Mayasabha Web Series Review - 'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ: వైయస్సార్ - చంద్రబాబు స్నేహితులా? శత్రువులా? ఓటీటీలో దేవాకట్టా రాజకీయ మాయాజాలం ఎలా ఉందంటే?
Mayasabha Review In Telugu: దేవాకట్టా తెరకెక్కించిన పొలిటికల్ వెబ్ సిరీస్ 'మయసభ'. చైతన్య రావు, ఆది పినిశెట్టి పాత్రలు చూస్తే వైయస్సార్ - చంద్రబాబు గుర్తుకొస్తారు. ఈ సిరీస్ ఎలా ఉందంటే?
దేవ కట్టా - కిరణ్ జయ్ కుమార్
ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, శంకర్ మహంతి, దివ్యా దత్తా తదితరులు
SonyLiv
Sonyliv original web series Mayasabha review rating in Telugu: సోనీలివ్ ఓటీటీ కోసం దర్శకుడు దేవాకట్టా క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ 'మయసభ'. ఆయనతో పాటు కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆది పినిశెట్టి, '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావు, సాయి కుమార్, తాన్య రవిచంద్రన్, దివ్యా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
'మయసభ' ప్రచార చిత్రాలు చూస్తే... తెలుగు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన దిగ్గజ నాయకులు నారా చంద్రబాబు నాయుడు - వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలు గుర్తుకు రావడం గ్యారంటీ. ఆది పినిశెట్టి పాత్రను చంద్రబాబు స్పూర్తితో, చైతన్య రావు పాత్రను వైయస్సార్ స్ఫూర్తితో రాసుకున్నట్టు అనిపిస్తుంది. ఆ మాట అంటే దేవా కట్టా ఒప్పుకోరు. మరి, సిరీస్ ఎలా ఉంది? ఇందులో ప్లస్ - మైనస్ పాయింట్స్ ఏంటి? అనేది రివ్యూలో చూడండి. అంత కంటే ముందు ఎవరి పాత్ర పేరును ఎలా మార్చారో తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి ('మయసభ' వర్సెస్ రియల్ లైఫ్: చంద్రబాబు, వైయస్సార్ to ఇందిరా గాంధీ... ఎవరి పాత్రలో ఎవరు నటించారు? ఎవరి పేరు ఎలా మార్చారు?).
కథ (Mayasabha Web Series Story): కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి) సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. కాలేజీ రోజుల నుంచి రాజకీయాలు అంటే ఆసక్తి. ప్రజలకు సేవ చేయాలని తపించే వ్యక్తి. అయితే కుటుంబం నుంచి ఆశించిన మద్దతు ఉండదు. రామి రెడ్డి (చైతన్య రావు) డాక్టర్. ఆయన తండ్రి బాంబుల శివారెడ్డి (శంకర్ మహంతి) రాయలసీమ రౌడీ. తండ్రి చేసే పనులను రామిరెడ్డి వ్యతిరేకిస్తాడు. ఒకానొక సందర్భంలో కృష్ణమ నాయుడు, రామి రెడ్డి కలుస్తారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది.
స్నేహితులుగా మొదలైన కృష్ణమ నాయుడు, రామిరెడ్డి ప్రయాణం... రాజకీయ పరంగా ఎటువంటి దారులు తీసుకుంది? దేశంలో ఎమర్జెన్సీ విధించిన ప్రధాని ఐరావతి బసు (దివ్యా దత్తా) వల్ల, ఆవిడ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? అప్పట్లో అగ్ర కథానాయకుడు రాయపాటి చక్రధర్ రావు (సాయి కుమార్) ఏం చేశారు? ఆయన ఇంటికి కృష్ణమ నాయుడు అల్లుడు కావడం వెనుక ఏం జరిగింది? చక్రం తిప్పింది ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో ఎవరేం చేశారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Mayasabha Review Telugu): దర్శక రచయితలు దేవా కట్టా - కిరణ్ జయ్ కుమార్ తమది ఫిక్షనల్ కథ అని ఎంత బల్లగుద్ది చెప్పినా సరే... 'మయసభ' చూస్తున్నంత సేపూ వైయస్సార్ - చంద్రబాబు కళ్ళ ముందు మెదులుతారు. వాళ్లిద్దరూ మాత్రమే కాదు... ఎన్టీఆర్, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, వంగవీటి రంగా, పరిటాల రవి, నాదెండ్ల భాస్కర్ రావు తదితరులు గుర్తొస్తారు. ఎవర్నీ ఎక్కువ చేయలేదు, ఎవర్నీ తక్కువ చేయలేదు - సిరీస్ ప్రారంభం నుంచి ముగింపు వరకు త్రాసులో ఎవరి వైపు మక్కువ చూపించకుండా, ఎవరి కోసమో తలొగ్గకుండా 'వాట్ నెక్స్ట్?' అనేలా ఉత్కంఠ పెంచుతూ 'మయసభ' తీశారు.
