Pushpa Movie Review - 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Allu Arjun - Sukumar's Pushpa Movie Review: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'పుష్ప'. నేడు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?
Sukumar
Allu Arjun, Rashmika Mandanna, Fahad Fazil, Sunil, Dhananjay, Anasuya Bharadwaj and others
సినిమా రివ్యూ: పుష్ప
రేటింగ్: 3/5
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ, రావు రమేష్, అజయ్ ఘోష్, అజయ్, శత్రు తదితరులతో పాటు ప్రత్యేక పాటలో సమంత
ఆర్ట్ డైరెక్షన్: ఎస్. రామకృష్ణ, మోనిక నిగోత్రే
మాటలు: శ్రీకాంత్ విస్సా
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ .ఆర్, రూబెన్
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, పీటర్ హెయిన్
కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కో-ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్
విడుదల తేదీ: 17-12-2021
అల్లు అర్జున్(Allu Arjun)ను 'ఆర్య' సినిమాతో తెలుగులో యువ ప్రేక్షకులకు దగ్గర చేసిన దర్శకుడు సుకుమార్ (Sukumar). అల్లు అర్జున్‌కు మలయాళంలో మార్కెట్ ఏర్పడటానికి కారణం కూడా ఆ సినిమాయే. 'ఆర్య' తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో 'ఆర్య - 2' వచ్చింది. అందులో హీరోది నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా 'పుష్ప: ద రైజ్' (Pushpa The Rise). రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. దీంతో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. 'ఆర్య', 'ఆర్య 2'కు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్, ఈ సినిమాకూ సంగీతం అందించారు. 'దాక్కో దాక్కో మేక', 'శ్రీవల్లి' పాటలు... ముఖ్యంగా సమంత (Samantha) డాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావా... ఊఊ అంటావా' ప్రేక్షకుల్లోకి వెళ్లాయి. ప్రచార చిత్రాలు చూస్తే... రా అండ్ రస్టిక్ ఫీల్ తీసుకు వచ్చాయి. మరి, సినిమా ఎలా ఉంది? స్టయిలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ ఎదిగిన (ఈ సినిమాతో అల్లు అర్జున్‌కు ఐకాన్ స్టార్ బిరుదు ఇచ్చారు సుకుమార్) బన్నీ ఎలా చేశారు? సుకుమార్ దర్శకత్వం ఎలా ఉంది?
కథ: పుష్ప... పుష్ప రాజ్ (అల్లు అర్జున్) శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికే ఒక కూలి. పోలీసులకు అందరూ భయపడే పారిపోతుంటే... అతడు తగ్గేది లే అంటూ ధైర్యంగా ముందడుగు వేస్తాడు. కూలీ నుంచి కొండారెడ్డి బ్రదర్స్ (అజయ్ ఘోష్, ధనుంజయ)కు కుడి భుజంగా మారుతాడు. ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కొండా రెడ్డి బ్రదర్స్ వంటి వారు ఎంతోమంది కలిసి ఏర్పాటు చేసుకున్న సిండికేట్ నాయకుడు మంగళం శ్రీను (సునీల్)కు ఎదురు తిరుగుతాడు. పుష్పతో పాటు కొండా రెడ్డి బ్రదర్స్ కూడా మంగళం శ్రీనును కాదని మరొకరికి ఎర్రచందనం అమ్మడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఏమైంది? తమకు కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెడుతున్న పుష్పను కొండారెడ్డి బ్రదర్స్ ఎందుకు చంపాలనుకున్నారు? తనను చంపాలనుకున్న వారిని పుష్ప ఎందుకు కాపాడాడు? ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో రాకతో పరిస్థితులు ఎలా మారాయి? మధ్యలో శ్రీవల్లి (రష్మిక)తో అతడి ప్రేమాయణం ఏమిటి? కుటుంబ నేపథ్యం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: పుష్ప సినిమా గురించి మాట్లాడాలంటే ముందు రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి... అల్లు అర్జున్ నటన గురించి. రెండు... దర్శకుడు సుకుమార్ క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు గురించి, ఆ క్యారెక్టర్లను కలిపిన విధానం గురించి! ఒక్క అల్లు అర్జున్ క్యారెక్టరే కాదు, సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ను సుకుమార్ బాగా డిజైన్ చేశారు. ఉదాహరణకు... అజయ్ క్యారెక్టర్ తీసుకుంటే, ముందు నుంచి అతడు ఒకటే స్టాండ్ మీద ఉంటాడు. తన తండ్రి ఉంచుకున్న ఆవిడకు పుట్టినవాడు తన తమ్ముడు కాదని, తమ ఇంటిపేరు వాళ్లు వాడుకోవడానికి వీల్లేదని! అలాగే,ధనుంజయ క్యారెక్టర్... నచ్చిన అమ్మాయిపై అఘాయిత్యం చేసే కామాంధుడిగా చూపించారు. 