Munjya Movie Review: ‘ముంజ్య’ రివ్యూ: సత్యరాజ్ నటించిన ఈ బాలీవుడ్ మూవీ ఎలా ఉంది? పిల్ల దెయ్యం నవ్వించిందా.. భయపెట్టిందా?
Munjya Movie Review: బాలీవుడ్‌లో వస్తున్న హారర్ కామెడీ సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తుండగా.. తాజాగా అదే లైన్‌లో సూపర్ హిట్ కొట్టాలని వచ్చేసింది ‘ముంజ్య’. మరి ఈ మూవీ ఆడియన్స్‌ను మెప్పించగలిగిందా? లేదా?
ఆదిత్య సర్పోట్దర్
అభయ్ వర్మ, షర్వరీ, మోనా సింగ్, సత్యరాజ్
Theaters
Munjya Movie Review In Telugu: హారర్ కామెడీ జోనర్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి హారర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన బాలీవుడ్ మూవీ ‘ముంజ్య’ (Munjya). దెయ్యాలను కామెడీగా చూపిస్తూ.. వాటి యాక్షన్స్‌తో ప్రేక్షకులను నవ్వించగలిగితే ఆ హారర్ కామెడీ మూవీకి తిరుగేలేదు. కానీ ‘ముంజ్య’ మాత్రం ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి. సినిమా నిడివి తక్కువే అయినా ఇంకా అవ్వలేదా అనిపించే సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని ‘ముంజ్య’లో కేవలం నెగిటివ్స్ మాత్రమే కాదు చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి.
కథ..
‘ముంజ్య’ కథ పూర్తిగా బిట్టు (అభయ్ వర్మ) చుట్టూనే తిరుగుతుంది. బిట్టు తల్లి పమ్మి (మోనా సింగ్)కి అతిజాగ్రత్త ఎక్కువ. అందుకే బిట్టును తనకు నచ్చినట్టుగా బ్రతకనివ్వదు. కానీ బిట్టు మాత్రం స్వేచ్ఛగా ఉండాలని కలలు కంటుంటాడు. బిట్టు, పమ్మి కలిసి తమ ఊరిలో ఒక పెళ్లి కోసం వెళ్తారు. అదే సమయంలో ఎంతోకాలంగా తన కోరికను తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న ముంజ్య అనే ఒక పిల్ల దెయ్యం.. బిట్టు వెంటపడుతుంది. తనకు మాత్రమే కనిపిస్తూ తనను టార్చర్ చేస్తుంటుంది. అసలు ముంజ్య ఎవరు అనేదాని వెనుక పెద్ద కథ ఉంది.
70 ఏళ్ల క్రితం సముద్రం ఒడ్డున ఉండే కొంకన్ అనే గ్రామంలో తనకంటే వయసులో పెద్ద అయిన మున్ని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ముంజ్య. చివరికి పెళ్లి కాకుండానే చిన్న వయసులోనే మరణిస్తాడు. కానీ మున్నిపై ఉన్న ప్రేమ, తనను పెళ్లి చేసుకోవాలనే కోరికతో భయంకరమైన పిల్ల దెయ్యంలాగా మారిపోతాడు. తను బ్రతికి ఉన్నప్పుడు జరగనిది చచ్చిన తర్వాత జరిగేలా చేయాలని అనుకుంటాడు. అదే సమయంలో బిట్టు ఆ ఊరికి వెళ్లడంతో బిట్టును ఫాలో అవుతూ పూణె వరకు వచ్చేస్తాడు ముంజ్య. ఆ తర్వాత బిట్టు జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి, చివరికి ఆ పిల్ల దెయ్యాన్ని ఎలా వదిలించుకున్నాడు అనేది ‘ముంజ్య’ కథ.
టెక్నికల్ టీమ్..
ఆదిత్య సర్పోట్దర్ తెరకెక్కించిన ‘ముంజ్య’.. 1950, 2023.. ఇలా రెండు టైమ్ జోన్స్‌లో నడుస్తోంది. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హారర్ ఎలిమెంట్స్ విషయంలో మాత్రమే కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంటుంది. హారర్ కామెడీ జోనర్ అయినా హారర్ కంటే కామెడీనే ఎక్కువగా చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంటుంది. భయంకరమైన హారర్ చిత్రాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు అసలు ‘ముంజ్య’లో అంతగా హారర్ ఎలిమెంట్స్ ఏమీ లేవు అనిపించే అవకాశం కూడా ఉంది. ఇతర టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. తన కెమెరా యాంగిల్స్‌తో ప్రేక్షకులను భయపెట్టే విషయంలో సినిమాటోగ్రాఫర్ సౌరభ్ గోస్వామి దాదాపుగా ఫెయిల్ అయ్యాడు. సచిన్, జిగర్ అందించిన సంగీతం మాత్రం చాలావరకు ఆకట్టుకునేలా ఉంది.
గ్రాఫిక్స్ హైలెట్..
‘ముంజ్య’లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రాఫిక్స్. వీఎఫ్ఎక్స్‌తో ముంజ్య అనే ఒక దెయ్యం క్రియేచర్‌ను క్రియేట్ చేయడంలో టీమ్ అంతా సక్సెస్ సాధించింది. క్రియేచర్ చూడడానికి ఫన్నీగా ఉండాలి కానీ అప్పుడప్పుడు భయపెట్టాలి అనేదానికి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేలా క్రియేట్ చేశారు. అందుకే ఆ క్రియేచర్ కూడా సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. మామూలుగా హారర్ సినిమా కథలు అన్నీ దాదాపుగా ఒకేలాగా ఉంటాయి కాబట్టి ‘ముంజ్య’ కథ గురించి కూడా ఎక్కువగా ఆలోచించకపోతే చాలామంది ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది.
యాక్టింగ్ ఎలా ఉందంటే?
‘ముంజ్య’లో నటీనటుల విషయానికొస్తే బిట్టు పాత్రలో కనిపించిన హీరో అభయ్ వర్మను చూస్తుంటే చాలాసార్లు హ్యారీ పాటర్‌లో హీరో గుర్తొస్తాడు. ఆ రింగుల జుట్టు, ఆ కళ్ల జోడుతో అచ్చం అలాగే ఉన్నట్టు అనిపిస్తాడు. ఇక తన యాక్టింగ్ విషయానికొస్తే.. దెయ్యం తనకు మాత్రమే కనిపిస్తుంది, వేరేవాళ్లకు కనిపించదు అని తెలిసిన తర్వాత అభయ్ వర్మ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక ఇందులో హీరోయిన్‌గా నటించిన షర్వరీ వాఘ్‌ది సైతం నటనకు పెద్దగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు. బిట్టు తల్లి పాత్రలో మోనా సింగ్, దెయ్యాలను వదిలించే ఎల్విస్ కరీమ్ ప్రభాకర్ పాత్రలో సత్యరాజ్ క్యారెక్టర్లు ఆడియన్స్‌ను నవ్విస్తాయి.
Also Read: మనమే రివ్యూ: ఓవర్సీస్‌లో నెగెటివ్ టాక్, మూవీ అంత బ్యాడా? శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?