Indian Police Force Review - ఇండియన్ పోలీస్ ఫోర్స్ రివ్యూ: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్
Indian Police Force amazon prime OTT series Review In Telugu: సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'. రోహిత్ శెట్టి క్రియేటర్. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
రోహిత్ శెట్టి, సుష్వంత్ ప్రకాష్
సిద్ధార్థ్ మల్హోత్రా, మయాంక్ టాండన్, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్, నికితిన్ ధీర్ శరద్ కేల్కర్ తదితరులు
amazon prime video ott
Indian Police Force Web Series Review starring Sidharth Malhotra, Vivek Oberoi and Shilpa Shetty: సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్ లాంటి బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దీనికి క్రియేటర్. సుష్వంత్ ప్రకాష్‌తో కలిసి దర్శకత్వం వహించారు. ఇందులో శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్, నికితిన్ ధీర్ (కంచె ఫేమ్), ముఖేష్ రుషి, శరద్ కేల్కర్ (సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్), మయాంక్ టాండన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఎలా ఉంది? 'గోల్‌మాల్', 'సింగమ్' సిరీస్, 'సింబ', 'సూర్యవంశీ' చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న రోహిత్ శెట్టి... 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'తో ఓటీటీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ: ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు జరుగుతాయి. వాటికి ఇండియన్ ముజాహిద్దీన్ బాధ్యత వహిస్తుంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ కమిషనర్ విక్రమ్ బక్షి (వివేక్ ఒబెరాయ్), డిప్యూటీ కమిషనర్ కబీర్ మాలిక్ (సిద్ధార్థ్ మల్హోత్రా) తీవ్రవాదుల్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. గుజరాత్ ఏటీఎఫ్ తారా శెట్టి (శిల్పా శెట్టి) ఢిల్లీ పోలీసులకు తోడవుతుంది. చేతికి చిక్కినట్టే చిక్కిన తీవ్రవాది తప్పించుకుంటాడు. ఆ తర్వాత జైపూర్, గోవాలో పేలుళ్లు జరుగుతాయి. అన్నిటికీ సూత్రధారి ఒక్కరే.
ఆ తీవ్రవాదిని పోలీసులు పట్టుకున్నారా? లేదా? కబీర్ బంగ్లాదేశ్ ఎందుకు వెళ్లారు? జగ్‌తాప్ (శరద్ కేల్కర్) ఎటువంటి సాయం చేశాడు? జరార్ లేదా హైదర్ (మయాంక్ టాండన్) ఎవరు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: రోహిత్ శెట్టి కథలు, హీరో క్యారెక్టర్లలో మాస్ ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించే, విజిల్స్ వేయించే మూమెంట్స్ ఎక్కువ. 'సింగమ్'లో అజయ్ దేవగణ్, 'సింబ'లో రణ్‌వీర్ సింగ్, 'సూర్యవంశీ'లో అక్షయ్ కుమార్... హీరో ఎవరైనా స్లో మోషన్ షాట్స్ గ్యారంటీ. హీరోయిజం ఎలివేట్ చేయడంలో రోహిత్ శెట్టికి సపరేట్ స్టైల్ ఉంది. ఆ టేకింగ్, మేకింగ్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అయితే... రోహిత్ శెట్టి సినిమాల్లో సౌత్ ఆడియన్స్‌కు కొత్తగా కనిపించే అంశాలు చాలా తక్కువ. మనం చూసేసిన కథలు, క్యారెక్టర్లను తెరపై చూస్తున్నట్టు ఉంటుంది. 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' కూడా అంతే!
కొత్తేముంది? అంతా రొటీన్ & ఓల్డ్!
ఇండియాలో బాంబు పేలుళ్లు, తీవ్రవాదుల్ని పట్టుకోవడానికి పోలీసులు, ఆర్మీ, ఇంటిలిజెన్స్ చేసే ప్రయత్నాలు... ఈ పాయింట్ మీద వచ్చిన వెబ్ సిరీస్ లేదా సినిమాలు కోకొల్లలు. 26/11 టెర్రర్ ఎటాక్స్ బేస్ చేసుకుని వచ్చినవీ ఓటీటీల్లో చాలా ఉన్నాయి. వాటితో పోలిస్తే... 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో కించిత్ కొత్తదనం లేదు. సేమ్ ఓల్డ్ రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ట్విస్ట్స్! లాస్ట్ ఎపిసోడ్ చూస్తున్నంత సేపూ తెలుగు ప్రేక్షకులకు అడివి శేష్ 'గూఢచారి', అక్కినేని నాగార్జున 'వైల్డ్ డాగ్' సినిమాలు గుర్తొస్తే ఆశ్చర్యం లేదు.
