Darling Movie Review - డార్లింగ్ సినిమా రివ్యూ: ప్రియదర్శిని చితక్కొట్టిన నభా నటేష్ - అపరిచితురాలు ఎలా ఉందంటే?
Darling Review In Telugu: ప్రియదర్శి, నభా నటేష్ జంటగా 'హనుమాన్' నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన 'డార్లింగ్' ఎలా ఉంది? సినిమా రివ్యూ చూసి తెలుసుకోండి.
అశ్విన్ రామ్
ప్రియదర్శి పులికొండ, నభా నటేష్, అనన్యా నాగళ్ల, విష్ణు, కృష్ణ తేజ్, మురళీధర్ గౌడ్ తదితరులతో పాటు అతిథి పాత్రలో బ్రహ్మానందం
Priyadarshi And Nabha Natesh Movie Review: ప్రియదర్శి పులికొండ, నభా నటేష్ జంటగా నటించిన సినిమా 'డార్లింగ్' (Darling Movie 2024). 'హనుమాన్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ప్రేక్షకులకు అందించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దంపతులు నిర్మించారు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించగా... వివేక్ సాగర్ సంగీతం అందించారు. లేడీ అపరిచితుడు కాన్సెప్ట్, ట్రైలర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరి, సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూ చూసి తెలుసుకోండి.
కథ (Darling 2024 Movie Story): రాఘవ్ (ప్రియదర్శి) ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగి. పెళ్లైన తర్వాత భార్యతో కలిసి పారిస్‌కు హనీమూన్ వెళ్లాలని ప్రతి నెల జీతంలో కొంత సేవింగ్స్ చేస్తాడు. తండ్రి (మురళీధర్ గౌడ్) చూసిన సైకాలజిస్ట్ నందిని (అనన్యా నాగళ్ల)తో ఏడడుగులు వేయాలని అనుకుంటే... ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడాలని ఆమె వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఎదురైన పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని రాఘవ్ నిర్ణయం తీసుకుంటాడు.
ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన రాఘవ్ (Priyadarshi Pulikonda)కు ఆనంది (నభా నటేష్) పరిచయం అవుతుంది. ఆమెకు ప్రపోజ్ చేయడంతో పాటు కొన్ని గంటల్లో పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ కాదు కదా... ఓ ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తే చితక్కొడుతుంది. ఆ తర్వాత ఆమెకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుస్తుంది. ఆనంది బాడీలోకి వస్తున్న ఐదుగురు (ఆది, మాయ, ఝాన్సీ, పాప, శ్రీ శ్రీ) ఎవరు? వాళ్లను దాటుకుని భార్యను తన సొంతం చేసుకోవడం కోసం రాఘవ్ ఏం చేశాడు? ఆనందితో జీవితం అంతా హాయిగా ఉంటుందని అనుకుంటున్న సమయంలో పారిస్ నుంచి ఎవరు వచ్చారు? ప్రియా (నభా నటేష్) ఎవరు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Darling Movie 2024 Review): 'డార్లింగ్' కథ ఏమిటి? కాన్సెప్ట్ ఏమిటి? అనేది ప్రేక్షకుడు ఊహకు అందని విషయం ఏమీ కాదు. ట్రైలర్లతో కథ ఏమిటనేది క్లియర్ కట్‌గా చెప్పేశారు. అది వెరీ సింపుల్... 'అపరిచితుడు'లో విక్రమ్ క్యారెక్టర్ తరహాలో హీరోయిన్ అపరిచితురాలు అయితే భర్త ఎన్ని తిప్పలు పడ్డాడు? అనేది కోర్ కాన్సెప్ట్. ఆ కథను అశ్విన్ రామ్ ఎలా తెరకెక్కించాడు? అనేది చూస్తే...
'డార్లింగ్' హీరో హీరోయిన్లతో పాటు దర్శక నిర్మాతల లక్ష్యం ఒక్కటే.... ప్రేక్షకుడిని ఫుల్లుగా నవ్వించడం! స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి స్క్రీన్ మీద స్పష్టంగా కనబడుతుంది. సూసైడ్ పాయింట్ దగ్గర హీరోని చూసి హీరోయిన్ నవ్వుకోవడం నుంచి శుభం కార్డు దగ్గర ఈఫిల్ టవర్ కనిపించే హోటల్ బాల్కనీ వరకు ప్రియదర్శి నవ్వించడం కోసం విపరీతంగా ప్రయత్నించారు.
'డార్లింగ్' కాన్సెప్ట్ ఏమిటనేది ప్రేక్షకుడికి తెలుసు కనుక కన్‌ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ సీన్ నుంచి పంచ్ డైలాగ్స్ వర్కవుట్ అయ్యాయి. కొత్తగా లేకున్నా సరే కనెక్ట్ అయ్యే సీన్లు బోలెడు ఉన్నాయి. సంబంధాలు కోసం మ్యాట్రిమోని సైట్లలో ప్రొఫైల్స్ వెతికే సమయంలో అమ్మాయిలు చెప్పే కోర్కెలు, మండపంలో పెళ్లి ఆగిన తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. ప్రియదర్శిని నభా నటేష్ చితక్కొట్టిన ఎపిసోడ్స్ కూడా హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి. అయితే... ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి కథ సుఖాంతం అయిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ అంటూ దర్శకుడు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.
స్ప్లిట్ పర్సనాలిటీ మీద ఇంటర్వెల్ వరకు కామెడీ వర్కవుట్ చేసిన దర్శకుడు, ఆ తర్వాత కూడా సేమ్ కాన్సెప్ట్ మీద కొత్తగా నవ్వించడంలో తడబడ్డాడు. అందువల్ల, నవ్వులు తగ్గాయి. ఫస్టాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండాఫ్‌లో నవ్వులు తగ్గి ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువ అయ్యాయి. దాంతో అప్పటి వరకు కామెడీ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు అడ్జస్ట్ అవ్వడం కష్టమే. అందువల్ల, రెండున్నర గంటల సినిమా లెంగ్తీగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో ఎమోషన్స్, నభా నటేష్ ఫ్లాష్ బ్యాక్ సైతం ఆకట్టుకోదు. నవ్వించడంలో సక్సెస్ అయిన దర్శకుడు ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా తీయడంలో ఫెయిల్ అయ్యాడు. సెకండాఫ్‌లో షాపింగ్ మాల్ సీన్ వంటివి వర్కవుట్ కాలేదు.
వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీని ఎలివేట్ చేసింది. ఆయన శైలి బాణీలు సైతం బావున్నాయి. నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై తెలుస్తోంది. నిడివి విషయంలో కాస్త తగ్గిస్తే బావుండేది.
Also Read: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' రివ్యూ: బాబోయ్... చైతన్య, హెబ్బా మధ్య ఆ రొమాన్స్ ఏంటి? అసలు ఆ కథేంటి?
ప్రియదర్శి కామెడీ టైమింగ్ 'డార్లింగ్'కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సినిమా మొదలైన మరు క్షణం నుంచి చివరి వరకు రాఘవ్ పాత్ర మాత్రమే కనిపించేలా నటించారు. తన నుంచి ప్రేక్షకులు కోరుకునేది ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. యాక్సిడెంట్ తర్వాత నభా నటేష్ నటించిన చిత్రమిది. హీరోయిన్లకు ఇలాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ రావడం అరుదు. ఒక్క సినిమాలో ఏడు డిఫరెంట్ షేడ్స్ చూపించే రోల్ చేశారు. ఆ పాత్రకు న్యాయం చేశారు. అయితే... డబ్బింగ్ సరిగా సింక్ కాలేదు. కొన్ని సన్నివేశాల్లో అది స్పష్టంగా తెలిసేలా ఉండటం ఆమెకు కూడా మైనస్ అని చెప్పాలి. అనన్యా నాగళ్ల హీరోయిన్ కాదు కానీ ఆ పాత్రకు తగ్గట్టు చక్కగా నటించారు. బ్రహ్మానందం అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. రఘు బాబు ఓ సన్నివేశంలో అద్భుతంగా నటించారు. మురళీధర్ గౌడ్, విష్ణు, కృష్ణతేజ్ తదితరులు నవ్వించారు.
జస్ట్ ఫన్... నవ్వుకోవడం కోసం థియేటర్లకు వెళ్లాలని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ మంచి ఆప్షన్. ఇందులో మెదడుకు పని పెట్టే కథ, కాన్సెప్ట్ గట్రా లేవు. ఓవర్ ది బోర్డు వెళ్లినా సరే నవ్వించే ప్రయత్నమే కనిపిస్తుంది. సినిమా మొదలైన 45 నిమిషాల్లో ఎక్కువ నవ్వించడంతో ఆ తర్వాత కామెడీ డోస్ తగ్గింది. కానీ, స్లాప్ స్టిక్ కామెడీ ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు... 'డార్లింగ్'లో నవ్వులకు లోటు ఉండదు.
రేటింగ్: 2.75/5
Also Read: యేవమ్ రివ్యూ: అపరిచితుడు క్రిమినల్ అయితే? చాందిని చౌదరి సినిమా హిట్టా? ఫట్టా?