Jagamemaya Movie Review - 'జగమే మాయ' రివ్యూ : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ధన్యా బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
OTT Review - Jagamemaya Movie : ధన్యా బాలకృష్ణ, చైతన్య రావు, తేజ మైనంపూడి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'జగమే మాయ'. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
సునీల్ పుప్పాల
ధన్యా బాలకృష్ణ, చైతన్య రావు, తేజ తేజ ఐనంపూడి, పృథ్వీరాజ్ తదితరులు
సినిమా రివ్యూ : జగమే మాయ
రేటింగ్ : 1.5/5
నటీనటులు : ధన్యా బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి, పృథ్వీరాజ్, మేకా రామకృష్ణ, బీహెచ్ఈఎల్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, సుజన కందుకూరి, జ్యోతి, కేశవ్ దీపక్ తదితరులు
మాటలు : అర్జున్ కార్తీక్
ఛాయాగ్రహణం : రాహుల్ మాచినేని
సంగీతం : అజయ్ అరసాడ
సమర్పణ : మురళి లాలుకోట
నిర్మాతలు : ఉదయ్ కోలా, శేఖర్ అన్నే
కథ, దర్శకత్వం : సునీల్ పుప్పాల
విడుదల తేదీ: డిసెంబర్ 15, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ధన్యా బాలకృష్ణ (Dhanya Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జగమే మాయ'. ఇందులో '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్, 'ముఖచిత్రం' సినిమా ఫేమ్ చైతన్య రావు, తేజ మైనంపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో డిసెంబర్ 15 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా (Jagamemaya Review) ఎలా ఉందంటే?
కథ (Jagamemaya Movie Story) : ఆనంద్ (తేజ ఐనంపూడి) ఐపీఎల్ బెట్టింగుల్లో లక్షలు పోగొట్టుకుంటాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో... ప్రేమికులను బ్లాక్ మెయిల్ చేసి కొంత డబ్బు సంపాదిస్తాడు. ఆ తర్వాత అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ షిఫ్ట్ అవుతాడు. అక్కడ డిప్రెషన్ క్లాసులకు అటెండ్ అవుతాడు... ఎవరైనా డబ్బున్న అమ్మాయిని లైనులో పెట్టాలని! అతనికి చిత్ర (ధన్యా బాలకృష్ణ) పరిచయం అవుతుంది. ఆమె ఒక అనాథ. విశాఖలోని ఆశ్రమంలో పెరుగుతుంది. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అజయ్ (చైతన్య రావు) పరిచయం అవుతాడు. అజయ్, చిత్ర ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన ఆర్నెల్లకు అజయ్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. ఆ డిప్రెషన్ నుంచి బయట పడటం కోసం క్లాసులకు వస్తుంది. చిత్రను, ఆమె అత్తమామలను ఇంప్రెస్ చేసిన ఆనంద్... వాళ్ళే పెళ్లి చేసుకోమని ప్రపోజల్ తీసుకొచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు, అజయ్ యాక్సిడెంట్‌కి కారణం ఎవరు? ఎవరు ఎవరిని మోసం చేశారు? కథలో ట్విస్టుల ఏమిటి? అనేది మిగతా సినిమా. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ : 'అసలే ఆర్ట్ సినిమా హీరోలా యాక్ట్ చేయడానికి చస్తుంటే... ఈ ల్యాగ్ ఏంటో' అని ఫస్టాఫ్‌లో హీరో డైలాగ్ చెబుతాడు. బహుశా... సినిమా చూసేటప్పుడు జనాలు మనసులో మాటను ముందుగా గ్రహించి రాశారేమో!? ఎందుకంటే... ఆ సీన్ వచ్చేసరికి ఆడియన్స్ ఫీలింగ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది! ఈ ల్యాగ్ ఏంట్రా బాబూ అనుకోవాల్సిన సిట్యువేషన్ అది. సినిమా స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ గంట వరకు కథ ముందుకు కదలదు. అంతా సాగదీత వ్యవహారం! ఒక్కసారి కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. హీరో మనసులో మాటలు మనకు నవ్వు తెప్పిస్తాయి.
కామెడీ మినహా సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ట్విస్టులు ఈజీగా ఊహించవచ్చు. పెద్ద కష్టం ఏమీ కాదు. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఒక దానితో మరొకటి పోటీ పడ్డాయి. రెండిటిలో ఏది బాలేదంటే చెప్పడం కష్టం. ఈ మధ్య వచ్చే యూట్యూబ్ సిరీస్‌లలో మంచి కెమెరా వర్క్ చూడొచ్చు. మ్యూజిక్ వినొచ్చు. టెక్నికల్ పరంగా షార్ట్ ఫిల్మ్ స్టాండర్డ్స్ కూడా మైంటైన్ చేయలేదు.
నటీనటులు ఎలా చేశారంటే? : ధన్యా బాలకృష్ణ క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉన్నాయి. సినిమా స్టార్టింగులో అమాయకంగా కనిపించారు. ఆ తర్వాత గ్రే షేడ్స్ చూపించారు. నటిగా క్యారెక్టర్‌కు న్యాయం చేశారు. చైతన్య రావు పాత్ర నిడివి తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. తేజ ఐనంపూడి సినిమాలో మెయిన్ హీరో. పైన చెప్పినట్టు ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో ఆయన డైలాగ్ డెలివరీ నవ్విస్తుంది. కష్టపడితే నటుడిగా మంచి భవిష్యత్తు ఉంటుంది. అతనిలో బాయ్ నెక్స్ట్ డోర్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. పృథ్వీరాజ్ క్యారెక్టర్‌కు నత్తి ఎందుకు పెట్టారో అర్థం కాదు. దాని వల్ల కథకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు.
Also Read : ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో రూపొందిన క్రైమ్ డ్రామా 'జగమే మాయ'. కాన్సెప్ట్ ఓకే. కానీ, తీసిన విధానం బాలేదు. కొన్ని సీన్స్‌లో కామెడీ బావుంది. దాని కోసం రెండు గంటలు సినిమా చూడలేం. మరీ ఖాళీగా ఉంటే ట్రై చేయండి. లేదంటే హ్యాపీగా స్కిప్ చేయండి. సినిమా కంటే సీక్వెల్‌కు ఇచ్చిన లీడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
Also Read : 'గుర్తుందా శీతాకాలం' రివ్యూ : గుర్తుంచుకునేలా ఏమైనా ఉందా? సత్యదేవ్, తమన్నా ఎలా చేశారంటే?