కథ పక్కన పెడితే... క్యారెక్టర్లలోనూ కొత్తదనం లేదు. ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఆ మతానికి చెందిన యువకులు తీవ్రవాదం వైపు ఆకర్షితులై దేశం మీద దాడులకు పాల్పడటం, దేశంపై ప్రేమతో ప్రాణత్యాగానికి సిద్ధపడిన ముస్లిం పోలీస్ లేదా ఆర్మీలో చేరడం... వెబ్ సిరీస్ లేదా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. రోహిత్ శెట్టి అండ్ టీమ్ మరోసారి ఆ క్యారెక్టర్లను తీసుకుని సిరీస్ చేశారు.
గ్లోబ్ ట్రాంటింగ్... హాలీవుడ్ తరహాలో!
గ్లోబ్ ట్రాంటింగ్... మహేష్ బాబు, రాజమౌళి సినిమా కారణంగా ఈ జానర్ ఏమిటో తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసింది. 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' సైతం గ్లోబ్ ట్రాంటింగ్ వెబ్ సిరీస్. ఇండియాలో వివిధ లొకేషన్లలో కథ జరిగింది. చివరకు బంగ్లాదేశ్ కూడా వెళ్లింది. అయితే... ఏ దశలోనూ సిరీస్ ఆసక్తి కలిగించలేదు. డ్రోన్ / ఏరియల్ వ్యూ షాట్స్ తీయడానికి దర్శకులకు అవకాశం లభించిందంతే. ఆ షాట్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి.
అయితే... కథలో ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు. ఎంత సేపటికీ ముందుకు కదలని కథ, నిడివి వీక్షకులను టీవీ / ల్యాప్ టాప్ స్క్రీన్స్ ముందు కూర్చోవడానికి ఇబ్బంది పెడతాయి. కొన్ని సీన్లు సిల్లీగా తీశారు. సినిమాల్లో కమర్షియాలిటీ ఓకే. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో టెర్రరిస్ట్ బేస్డ్ వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్'తో కంపేర్ చేస్తే... తీవ్రవాదుల్ని పట్టుకోవడానికి వెళ్లే ఆఫీసర్లు ఎలా ఉంటారు? అనే విషయంలో రోహిత్ శెట్టి అండ్ కో మినిమమ్ రీసెర్చ్ చేయలేదని అర్థం అవుతుంది. కమర్షియల్ టచ్ ఇవ్వడానికి ట్రై చేశారు తప్ప లాజిక్స్ పట్టించుకోలేదు.
యాక్షన్ సీక్వెన్సుల్లో రోహిత్ శెట్టి మార్క్
రోడ్డు మీద భారీ ఛేజింగ్స్, గాల్లోకి లేచే కార్లు... రోహిత్ శెట్టి సినిమాల్లోని యాక్షన్ సీక్వెన్సుల్లో తప్పకుండా కనిపిస్తాయి. 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లోనూ ఆ తరహా సీన్లు ఉన్నాయి. శెట్టి అభిమానులను అవి మెప్పించవచ్చు. మిగతా వాళ్లకు కష్టమే. టెక్నికల్ పరంగా చూసినా ఆకట్టుకునే అంశాలు పెద్దగా లేవు. రోహిత్ శెట్టి కథ, దర్శకత్వంలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా నేపథ్య సంగీతం లేదు. తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు.
విలన్ మయాంక్ టాండన్ నచ్చుతాడు!
సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ క్యారెక్టర్లు రెగ్యులర్ రోహిత్ శెట్టి సినిమాల్లో హీరోల తరహాలో ఉన్నాయి. లేడీ పోలీస్ ఆఫీసర్ శిల్పా శెట్టి రోల్ కూడా అంతే! తమ తమ పాత్రల పరిధి మేరకు వాళ్లు నటించారు. సిద్ధార్థ్ భార్యగా ఇషా తల్వార్, వివేక్ భార్యగా శ్వేతా తివారి పాత్రలు పరిమితమే. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడు ముఖేష్ రుషి కీలక పాత్రలో కనిపించారు. నటీనటులు అందరిలో విలన్ రోల్ చేసిన మయాంక్ టాండన్ మెజారిటీ ప్రేక్షకులకు నచ్చుతాడు. అతను బాగా నటించాడు.
Also Read: కాదల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా
ఓటీటీ కోసం రోహిత్ శెట్టి కొత్తగా ప్రయత్నించలేదు. తమ టీంతో తనకు అలవాటైన రీతిలో వెబ్ సిరీస్ తీశారు. కథ, కథనం, క్యారెక్టర్లలో కొత్తదనం లేదు. అయితే... తన నుంచి అభిమానులు ఆశించే మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని అందించారు. బహుశా... థియేటర్లలో అయితే విజిల్స్ పడతాయేమో!? 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' ఓటీటీ రిలీజ్ కదా... చిన్న స్క్రీన్ మీద ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం, ఎంజాయ్ చేయడం కష్టమే!
Also Read: #90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ : ఈటీవీ విన్‌లో శివాజీ నటించిన వెబ్ సిరీస్