Itlu Me Yedava Review - 'ఇట్లు మీ ఎదవ' రివ్యూ: మళ్ళీ ఈ సినిమా తీయడం కుదరదుగా త్రినాథ్ కఠారి!
Itlu Me Yedava Review Telugu: త్రినాథ్ కఠారి కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'ఇట్లు మీ ఎదవ'. నవంబర్ 1న థియేటర్లలో విడుదల. ఈ సినిమా ఎలా ఉందంటే?
త్రినాధ్ కఠారి
త్రినాథ్ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి తదితరులు
త్రినాథ్ కఠారి కథానాయకుడిగా నటించిన సినిమా 'ఇట్లు మీ ఎదవ'. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు... అనేది ఉపశీర్షిక. ఇందులో సాహితీ అవాంచ కథానాయిక. త్రినాథ్ కఠారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపరాజు రమణ, దేవి ప్రసాద్, సురభి ప్రభావతి, మధుమణి, తనికెళ్ళ భరణి ఇతర ప్రధాన తారాగణం. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన చిత్రమిది. నవంబర్ 21న థియేటర్లలో విడుదల. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Itlu Me Yedava Story): శ్రీను బాబు (త్రినాథ్ కఠారి)ది మచిలీపట్నం. ఆరేళ్లుగా పీజీ చేస్తున్నాడు. కానీ, పాస్ అవ్వలేదనుకోండి. పీజీ రెండో ఏడాది / అతని క్లాసులో మను... మనస్విని (సాహితీ అవాంచ) చేరుతుంది. ఆమెదీ మచిలీపట్నమే. కానీ తండ్రి సాయి (దేవి ప్రసాద్) బ్యాంకు మేనేజర్ కావడంతో వివిధ ప్రాంతాల్లో తిరిగి చివరకు సొంతూరు వస్తారు. మనస్వినికి భక్తి ఎక్కువ. శ్రీను బాబుకు అసలు భక్తి లేదు. కానీ తానొక పెద్ద భక్తుడిని అని చెప్పి ప్రేమలో పడేస్తాడు. కొడుకు ప్రేమ విషయం తెలిసి మనస్విని ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళతాడు శ్రీను బాబు తండ్రి బంగారు కొట్టు కృష్ణ (గోపరాజు రమణ).
అమ్మాయి ఇంట్లో ప్రేమ విషయం తెలిశాక జరిగిన చిన్నపాటి గొడవలో మనస్విని తండ్రిని ఆస్పత్రిలో చేర్పిస్తాడు. అసలు ఆయనకు ఏమైంది? డాక్టర్ (తనికెళ్ళ భరణి) ఇచ్చిన సలహాతో 30 రోజులు మనస్విని తండ్రితో తిరగడానికి శ్రీను బాబు ఓకే చెబుతాడు. ఆ నెలలో శ్రీను బాబు గురించి అమ్మాయి తండ్రి ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Itlu Me Yedava Telugu Review): మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్‌లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. సెప్టెంబర్ పోతే మార్చిలో మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కానీ లైఫ్‌లో ఫెయిల్ అయితే జీవితంలో ఎప్పటికీ పాస్ అవ్వలేం - యాజిటీజ్ ఇదేనని చెప్పలేం కానీ, ఇంచు మించు ఈ లైన్స్‌లో హీరో కమ్ దర్శక రచయిత త్రినాథ్ కఠారి ఒక డైలాగ్ రాశారు. మూడు నిమిషాల వ్యవధిలో మళ్ళీ మళ్ళీ ఈ డైలాగ్ వినబడుతుంది. క్లైమాక్స్‌లో దానికి పే ఆఫ్ ఇచ్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. మన సహనానికి పరీక్ష పెడుతుంది.
'సినిమా ఒక్కసారే తీయగలరు. మళ్ళీ మళ్ళీ తీయలేరు కదా! ఎందుకిలా తీశారు?' అని ప్రేక్షకుల మనసులో మొదట్నుంచీ అనిపిస్తుంది. త్రినాథ్ కఠారి రచన, నటనపై రవితేజ సినిమాలపై ప్రభావం ఎక్కువ కనబడుతుంది. ఇంటర్వెల్ వరకు కథ, క్యారెక్టర్లు చూస్తుంటే 'ఇడియట్' గుర్తొస్తుంది. ఆ తర్వాత కథపై 'బొమ్మరిల్లు' ప్రభావం కనిపిస్తుంది. హిట్ సినిమాలు చాలా గుర్తొస్తాయి. కానీ, ఒక్కటంటే ఒక్క సీన్ ఎంగేజ్ చేయలేదు. మధ్యలో చిన్న చిన్న సీన్లు కాస్త నవ్విస్తాయంతే. త్రినాథ్ కఠారి తనకొక షో రీల్ తరహాలో 'ఇట్లు మీ ఎదవ' ఉండాలని అనుకున్నారేమో!? ఓ సినిమా చూస్తున్న ఫీల్ ఇవ్వకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ తీశారు. మొదట్నుంచి సహనానికి పరీక్ష పెట్టినా పతాక సన్నివేశాల్లో ట్విస్ట్ ఒక్కటీ 'హమ్మయ్య పర్లేదులే' అనుకునేలా తీశారు.
Also Read: 'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
'ఇట్లు మీ ఎదవ'కు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఆయన సూపర్ హిట్ ట్యూన్లు మళ్ళీ రిపీట్ చేశారు. పాటలు వస్తుంటే కొత్తవి కాకుండా మళ్ళీ పాతవి ప్లే చేసినట్టు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. మచిలీపట్నంలో తక్కువ క్యారెక్టర్లతో తీసినప్పటికీ అటువంటి ఫీల్ కలగలేదు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.
త్రినాథ్ కఠారి నటన పర్వాలేదు. హీరోగా కంటిన్యూ అవ్వాలంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. సాహితీ అవాంచ క్యూట్ అండ్ బబ్లీ నటనతో ఆకట్టుకున్నారు. తనికెళ్ళ భరణి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, మధుమణి, దేవి ప్రసాద్ తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. హీరో స్నేహితుడిగా నవీన్ నేని, కీలక పాత్రల్లో 'చలాకీ' చంటి, 'జబర్దస్త్' నూకరాజు కనిపించారు.
ఇట్లు మీ ఎదవ... స్టార్టింగ్ నుంచి ఒక వైబ్ మనకు అర్థం అవుతూ ఉంటుంది. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు చివరి వరకు కూర్చోవడానికి ఓపిక అవసరం. క్లైమాక్స్, కొన్ని కామెడీ సీన్లు మాత్రమే మెప్పిస్తాయి.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?





