ఓ రెండు తరాల ముందు ప్రజలకు అప్పటి రాజకీయ పరిస్థితులు - మలుపుల మీద అవగాహన ఉంటుంది. అయితే... వాళ్ళు సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా 'మయసభ' కథ, కథనం, సన్నివేశాలు నడిపించారు దేవాకట్టా - కిరణ్ జయ్ కుమార్. వైయస్సార్ - చంద్రబాబు మధ్య స్నేహం ఎలా మొదలైంది? అనే అంశం నుంచి శత్రువులుగా ఎలా మారారు? అనేది 'మయసభ' మొదటి సీజన్ కథాంశం.
కులం మీద తన అభిప్రాయాలు వెల్లడించడంలో దేవాకట్టా అసలు మొహమాట పడింది లేదు. 'ఈ దేశంలో పుట్టిన ప్రతివాడి వెనుక ఒక బలం ఉంటుంది... కులం. ఏ ఎన్నికల్లో గెలవాలన్నా ఆ బలం నీ వెనుక ఉండాలి' అని రామిరెడ్డికి తండ్రి బాంబుల శివారెడ్డి చెప్పడం నుంచి మొదలు పెడితే... 'యేసును నమ్ముకున్నంత మాత్రానా నేను రెడ్డిని కాకుండా పోతానా' అని రామిరెడ్డి చెప్పడం, తన కులం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉంటానని అనడం వరకు పలు సన్నివేశాల్లో కులం మీద కలం జూలు విదిల్చారు దేవాకట్టా. ''ఈ కుల వివక్షలో ఏదో ఒక జెండా అండ లేకుండా బతకడం కష్టం బ్రదర్! మా ఏరియాలో ఏకంగా ఆ ఎర్ర జెండాను కూడా కబ్జా సేశారు!'' అని వాకాడ మహేష్ (వంగవీటి రంగా?) చెప్పే మాట అయితే పీక్స్. అయితే ఇటు టీడీపీ, అటు వైసీపీ నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడ్డారు. సేఫ్ గేమ్ ఆడారు. పాత్రల నేపథ్యంలో మార్పులు చేయడం వల్ల ఈ క్యారెక్టర్ వీళ్లదేనని చెప్పడానికి లేకుండా పోయింది. రాజకీయ పరంగా లిబర్టీ తీసుకోవడం వల్ల అప్పటి పరిస్థితులపై అవగాహన ఉన్న జనాలకు తప్పొప్పులు కనబడతాయి. దర్శకుడిగా దేవా కట్టా మార్క్ అయితే చాలా సన్నివేశాల్లో కనిపించింది.
వ్యూహాలు అమలు చేయడంలో కృష్ణమ నాయుడు (చంద్రబాబు?) దిట్ట అని చూపిస్తే... రాజకీయం కోసం రామిరెడ్డి (రాజశేఖర్ రెడ్డి) కులం అండ కోరుకున్నట్టు సన్నివేశాలు సాగాయి. కృష్ణమ నాయుడు (చంద్రబాబు), రామిరెడ్డి (రాజశేఖర్ రెడ్డి) పాత్రలను పరిచయం చేయడం నుంచి వాళ్ళ మధ్య స్నేహం చిగురించడం, రాజకీయాల్లోకి రావడం వరకు కథనం ఆసక్తిగా సాగుతుంది. అయితే మధ్యలో వచ్చే ఒక హాస్పిటల్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. కృష్ణమ నాయుడు కాలేజీ ప్రేమ కథ ఓ పార్టీ జనాలకు నచ్చకపోవచ్చు. తమ అధినేతను అలా చూడటం వాళ్లకు ఇబ్బంది. రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసే ఎపిసోడ్స్, ఐరావతి బసు (ఇందిరా గాంధీ?) ఎమర్జెన్సీ ఎపిసోడ్ - ఏపీ సీఎం మార్చడం వంటివి బావున్నప్పటికీ... తెలిసిన కథగా అనిపిస్తుంది. అయితే రాయపాటి చక్రధర్ రావు (ఎన్టీఆర్?) ఎంట్రీతో కథలో వేగం పెరిగింది. సన్నివేశాల్లో మరింత ఆసక్తి మొదలైంది. ఆయన సీఎం కావడం వరకు చూపించడంతో చివరకు ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా సీజన్ 1 ముగిసింది. అయితే... అందరూ ఆశించిన ఆశ్రమ్ (వైశ్రాయ్?) హోటల్ ఎపిసోడ్ నుంచి మామ అల్లుళ్ళ మధ్య పోరు కోసం సీజన్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేయాలి.
