంలో కనిపిస్తుంది. కంటతడి పెట్టిస్తుంది. అనితా చౌదరి నటన బావుంది. కానీ డబ్బింగ్ సెట్ కాలేదు. హీరోయిన్ తండ్రిగా చైతూ జొన్నలగడ్డ మెమరబుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. పాత్రలోని పొగరు, అవిటితనం వల్ల వచ్చే నిస్సహాయతను ప్రీ క్లైమాక్స్‌లో చూపించినప్పుడు, ఆ తర్వాత చేసే పనికి... ఆయనపై ప్రేక్షకులకు కోపం వస్తుంది. అంతలా ప్రేక్షకులను సైతం కథలోకి తీసుకు వెళ్లారు. హీరో స్నేహితులుగా నటించిన బ్యాచ్ తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.
సాయిలు కాంపాటి కథలో క్లైమాక్స్, కథానాయిక తండ్రి (చైతూ జొన్నలగడ్డ) క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుంటాయి. ప్రేమలోనూ అటువంటి వైవిధ్యం చూపించి ఉంటే... 'రాజు వెడ్స్ రాంబాయి' ఎవర్ గ్రీన్ క్లాసిక్ అయ్యేది. అందుకు కాస్త దూరంలో ఆగినా... ఈ కథ ఎప్పటికీ గుర్తుంటుంది. దర్శకుడిగా పరిచయమైన సాయిలు కాంపాటి, నిర్మాత వేణు ఊడుగుల నిజాయతీగా వాస్తవాన్ని తెరపైకి తీసుకు వచ్చినందుకు అభినందించాలి. సురేష్ బొబ్బిలి సంగీతం, అఖిల్ రాజ్ - చైతూ జొన్నలగడ్డ నటన కోసమైనా ఒక్కసారి చూడొచ్చు.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?





















