Chaari 111 Movie Review - చారి 111 రివ్యూ: 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Chaari 111 review in Telugu: స్టార్ కమెడియన్ 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన 'చారి 111' థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
టీజీ కీర్తీ కుమార్
మురళీ శర్మ, వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, సత్య, పావనీ రెడ్డి, బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్ తదితరులు
Vennela Kishore's Chaari 111 movie review in Telugu: హాస్య నటుడిగా 'వెన్నెల' కిశోర్ నవ్వించిన సినిమాలు కోకొల్లలు. ఆయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన హీరోగా నటించారంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. మరి, 'చారి 111' ఎలా ఉంది? 'మళ్ళీ మొదలైంది' ఫేమ్ టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం ఎలా ఉంది? మురళీ శర్మ, హీరోయిన్ సంయుక్తా విశ్వనాథన్ ఎలా నటించారు? అనేది రివ్యూలో చూడండి.
కథ (Chaari 111 Movie Story): రా, ఎన్ఐఏ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఏజెన్సీలు దేశంలో ఉన్నాయి. అయితే అవి చట్టాలకు లోబడి పని చేస్తాయి. దేశరక్షణ కోసం, దేశవిద్రోహులు & తీవ్రవాదుల ఆట కట్టించడానికి... ఎటువంటి రూల్స్ లేకుండా పని చేసేలా మాజీ ఆర్మీ అధికారి రావు... ప్రసాద్ రావు (మురళీ శర్మ) నేతృత్వంలో 'రుద్రనేత్ర' ఏజెన్సీ ఏర్పాటు చేస్తాడు ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్). ఆయన మరణించిన తర్వాత కుమారుడు (రాహుల్ రవీంద్రన్) ముఖ్యమంత్రి అవుతాడు. రుద్రనేత్రకు ఆయన కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాడు. రుద్రనేత్ర చరిత్ర పక్కన పెడితే...
హైదరాబాద్ సిటీ మాల్‌లో మానవ బాంబు దాడి (హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్) జరిగిన తర్వాత ముఖ్యమంత్రి, రుద్రనేత్ర ఏజెన్సీ అలర్ట్ అవుతాయి. ఆ కేసును ఏజెంట్ చారి (వెన్నెల కిశోర్)కి అప్పగిస్తారు. సీరియస్ కేసును కామెడీ చేయడం అతని స్టైల్. కన్‌ఫ్యూజ్ అయ్యి, తర్వాత ఫ్రస్ట్రేషన్‌కు లోనై ఏదేదో చేస్తాడు. మరి, మానవ బాంబు దాడికి కారణం ఎవరో చారి తెలుసుకున్నాడా? ఏజెంట్ ఇషా (సంయుక్తా విశ్వనాథన్), ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Chaari 111 Review): 'చారి 111' టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్‌గా అనిపించాయి. మంచి కామెడీ సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ ప్రేక్షకులకు ఇచ్చాయి. 'పింక్ పాంథర్', 'జానీ ఇంగ్లీష్' స్ఫూర్తితో తీశానని దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ చెప్పడం, 'వెన్నెల' కిశోర్ హీరో కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...
కథగా చూస్తే... 'చారి 111'లో విషయం ఉంది. హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ పరంగానూ కొత్త పాయింట్ టచ్ చేశారు. న్యూ ఏజ్ కాన్సెప్ట్, సిల్లీ కామెడీ ఇంటర్వెల్ వరకు హిలేరియస్‌గా నవ్వించాయి. క్యూరియాసిటీ కలిగించాయి. ఇంటర్వెల్ తర్వాత మానవ బాంబు దాడికి కారణమైనది ఎవరు? అనేది చెప్పే క్రమంలో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశారు. అక్కడ వెన్నెల కిశోర్ నుంచి ఆశించే కామెడీ తగ్గింది. సీరియస్ సీన్లు ఎక్కువ అయ్యాయి. దాంతో కొన్ని బోరింగ్ మూమెంట్స్ ఉన్నాయి.
టీజీ కీర్తీ కుమార్ స్టైలిష్‌గా తీశారు. కామెడీ సీన్లలో మంచి పట్టు చూపించారు. 'చారి 111' మేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. ముఖ్యంగా సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం పెప్పీగా, ట్రెండీగా సాగింది. సినిమాలో సపరేట్ లవ్ ట్రాక్, సాంగ్స్ పెట్టకుండా మంచి పని చేశారు.
చారిగా 'వెన్నెల' కిశోర్ (Vennela Kishore) తనదైన శైలిలో నటించారు. స్టార్టింగ్ టు ఎండింగ్... ఆయనపై బిల్డప్ షాట్స్ తీయలేదు. హీరోయిజం కోసం స్పెషల్ కేర్ తీసుకోలేదు. ఆయన నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీకి లోటు లేకుండా చూసుకున్నారు. 'leave' నేపథ్యంలో సన్నివేశాలు వచ్చిన ప్రతిసారీ 'వెన్నెల' కిశోర్ చెలరిగిపోయారు. అక్కడ ఆయన టైమింగ్, డైలాగ్ డెలివరీ సూపర్బ్.
Also Read: ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ: వరుణ్ తేజ్ దేశభక్తి సినిమా హిట్టా? ఫట్టా?
హీరోయిన్ సంయుక్తా విశ్వనాథన్ (Samyuktha Viswanathan)కు తెలుగులో ఇంత కంటే మంచి క్యారెక్టర్ డెబ్యూ మూవీలో లభించదు ఏమో!? యాక్షన్ సీక్వెన్సుతో ఆమె ఇంట్రడ్యూస్ అయ్యారు. అందులో గ్లామర్ కూడా చూపించారు. మురళీ శర్మ నటన ఆ పాత్రకు హుందాతనాన్ని తెచ్చింది. 'స్వామి రారా' సత్య, 'తాగుబోతు' రమేష్ కొన్ని సీన్లలో నవ్వించారు. బ్రహ్మాజీ, రాహుల్ రవీంద్రన్, శుభలేఖ సుధాకర్, పావని రెడ్డి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే 'వెన్నెల' కిశోర్ కామెడీని ఎంజాయ్ చేయవచ్చు. హాలీవుడ్ ప్రభావం ఉన్నప్పటికీ... స్పై యాక్షన్ కామెడీ జానర్‌లో 'చారి 111' తెలుగు వరకు కొత్త ప్రయత్నం.
Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు