Akhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?
Akhanda 2 Review In Telugu: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన తాజా సినిమా 'అఖండ 2 తాండవం'. 'అఖండ'కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...
బోయపాటి శ్రీను
నందమూరి బాలకృష్ణ, హర్షాలీ మల్హోత్రా, సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు
Balakrishna Akhanda 2 Review: 'అఖండ'లో అఘోర పాత్ర, అందులో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటన ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ప్యాకేజ్. నందమూరి అభిమానులు, ప్రేక్షకులు కొత్తగా అనిపించింది. ఆ సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించింది. దాంతో సీక్వెల్ 'అఖండ 2 తాండవం' తీశారు. సనాతన ధర్మం, ఇండో - చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. దర్శకుడు బోయపాటి శ్రీను రాసిన కథ, తీసిన విధానం ఎలా ఉంది? అభిమానుల కోసం తీసినట్టు ఉందా? ప్రేక్షకులు మెచ్చేట్టు ఉందా?
కథ (Akhanda 2 Story): ఇండో - చైనా బోర్డర్ (గాల్వన్)లో ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన సైనికుల్లో చైనా ఆర్మీ జనరల్ (సంగే సెల్ట్రామ్) కుమారుడు మరణిస్తాడు. దాంతో భారత్‌ను నాశనం చేస్తానని శపథం చేస్తాడు. భారత ప్రధాని పదవిపై కన్నేసిన రాజకీయ నాయకుడు అజిత్ ఠాకూర్ (కబీర్ సింగ్ దుహాన్)తో చేతులు కలుపుతాడు. మహా కుంభమేళాకు వచ్చిన భక్తులు ప్రమాదకర వైరస్ బారిన పడేలా చేస్తారు. ప్రజలకు దేవుడిపై నమ్మకం పోయేలా పథకం పన్నుతారు.
వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసినది అఖండ (బాలకృష్ణ) సోదరుడు, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాల మురళీకృష్ణ (బాలకృష్ణ) కుమార్తె జనని (హర్షాలీ మల్హోత్రా). ఆమెను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళను అఖండ ఏం చేశాడు? వైరస్ బారి నుంచి దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల్లో దేవుడిపై మళ్ళీ నమ్మకాన్ని ఎలా కలిగించాడు? దుష్టశక్తులను వశం చేసుకున్న నేత్ర (ఆది పినిశెట్టి) ఎవరు? దేశం కోసం, ధర్మం అఖండ ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది సినిమా.
విశ్లేషణ (Akhanda 2 Review Telugu): magic begins where logic ends (లాజిక్ ఎండ్ అయిన చోట మేజిక్ మొదలు అవుతుంది) / when logic fails use magic (లాజిక్ ఫెయిల్ అయినచోట మేజిక్ వాడు) - ఈ కోట్స్ ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? ఒకవేళ వినలేదంటే 'అఖండ 2 తాండవం' థియేటర్లకు ఒక్కసారి గట్టిగా గుర్తు చేసుకోండి. ఎందుకంటే... లాజిక్కులతో చూసే సినిమా కాదిది. బోయపాటి శ్రీను మేజిక్ మీద నడిచిన సినిమా.
'అఖండ'లో అఘోరాగా బాలకృష్ణ ఉగ్రరూపం మాత్రమే చేశారు. 'అఖండ 2'లో ఆ పాత్రను నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్లారు బోయపాటి. దైవాతీత శక్తులు పొందినట్టు చూపించారు. మహోగ్రరూపధారి చేశారు. దాంతో తెరపై నట విశ్వరూపం ఆవిష్కృతమైంది. అదే సమయంలో అసలు లాజిక్‌కు చోటు లేకుండా పోయింది. యాక్షన్ సన్నివేశాల్లో అవుటాఫ్ ది బాక్స్ బ్లాక్స్ డిజైన్ చేయడానికి ఆస్కారం లభించింది. డివైన్ మేజిక్ మొదలు అయ్యింది. అఖండ చేసిన ప్రతి యాక్షన్ సన్నివేశానికి థియేటర్లు ఓ రేంజ్‌లో దద్దరిల్లుతాయి. అందుకు తమన్ నేపథ్య సంగీతం సైతం ఓ కారణం. అయితే అఖండ క్యారెక్టర్, ఆ యాక్షన్ సన్నివేశాలపై పెట్టిన దృష్టి కథ, కథనంలో కనిపించలేదు.
యాక్షన్ సన్నివేశాలు బాగా తీస్తారని బోయపాటి శ్రీనుకు పేరు. అలాగే, కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు & సెంటిమెంట్ సీన్లు కూడా! అయితే 'అఖండ 2' వచ్చేసరికి యాక్షన్ సీక్వెన్సుల్లో ఎటువంటి లోటు చేయలేదు. కానీ, ఫ్యామిలీ బాండింగ్ & ఎమోషన్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేయలేదు. అఖండ మీద పెట్టిన శ్రద్ధ, మురళీకృష్ణ పాత్రపై పెట్టలేదు. గంజాయి నేపథ్యంలో తీసిన ఫైట్, మురళీ కృష్ణ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ ఫోర్స్డ్‌గా ఉన్నాయి. కథలో అతకలేదు. ఏకంగా శివుడు దిగొచ్చినా రావాల్సిన ఇంపాక్ట్ రాలేదు.
పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మిగతా భాషల (తమిళ్, కన్నడ, హిందీ)ను పొగడాల్సిన అవసరం లేదు. మాస్ ఆడియన్స్ కోసం హీరోయిన్ గ్లామర్ షో అవసరం లేదు. ఆ మూస, ఏజ్ ఓల్డ్ ఫార్ములా సన్నివేశాల వల్ల కొంత సాగదీత ఉంది. సనాతన ధర్మం, బయో వార్ (కరోనా!?), మహా కుంభమేళా, దుష్ట శక్తులు, రాజకీయాలు - కథలో పలు అంశాలను బోయపాటి శ్రీను స్పృశించారు. అందువల్ల, ప్రతి అంశానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. అయితే మెజారిటీ ప్రేక్షకులు - మరీ ముఖ్యంగా భక్తులు హర్షించేలా కమర్షియల్ ప్యాకేజ్ సినిమా చేయడంలో సక్సెస్ అయ్యారు.
తమన్ పాటలు, నేపథ్య సంగీతం లేని 'అఖండ 2 తాండవం'ను ఊహించుకోలేం. తెరపై బాలకృష్ణ యాక్షన్ చేస్తుంటే... తెర వెనుక అంతకు మించి డ్యూటీ చేశారు తమన్. శ్లోకాలు, శివ స్తోత్రాలతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఆర్ఆర్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ ఓకే. విజువల్ ఎఫెక్ట్స్, సీజీ పరంగా క్వాలిటీ లోపించింది. స్టాండర్డ్స్ అందుకోలేదు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణ విలువలు ఓకే. డైలాగుల్లో కావాలని మరీ దేవుళ్లను తీసుకొచ్చారు.
అఖండగా బాలకృష్ణను తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఆయన నటించలేదు. ఆ పాత్రలో జీవించారు. అఖండగా బాలకృష్ణ కాకుండా మరొకరు ఆ యాక్షన్ సీన్స్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం కష్టం. శివుడిగా చూపించినా, హనుమంతుని అవతారంగా పేర్కొన్నా... అక్కడ ఉన్నది బాలకృష్ణ కాబట్టి, అఖండ పాత్ర కాబట్టి చెల్లింది. మరొక హీరో అయితే కష్టమే. అఖండగా ఆ పాత్రకు రెండొందల శాతం న్యాయం చేశారు. బాల మురళీకృష్ణ పాత్ర పరిధి తక్కువ. ఓ ఫైటు, ఓ పాట, కొన్ని సీన్స్ ఉన్నాయి. బాలకృష్ణకు అది రెగ్యులర్ రోల్.
కథకు కీలకమైన జనని పాత్రలో హర్షాలీ మల్హోత్రా నటన బావుంది. కానీ ఆమెకు తెలుగు డబ్బింగ్ సెట్ కాలేదు. డీఆర్‌డీవో రీసెర్చ్ అధికారి పాత్రలో సంయుక్త కనిపించారు. ఆ క్యారెక్టర్ తీసేసినా కథకు వచ్చే నష్టం లేదు. 'జాజికాయ...' సాంగ్ కోసం క్రియేట్ చేసినట్టు ఉంది. ఆ పాటలో సంయుక్త గ్లామర్ షో చేశారు. భూటాన్ నటుడు సాంగే, కబీర్ సింగ్ దుహాన్ రెగ్యులర్ విలన్ రోల్స్ చేశారు. ఆది పినిశెట్టి నటన బావున్నా... ఆ పాత్రకు ప్రాముఖ్యం లేదు. అందువల్ల రిజిస్టర్ అవ్వడం కష్టం. పూర్ణ, శాశ్వత ఛటర్జీ, అనీష్ కురువిల్లా, భరణి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. మురళీమోహన్ అతిథి పాత్ర చేశారు.
'అఖండ 2 తాండవం'... నటుడిగా నందమూరి బాలకృష్ణ రుద్ర తాండవానికి దృశ్య రూపం. 'అఖండ' క్లైమాక్స్‌లో బాలకృష్ణ ఫైట్ చేస్తుంటే శివుడి చేస్తున్నట్టు చూపిస్తే థియేటర్లు దద్దరిల్లాయ్. 'అఖండ 2 తాండవం'లో అఖండ పాత్ర చేసే మొదటి యాక్షన్ సీన్ నుంచి అటువంటి గూస్ బంప్స్ షాట్స్ ఉన్నాయి. అభిమానులకు, సనాతన ధర్మ భక్తులకు అమితంగా నచ్చుతుంది. థియేటర్లకు హ్యాపీగా వెళ్లి బాలకృష్ణ యాక్షన్ ఎంజాయ్ చేసి రావచ్చు. అలా కాకుండా దేవుడి మీద నమ్మకం లేదు, లాజిక్స్ వెతుకుతా అంటే కష్టం.





