రైటింగ్, డైరెక్షన్ పరంగా అద్భుతమైన పనితీరు కనబరిచిన దేవాకట్టా - కిరణ్ జయ్ కుమార్ ద్వయానికి టెక్నికల్ టీమ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. టీం చేత అటువంటి అవుట్ పుట్ రాబట్టుకున్నారు. క్యాస్టింగ్ పరంగా మంచి మార్కులు స్కోర్ చేస్తుందీ సిరీస్. ఆ తర్వాత కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ టీమ్ ఉంటుంది. ఆ కాలాన్ని తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. అయితే, కొన్ని షాట్స్ వీఎఫ్ఎక్స్ బాలేదు. తలలు నరికే సన్నివేశాల్లో జాగ్రత్త వహించాల్సింది. ఇంద్ర కీలాద్రిని చూపించే సీన్ బావుంది. కాస్ట్యూమ్స్ కూడా ఓకే. టెక్నికల్ పరంగా నేచురాలిటీ కనిపించింది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. 'సహోదర' అంటూ సంగీత దర్శకుడు శక్తికాంత్ ఇచ్చిన పాట కొన్నాళ్ళు గుర్తుంటుంది.
నటీనటుల ఎంపిక పరంగా 'మయసభ' భవిష్యత్ ఫిల్మ్ మేకర్స్‌కు ఒక బార్ సెట్ చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ 'సంజూ' చూస్తే... సంజయ్ దత్ పోలికలు రణబీర్ కపూర్‌లో లేవు. కానీ, సినిమా చివరకు వచ్చేసరికి రణబీర్ గుర్తుంటారు. సంజయ్ దత్ వచ్చినా చూపు రణబీర్ మీద నుంచి పోదు. ఇమిటేట్ చేయకుండా మేనరిజమ్స్ పట్టుకోవడం వల్ల ఇంపాక్ట్ పడింది. సేమ్ టు సేమ్ 'మయసభ'లోనూ అంతే... ఆర్టిస్టులు ఎవరూ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించలేదు. చైతన్య రావు తొలుత సాధారణంగా కనిపించినా... ఎన్నికల ప్రచార సన్నివేశంలో ఒక చేతిలో మైక్ పట్టుకుని మరో చేతిని ప్రజలవైపు చూపిస్తే రాజశేఖర్ రెడ్డి దిగినట్టు ఉంది. చంద్రబాబుగా ఆది పినిశెట్టి కూడా అదరగొట్టారు.
'మయసభ'లో అందరూ బాగా చేశారు. అయితే బాంబుల శివారెడ్డిగా శంకర్ మహంతి, రాయపాటి చక్రధర్ రావు పాత్రలో సాయి కుమార్ నటన మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. వాళ్లిద్దరూ స్క్రీన్ మీద కనిపించినప్పుడు వేరే వాళ్ళ వైపు చూపు తిప్పుకోలేం. అంత అద్భుతంగా నటించారు. ఐరావతి బసుగా అహం చూపించే సన్నివేశాల్లో దివ్యా దత్తా చక్కగా నటించారు. నాజర్, శ్రీకాంత్ భారత్, శత్రు, రవీంద్ర విజయ్ పాత్రల నిడివి పరిమితమే. ఉన్నంతలో బాగా చేశారు.
తెలుగు తెరపై రాజకీయ నేపథ్యంలో కథలు తెరకెక్కించిన దర్శక రచయితలు ఎవరో ఒకరి వైపు మొగ్గు చూపించారు. ఎవరో ఒకరికి ప్రయోజనం చేకూర్చే సిరీస్, సినిమాలు తీశారు. ఓ వర్గానికి, ఓ కులానికి కొమ్ము కాసేలా కాకుండా దేవా కట్టా అండ్ టీమ్ కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించారు. ఇద్దరు దిగ్గజ నాయకులకు సమ ప్రాధాన్యత ఇస్తూ... ఇప్పటి వరకు తెరపై చూడని కథను ఆవిష్కరించారు. ఆసక్తిగా ప్రతి ఎపిసోడ్ ముందుకు తీసుకు వెళ్లారు. రాజకీయ కోణాలు పక్కన పెడితే... తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్న 'మయసభ' మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రాజకీయ వర్గాలు ఏయే అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తాయనేది ఆసక్తికరమైన అంశం.
PS: 'మయసభ' మొదటి సీజన్ వరకు పెద్దగా వివాదాలు లేవు. కానీ, సీజన్ చివరిలో రెండో సీజన్ కోసం ఇచ్చిన లీడ్ మాత్రం రాజకీయ తేనెతుట్టెను కదపడం ఖాయం. ఆశ్రమ్ (వైశ్రాయ్?) హోటల్ ఎపిసోడ్ కాస్త చూపించి వదిలేశారు. అసలు కథంతా రెండో సీజన్ కోసం దాచేశారు. అందులో మామా అల్లుళ్ళ మధ్య పోటీ నుంచి 'వెన్నుపోటు' అంటూ ప్రజల్లోకి ప్రతిపక్షం ఎలా వెళ్ళింది? అనేది ఉండొచ్చు.





