'విక్రమార్కుడు'లో విలన్ కొడుకు క్యారెక్టర్ అలాగే ఉంటుంది. సునీల్, అనసూయ తరహా జోడీను గతంలో చూసినట్టు ఉంటుంది! అయితే... ఈ క్యారెక్టర్లను సుకుమార్ ఓ చోటుకు చేర్చిన తీరు, కథలో సందర్భానుసారం ఉపయోగించుకున్న విధానం బావుంటుంది. ఇంటిపేరు వల్ల హీరోకు ఎక్కడెక్కడ ఎటువంటి అవమానాలు ఎదురయ్యాయి? అవమానం నుంచి అతడు ఎలా మారాడు? అనేది సుకుమార్ ఆసక్తిగా చూపించారు. అయితే... కథలో ఊహకు అందని మలుపులు ఏమీ ఉండవు. ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా సినిమా వెళుతుంది. హీరోయిజాన్ని ప్రేక్షకుడు సులభంగా ఊహిస్తాడు. సినిమాకు అది మైనస్. ఇంకొకటి... సరైన, బలమైన విలన్ రోల్స్ లేకపోవడం! విలన్లు ఉన్నారంటే ఉన్నారు. హీరోను ఛాలెంజ్ చేసే స్థాయిలో స్ట్రాంగ్ విలన్ రోల్స్ లేవు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో 'ఊ అంటావా... ఊఊ అంటావా', 'చూపే బంగారం...' పాటలు కొన్నాళ్లు వినపడతాయి. 'ఏయ్ బిడ్డా... ఇది నా అడ్డా' సాంగ్ కూడా బావుంటుంది. అయితే... నేపథ్య సంగీతం విషయంలో దేవి శ్రీ ప్రసాద్ డిజప్పాయింట్ చేశారు. యాక్షన్ సీన్స్ బావున్నాయి. వాటితో పాటు హీరోయిజం మరింత ఎలివేట్ చేసే స్థాయిలో నేపథ్య సంగీతం లేదని చెప్పాలి. నిడివి కూడా ఎక్కువే. సినిమాటోగ్రఫీ సూపర్. ప్రొడక్షన్ వేల్యూస్ టాప్ క్లాస్. స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఫస్టాఫ్ చూశాక... సెకండాఫ్‌లో హీరోయిజం మరింత ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. అది కూడా మిస్ అయింది. అయితే... అటువంటి లోపాలను చాలావరకూ తన నటనతో కవర్ చేశారు అల్లు అర్జున్.
సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ... అల్లు అర్జున్ ఎక్కడా క్యారెక్టర్ డిజైన్ నుంచి బయటకు రాలేదు. ఓ భుజం పైకెత్తి... గూని ఉన్నవాడిగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం నుంచి యాస వరకూ ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కోసం అల్లు అర్జున్ పరితపించారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ బాగా చేశారు. 'తగ్గేదే లే...' అంటూ చెప్పే డైలాగ్స్ బావున్నాయి. పల్లెటూరి అమ్మాయిగా శ్రీవల్లి పాత్రలో రష్మిక అంతగా సూట్ అయినట్టు అనిపించదు. 'రంగస్థలం'లో సమంతలా సెట్ కాలేదు. అయితే... అల్లు అర్జున్, రష్మిక మధ్య సీన్స్ ఎంటర్టైన్ చేస్తాయి. స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా... ఊఊ అంటావా'లో సమంత హావభావాలు, స్టెప్పులు మాస్, యూత్ ప్రేక్షకులను అలరిస్తాయి. నటుడిగా సునీల్ తన పాత్రకు న్యాయం చేశారు. కానీ, అతడి పాత్రను చివరకు ముగించిన విధానం బాలేదు. అనసూయ రెండు మూడు సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఫహాద్ ఫాజిల్ కనిపించింది తక్కువసేపు అయినా... నటుడిగా తన మార్క్ చూపించారు.
సినిమాలో ఎందరు నటీనటులు ఉన్నప్పటికీ... అందరినీ అల్లు అర్జున్ డామినేట్ చేశారు. క్యారెక్టర్ మేనరిజమ్స్, యాక్టింగ్ పరంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటారు. నటుడిగా, హీరోగా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో 'పుష్ప' అని చెప్పాలి. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ఆకట్టుకుంటారు. ఐకాన్ స్టార్ అభిమానులకు సినిమా నచ్చుతుంది. ఒక్కటి మాత్రం నిజం... 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనేది 'బాహుబలి 2' కోసం ప్రేక్షకులు ఎదురుచూసేలా చేసింది. అటువంటి క్లైమాక్స్, షాకింగ్ ఎలిమెంట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటకు వచ్చేటప్పుడు ఆ విషయంలో కొంత డిజప్పాయింట్ అవుతాడు.