Major Telugu Movie Review - 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, అడివి శేష్ సినిమా ఎలా ఉందంటే?
Adivi Sesh's Major Review: ముంబై ఉగ్రదాడిలో తన ప్రాణాలను అడ్డుపెట్టి అనేక మందికి జీవితాల కాపాడి... అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 'మేజర్'. ఈ బయోపిక్ ఎలా ఉందంటే?
శశికిరణ్ తిక్కా
అడివి శేష్, సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు
సినిమా రివ్యూ: మేజర్
రేటింగ్: 3/5
నటీనటులు: అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు
కథ - స్క్రీన్ ప్లే : అడివి శేష్
మాటలు, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు: మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
దర్శకత్వం: శశికిరణ్ తిక్కా
విడుదల తేదీ: జూన్ 3, 2022 (జూన్ 2న పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు)
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కథానాయకుడు అడివి శేష్ (Adivi Sesh). ఆయన నటించిన తొలి పాన్ ఇండియా సినిమా 'మేజర్' (Major Movie). 26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా నిర్మాతల్లో మహేష్ బాబు ఒకరు. అడివి శేష్ నటించడం, సందీప్ బయోపిక్ కావడం, మహేష్ ప్రొడక్షన్ చేయడం... సినిమాపై ఆసక్తి పెంచాయి. ప్రచార చిత్రాలు కూడా బావున్నాయి. మరి, సినిమా (Major Movie Review) ఎలా ఉంది?
కథ (Major Movie Story): సందీప్ ఉన్నికృష్ణన్ (అడివి శేష్)కు బాల్యం నుంచి నేవీలో చేరాలని కలగంటారు. నేవీకి అప్లికేషన్ పంపిస్తారు. అయితే, రిజెక్ట్ చేయబడతారు. ఆ విషయం తండ్రి (ప్రకాష్ రాజ్)కు తెలుస్తుంది. తనకు తెలియకుండా కుమారుడు నేవీకి అప్లికేషన్ పంపించినందుకు కోప్పడతారు. అప్పటి వరకూ నేవీలో చేరాలనుకున్న సందీప్ మదిలో ఆర్మీలో చేరాలనే ఆలోచన రావడానికి క్లాస్ మేట్ ఈషా (సయీ మంజ్రేకర్) ఎలా కారణం అయ్యారు? ఆర్మీలో చేరిన తర్వాత సందీప్ ఏం చేశారు? అతని తల్లిదండ్రుల స్పందన ఏంటి? 26/11 ముంబై ఉగ్రదాడికి ముందు ఏం జరిగింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈషా నుంచి వచ్చిన లెటర్ లో ఏం ఉంది? ఉగ్రదాడి తర్వాత సందీప్ తల్లిదండ్రులు ఏం చెప్పారు? సందీప్ జీవితం ఏంటి? అనేది సినిమా.
విశ్లేషణ: 'నా కొడుకు జీవితం ఆ రోజు జరిగిన ఎటాక్స్ మాత్రమే కాదమ్మా! సందీప్ కంటూ ఒక జీవితం ఉంది' - 'మేజర్' ట్రైలర్‌లో సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి పాత్ర పోషించిన రేవతి చెప్పే మాట. సినిమా ప్రారంభంలో తండ్రి పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ సైతం ఇటువంటి మాట చెబుతారు. సినిమాలో ఆ జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
26/11 ఉగ్రదాడికి ముందు సందీప్ జీవితంలో ఏం జరిగింది? పాఠశాలలో ఈషాతో చిగురించిన ప్రేమ, తల్లిదండ్రులతో అనుబంధం, ఆర్మీ శిక్షణ తీసుకునేటప్పుడు అతడి ఆలోచనా విధానం, తాజ్ హోటల్‌లోకి వెళ్లే ముందు ఉన్నతాధికారితో జరిగిన సంభాషణలు... సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు, ఘటనల సమాహారమే 'మేజర్'.
సినిమా ఎలా ఉంది?: సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆయన తండ్రి (ప్రకాష్ రాజ్) చేత చెప్పించారు. సందీప్‌తో తనకు ఉన్నవి జ్ఞాపకాలు అని, ముందు వెనుక అంటూ ప్రారంభ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ చేత ఒక డైలాగ్ చెప్పించారు. దాన్ని స్క్రీన్ ప్లే విషయంలో దర్శక - రచయితలు శశికిరణ్ తిక్కా, అడివి శేష్ బాగా ఉపయోగించుకున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథను చెప్పాలని ప్రయత్నించారు. ఒక జీవితాన్ని రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమే. అందుకని, ముఖ్యమైన సంఘటలను చెప్పే ప్రయత్నం చేశారు. అందువల్ల, ట్రాన్స్‌ఫర్మేషన్ ఇబ్బంది కలిగించవచ్చు. కొన్నిసార్లు స్క్రీన్ ప్లే కథ నుంచి డైవర్ట్ అయ్యేలా చేస్తుంది.
