Revolver Rita Movie Review - 'రివాల్వర్ రీటా' రివ్యూ: డాన్‌గా సునీల్... తెలివిగా బురిడీ కొట్టించిన కీర్తి సురేష్ - కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Revolver Rita Review Telugu: 'మహానటి'తో ఉత్తమ నటిగా కీర్తి సురేష్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'రివాల్వర్ రీటా'. ఈ సినిమా సమీక్ష ఎలా ఉందంటే?
జేకే చంద్రు
కీర్తి సురేష్, సునీల్, రాధికా శరత్ కుమార్, రిడిన్ కింగ్ స్లే తదితరులు
Keerthy Suresh's Revolver Rita Movie Review In Telugu: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'రివాల్వర్ రీటా'. డాన్ పాత్రలో సునీల్, హీరోయిన్ తల్లిగా రాధికా శరత్ కుమార్, ఇతర కీలక పాత్రల్లో అజయ్ ఘోష్, జాన్ విజయ్, రిడిన్ కింగ్ స్లే తదితరులు నటించిన చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Revolver Rita Movie Story): పాండిచ్చేరిలోని ఒక ఫ్రైడ్ జాయింట్ (కేఎఫ్‌సీ తరహా షాప్)లో రీటా (కీర్తి సురేష్) ఉద్యోగి. తల్లి చెల్లెమ్మ (రాధికా శరత్ కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో ఉంటుంది. రీటా అక్క కుమార్తె మొదటి పుట్టినరోజు పార్టీ కోసం రెడీ అవుతున్న సమయంలో... పాండిచ్చేరిలోని పెద్ద డాన్ డ్రాకులా పాండ్యన్ అలియాస్ పాండీ (సూపర్ సుబ్బరాయన్) వస్తాడు. అక్కడ జరిగిన గొడవలో పాండీ మరణిస్తాడు.
పాండీని చంపాలని ఒక బ్యాచ్ స్కెచ్ వేస్తుంది. తండ్రి మిస్సయ్యాడని పాండీ తనయుడు బాబీ (సునీల్) వెతకడం మొదలు పెడతాడు. పాండీ మరణించిన విషయం బాబీకి తెలిసిందా? పాండీ తల కోసం ఐదు కోట్లు ఇవ్వడానికి రెడీ అయిన రెడ్డి (అజయ్ ఘోష్) కథ ఏమిటి? పాండీ - రెడ్డి మధ్య గొడవ ఏమిటి? మర్డర్ కేసు నుంచి రీటా అండ్ ఫ్యామిలీ ఎలా బయట పడింది? అనేది సినిమా.
విశ్లేషణ (Revolver Rita Review In Telugu): డార్క్ కామెడీ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా తమిళంలో ఆ జానర్ సినిమాలు కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఉదాహరణకు... శివకార్తికేయన్ 'వరుణ్ డాక్టర్', నయనతార 'కోకో' (కోలమావు కోకిల), విజయ్ సేతుపతి - సమంతల 'సూపర్ డీలక్స్' ఫిల్మ్స్. ఇప్పుడు కీర్తి సురేష్ ఆ జానర్ సినిమా 'రివాల్వర్ రీటా' చేశారు.
ఇప్పటి వరకు వచ్చిన డార్క్ కామెడీ సినిమాలు చూస్తే... ఆ స్ఫూర్తితో 'రివాల్వర్ రీటా' కథ, సన్నివేశాలను దర్శక రచయిత జేకే చంద్రు రాసినట్టు ఈజీగా అర్థం అవుతోంది. సినిమా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడా కొంచెం కూడా కొత్తదనం లేకుండా చంద్రు జాగ్రత్త పడ్డారు. క్యారెక్టర్ ఆర్క్, గ్రాఫ్ అనేది అసలు చూడలేదు. పాండిచ్చేరిలో పోలీసాఫీసర్ ఎవరో తెలిసిన అమ్మాయికి డాన్ తెలియకపోవడం విశేషం. డార్క్ కామెడీలో లాజిక్కులు వెతక్కూడదని ఎంత అనుకున్నా... దర్శకుడు చాలా కన్వీనియంట్‌గా సీన్స్ రాసుకోవడం, ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ వెళ్లడం చూస్తే... త్వరగా ఫినిష్ అయితే బావుంటుందని ఫీలింగ్ కలుగుతుంది. సునీల్ క్యారెక్టర్ రాసిన విధానం అసలు బాలేదు. డాన్ అని ఏ దశలోనూ ఫీలింగ్ కలగదు. తన దగ్గర చెంచాలు సైతం సలహాలు ఇస్తే డాన్ ఫాలో అవ్వడం వంటి సిల్లీ సీన్స్ రాశారు.
'రివాల్వర్ రీటా'లో కొన్ని కామెడీ సీన్లు నవ్విస్తాయి. అయితే అది దర్శకుడి ప్రతిభ కాదు. రాధికా శరత్ కుమార్, రిడిన్ కింగ్ స్లే వంటి నటులు తమ ప్రతిభతో కొన్ని సన్నివేశాలను నిలబెట్టారు. ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా సోసోగా ఉన్నాయి. 'కర్మ ఈజ్ బూమరింగ్' కాన్సెప్ట్ మీద తీసిన చిత్రమిది. అయితే... సన్నివేశాలను సరిగా రాసుకోలేదు. పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో కామెడీ కంటే ఆ సీన్లు తీసిన తీరు చాలా కామెడీగా ఉంది. అది పోలీస్ స్టేషన్ కాదు, సినిమా హాల్ అన్నట్టు విలన్స్ వెళ్లి వచేస్తారేంటో!?
రీటాగా కీర్తి సురేష్ నటన ఓకే. లుక్ నుంచి నటన వరకు ఓవర్ ప్లే చేయకుండా ఆ పాత్రకు తగ్గట్టు చేశారు. పాత్రలో నటించడానికి ప్రయత్నించారు. అయితే ఆమె నటన హైలైట్ అవ్వలేదు. రాధికా శరత్ కుమార్ నటన, కామెడీ టైమింగ్ కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తుంది. సునీల్ లుక్ బావుంది. కానీ, క్యారెక్టర్ సరిగా రాసుకోలేదు. రిడిన్ కింగ్ స్లే, అజయ్ ఘోష్ తమ తమ పాత్రలకు తగ్గట్టు చేశారు. జాన్ విజయ్ రోల్ చూస్తే... ఆయన్ను టైప్ కాస్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది.
క్లైమాక్స్ వచ్చేసరికి 'పాండీ బాడీ నా దగ్గర ఉంది' అని ఒకరి తర్వాత మరొకరు రెడ్డి (అజయ్ ఘోష్)కు ఫోన్ చేస్తుంటే... చివరకు 'నాకు వద్దు. నేను వెళ్లపోతా' అని చెబుతారు. ఆ సన్నివేశం బావుంది. నవ్విస్తుంది. అయితే... అప్పటికి ఆడియన్స్ రియాక్షన్ సన్నివేశంతో సింక్ అవుతుంది. 'ఇక చాలు... వెళ్ళిపోతాం. త్వరగా క్లోజ్ చెయ్' అన్నట్టు ఉంటుంది. డార్క్ కామెడీ సినిమా లవర్స్ కూడా 'రివాల్వర్ రీటా'ను ఎంజాయ్ చేయడం కష్టమే.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?





















