Kalki 2898 AD Movie Review - 'కల్కి 2898 ఏడీ' రివ్యూ: విజువల్ వండరే! మరి, 'బాహుబలి' బీట్ చేసే సత్తా ఉందా?
Kalki 2898 AD Movie Review In Telugu: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ నిర్మించిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?
నాగ్ అశ్విన్
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, శోభన, దిశా పటానీ, పశుపతి తదితరులు
Prabhas Kalki 2898 AD Movie Review: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ'. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రభాస్ ఎలా చేశారు? నాగ్ అశ్విన్ ఏం తీశారు? అనేది రివ్యూలో చూద్దాం.
కథ (Kalki 2898 AD Movie Story): కురుక్షేత్రం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత... భూమ్మీద చెట్టు చేమ అంతరిస్తున్న రోజులు... భూమ్మీద చివరి నగరం, మొదటి నగరం కాశీకి జనాలు క్యూ కడతారు. అక్కడి ప్రజల చూపు కాంప్లెక్స్ మీద ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, నీరు దొరికే కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని కాశీ ప్రజలు ఆశ పడతారు. అందులో భైరవ (ప్రభాస్) ఒకరు. బౌంటీస్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు.
కాంప్లెక్స్‌లో కొందరు అమ్మాయిలను ఒక ప్రయోగశాలలో బంధిస్తారు. ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా గర్భం దాల్చేలా చేస్తారు. తర్వాత గర్భం నుంచి సీరం సేకరించి సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) దగ్గరకు తీసుకు వెళతారు. దీనికి 'ప్రాజెక్ట్ కె' అని పేరు పెడతారు. 'ప్రాజెక్ట్ కె'లో గర్భం దాల్చిన ఏ అమ్మాయి వంద రోజుల కంటే ఎక్కువ బతకదు. అయితే... సుమతి (దీపికా పదుకోన్) వంద కంటే ఎక్కువ రోజులు గర్భం దాలుస్తుంది. ఆమె నుంచి సీరం సేకరించే సమయంలో కాంప్లెక్స్ నుంచి తప్పించుకుంటుంది.
సుమతిని తీసుకు వస్తే భారీ బౌంటీ ప్రకటిస్తారు. కాంప్లెక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ అని భైరవ బయలు దేరతాడు. సుమతిని అతని చేతికి చిక్కకుండా చేసిన అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) ఎవరు? సుప్రీమ్ యాస్కిన్ ప్లాన్ ఏంటి? శంబల ఎక్కడ ఉంది? అక్కడి మనుషులు కాంప్లెక్స్ రెబల్స్ కింద ఎందుకు మారారు? కల్కి ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Kalki 2898 AD Review In USA Telugu): ఇప్పటి వరకు మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద రానటువంటి ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)ను మెచ్చుకోవాలి. ఆయన ఊహ బావుంది. సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలను మేళవించిన తీరు బావుంది. వెండితెరపై ఆయన సృష్టించిన సరికొత్త ప్రపంచం ఆశ్చర్యపరుస్తుంది. మరి, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ సంగతి ఏంటి? ఈ సినిమా ఎలా ఉంది? అనే విషయాల్లోకి వెళితే...
'కల్కి 2898 ఏడీ' ప్రారంభమే కురుక్షేత్ర సంగ్రామంతో మొదలైంది. అశ్వత్థామగా యంగ్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) లుక్కు, ఆ సన్నివేశం తర్వాత చూడబోయే కథపై ఆసక్తి కలిగిస్తుంది. ప్రభాస్, బుజ్జి మధ్య కెమిస్ట్రీని 'బుజ్జి అండ్ భైరవ' వెబ్ సిరీస్ ద్వారా పరిచయం చేయడం వల్ల సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్, ఆయన కామెడీ టైమింగ్ నవ్విస్తాయి. అయితే... అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు నిదానంగా సినిమా సాగింది. ఒక్కో పాత్రను, ఒక్కో ప్రపంచాన్ని పరిచయం చేయడానికి నాగ్ అశ్విన్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు.