అన్‌సంగ్ హీరోస్... ముఖ్యంగా ఇటువంటి సైనికుల జీవితాలను ఆవిష్కరించే సినిమాలు అన్నీ దాదాపు ఒకేలా ఉన్నట్లు అనిపిస్తాయి. ఆర్మీలోకి రావడానికి ముందు జీవితంలో ప్రేమ, వచ్చిన తర్వాత చేసిన త్యాగం... ఒక ఫార్మట్‌లో సాగుతాయి. అందుకు, 'మేజర్' కూడా అతీతం ఏమీ కాదు. సినిమా ఫస్టాఫ్‌లో సందీప్, ఈషా మధ్య ప్రేమకథతో పాటు సందీప్ ఆర్మీ ట్రైనింగ్ చూపించారు. టీనేజ్ లవ్ స్టోరీ పర్వాలేదు. అయితే, సినిమా నిదానంగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. డ్రామా ఎక్కువైంది. సెకండాఫ్‌లో ఎటాక్స్ నేపథ్యంలో సన్నివేశాలు ఎక్కువ. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ వేగంగా ముందుకు వెళుతుంది. 26/11 ఉగ్రదాడి నేపథ్యంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అందువల్ల ఆ సన్నివేశాల ప్రభావం కాస్త తగ్గింది. ఒకవేళ ఈ సినిమా ముందు వచ్చి ఉంటే... ఇంకా ఎక్కువ ప్రభావం ఉండేది.
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ బావుంది. శ్రీచరణ్ పాకాల అందించిన స్వరాల కంటే యాక్షన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం హైలైట్ అవుతుంది. అబ్బూరి రవి మాటలు కథను దాటి బయటకు వెళ్ళలేదు.
నటీనటులు ఎలా చేశారు?: సందీప్ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయారు. స్కూల్ లైఫ్, ఆర్మీ ట్రైనింగ్, ఎటాక్స్... జీవితంలో వివిధ దశలకు తగ్గట్టు తనను తాను మలుచుకున్నారు. ముఖంలో ఆ మార్పును బాగా చూపించారు. అయితే, సినిమా చూశాక థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు... ప్రీ క్లైమాక్స్‌లో ప్రాణాలకు తెగించి పోరాడే సన్నివేశంలో అడివి శేష్ నటన మాత్రమే గుర్తు ఉంటుంది. ఆ సీన్‌లో శేష్ కనబరిచిన నటన అద్భుతం. సయీ మంజ్రేకర్ తెలుగులో తన తొలి సినిమా కంటే... 'మేజర్'లో బాగా నటించారు. స్కూల్ సీన్స్‌లో బావున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె మరింత మెరుగవ్వాలి. శేష్, సయీ మధ్య కెమిస్ట్రీ బావుంది. తల్లి పాత్రలో రేవతి, ఆర్మీ అధికారిగా మురళీ శర్మ, హోటల్‌లో చిక్కుకున్న మహిళగా శోభితా ధూళిపాళ చక్కటి నటన కనబరిచారు.
సినిమాలో కనిపించిన వారందరూ ఒక ఎత్తు... ప్రకాష్ రాజ్ మరో ఎత్తు. ఆయన నటనే కాదు, మాట కూడా మనసుని తాకుతుంది. తెరపై ఆయన కనిపించకున్నా... ఆయన మాట వినిపించే సన్నివేశాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఆ సన్నివేశాలకు ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఇక, పతాక సన్నివేశాల్లో ఆయన నటన, సంభాషణలు భావోద్వేగానికి గురి చేస్తాయి. సందీప్ చైల్డ్ హుడ్ రోల్ చేసిన బాలనటుడు ముద్దొస్తాడు.
Also Read: '9 అవర్స్' రివ్యూ: వెబ్ సిరీస్ చూశాక ఆ ఒక్క ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది
ఫైనల్ పంచ్: సందీప్ ఉన్నికృష్ణన్‌కు చక్కటి నివాళి 'మేజర్' సినిమా. సందీప్ దేశభక్తి మాత్రమే కాదు, కుటుంబ జీవితాన్నీ చూపించిన చిత్రమిది. కథగా, సినిమాగా చూస్తే... ఇందులోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు ఆల్రెడీ చూసినట్లు అనిపిస్తాయి. అవన్నీ పక్కన పెడితే... థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బరువెక్కిన గుండెతో పంపించే చిత్రమిది. సందీప్ మరణం తర్వాత ఆయన తండ్రి చెప్పే మాటలు, పతాక సన్నివేశం మనసును తాకుతుంది.
Also Read: 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?