ఇంటర్వెల్ తర్వాత కథలో, సినిమాలో వేగం పెరిగింది. ఒక్కో సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతూ వెళుతుంది. చివరి అరగంట అయితే గూస్ బంప్స్ మూమెంట్స్ గ్యారంటీ! విజువల్స్ పరంగా సినిమా వండర్. ఎమోషనల్ అండ్ డ్రామా కూడా ఓకే. కానీ, తెలుగు ఆడియన్స్ కోరుకునే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కాస్త వెనుకపడింది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ సూపర్బ్. కానీ, సంతోష్ నారాయణన్ సంగీతం అంచనాలకు తగ్గట్టు లేదు. పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ హై ఇవ్వలేదు. సన్నివేశాన్ని తగ్గ గూస్ బంప్స్ మూమెంట్ ఇవ్వడంలో సంతోష్ నారాయణన్ ఫెయిల్ అయ్యాడు.
సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశారు. ఒకటి భైరవ. రెండోది ఏమిటి? అనేది స్క్రీన్ మీద చూడాలి. భైరవగా ప్రభాస్ లుక్స్, కామెడీ టైమింగ్ కేక. రీసెంట్ టైమ్స్‌లో ప్రభాస్ ఇంత హుషారుగా ఎప్పుడూ కనిపించలేదు. ఆయన ఫ్యాన్స్, ప్రేక్షకులకు ఆ ఎనర్జీ నచ్చుతుంది. కానీ, స్క్రీన్ మీద ప్రభాస్ తక్కువ సమయం కనిపించడంతో డిజప్పాయింట్ కావచ్చు.
ప్రభాస్ కంటే ఎక్కువ సేపు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. ఆయన రూపం, ఆహార్యం, నటన... ప్రతిదీ టాప్ క్లాస్. ప్రభాస్, బుజ్జి మధ్య కామెడీ టైమింగ్ బావుంటే... ప్రభాస్, అమితాబ్ మధ్య యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ ఇస్తారు. కమల్ హాసన్ స్క్రీన్ మీద కనిపించేది చాలా తక్కువసేపు. కానీ, తన మార్క్ చూపించారు. పతాక సన్నివేశాల్లో ఆయన చెప్పే మాటలు అయితే... నెక్స్ట్ పార్ట్ మీద హైప్ పెంచుతాయి.
సుమతిగా దీపికా పదుకోన్ పెర్ఫార్మన్స్ బావుంది. ప్రభాస్, దిశా పటానీ మధ్య సన్నివేశాలను కాంప్లెక్స్ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి వాడుకున్నారు. లవ్ ట్రాక్ లాంటి సీన్లు ఉన్నాయి. శోభన, పశుపతి, అనా బెల్ తదితరులు ఓకే. కథలో భాగంగా వాళ్ల పాత్రలు సాగాయి.
విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవికా నాయర్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, కేవీ అనుదీప్, ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రల్లో సందడి చేశారు. వర్మ, మౌళితో ప్రభాస్ సీన్లు నవ్విస్తాయి. మిగతా పాత్రలు ఏమంత ఇంపాక్ట్ చూపించలేదు.
'కల్కి 2898 ఏడీ'... ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్ వండర్. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇందులో కథ చెప్పలేదు. ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రపంచాన్ని, అందులో పాత్రలను పరిచయం చేశారంతే! ఆ పరిచయం కాస్త నిదానంగా సాగింది. కానీ, చివరి అరగంట గూస్ బంప్స్ ఇస్తుంది. ఆ గూస్ బంప్స్ కోసమైనా సినిమా చూడాలి. జస్ట్ గో అండ్ వాచ్. సినిమాలో శంబల ప్రజల నుంచి 'రేపటి కోసం' అనే మాట ఎక్కువ వినబడుతుంది. నాగ్ అశ్విన్ రేపటి తన సినిమాల కోసం కథను దాచారు. జస్ట్ విజన్ మాత్రమే పరిచయం చేశారు.
Also Read: Prabhas 'కల్కి 2898 ఏడీ' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్, మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అందులోనే!