Adbhutham Review: అద్భుతం సమీక్ష: అద్భుతంగా లేకపోయినా ఆకట్టుకుంటుంది
తేజ సజ్జ హీరోగా నటించిన అద్భుతం సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందంటే?
మల్లిక్ రామ్
తేజ సజ్జ, శివాని రాజశేఖర్, సత్య, శివాజీ రాజా తదితరులు
రేటింగ్: 2.75/5
ప్రధాన తారాగణం: తేజ సజ్జ, శివాని రాజశేఖర్, సత్య, శివాజీ రాజా తదితరులు
సంగీతం: రథన్
నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్ బ్యానర్
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: మల్లిక్ రామ్
విడుదల: 19-11-2021
తేజ సజ్జ, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా.. కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అద్భుతం’. అ, జాంబీ రెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ కథను అందించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. క్రాస్ టైం కనెక్షన్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా?
కథ: సూర్య(తేజ సజ్జ) వై టీవీ అనే చానెల్లో యాంకర్‌గా పని చేస్తూ ఉంటాడు. ఉన్నట్లుండి హైదరాబాద్‌లో ఒకరోజు వాతావరణం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సెల్‌ఫోన్ కాల్స్ జంప్ వంటివి జరుగుతున్నాయని కథనాలు వస్తూ ఉంటాయి. జీవితం తను అనుకున్నట్లు సాగకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. బిల్డింగ్ మీద నుంచి దూకే సమయానికి తనకు తన నంబర్ నుంచే మెసేజ్ వస్తుంది. కానీ అవతలి వైపు మెసేజ్ చేసేది వెన్నెల(శివాని రాజశేఖర్) అనే అమ్మాయి. కొన్నాళ్లు పరిచయం పెరిగాక సూర్య 2019లోనూ, వెన్నెల 2014లోనూ ఉన్నారని ఇద్దరికీ తెలుస్తుంది. అక్కడ నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? వారి జీవితం చివరికి ఏం అయింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ: ఈ సినిమా చూశాక ఈ సంవత్సరమే విడుదలై సూపర్ హిట్ అయిన ప్లేబ్యాక్ గుర్తొస్తే అది మీ తప్పు కాదు. ఎందుకంటే కథ రాసిన ప్రశాంత్ వర్మ తీసుకున్న లైన్ ఇదే. ఈ సినిమాను తాము ఎప్పుడో మొదలుపెట్టామని తేజ సజ్జ ఇప్పటికే కొన్నిసార్లు చెప్పాడు. అయినా ఈ కాన్సెప్ట్‌తో ఆల్రెడీ ప్లేబ్యాక్ వచ్చి హిట్ కొట్టేసింది. కాబట్టి మళ్లీ ఆ కాన్సెప్ట్‌తో సినిమా అంటే ప్రేక్షకులకు ఫ్రెష్‌గా ఏమైనా చూపించాలి. ఈ రెండు సినిమాలు క్రాస్‌టైం కనెక్షన్ కాన్సెప్ట్ ఆధారంగానే రూపొందాయి. అంటే వేర్వేరు కాలాల మధ్య వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ ఏర్పడటం. అలా అని టైమ్ ట్రావెల్ కూడా కాదు. అయితే ఆ కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథలు వేరుగా ఉన్నాయి.
అద్భుతంలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను దర్శకులు మల్లిక్ రామ్ కొంచెం కొత్తగా తెరకెక్కించాడు. దీంతోపాటు హీరో ఫ్రెండ్‌గా సత్య కామెడీ బాగా వర్కవుట్ అవ్వడంతో సినిమా పెద్దగా బోర్ కొట్టదు. ఈ రెండు సినిమాలకు మధ్య ఉన్న పెద్ద తేడా టైంలైన్ మధ్య గ్యాప్. ప్లేబ్యాక్ సినిమాల్లో కథ జరిగే రెండు కాలాల మధ్య తేడా 25 సంవత్సరాల వరకు ఉంటే.. అద్భుతంలో అది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే.
కథ వేరు అయినా.. స్క్రీన్ ప్లే మాత్రం ప్లేబ్యాక్ తరహాలోనే ఉండటం మైనస్ పాయింట్. భవిష్యత్తులో ఉన్నవారు జరిగిన సంఘటనలు గతంలో ఉన్న వారికి చెప్పడం.. వారు అది మొదట నమ్మకపోయినా తర్వాత ఆ సంఘటనలు జరిగినప్పుడు నమ్మడం వంటి సీన్లు ఇందులోనూ ఉన్నాయి. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్‌కు ఆదిత్య 369 కూడా గుర్తొస్తుంది. రన్‌టైం 2 గంటల 21 నిమిషాలుగా ఉంది. కొంచెం ట్రిమ్ చేసి 2 గంటల్లో ముగిస్తే సినిమా క్రిస్పీగా ఉండేది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. సూర్యగా తేజ సజ్జ నటన ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు నటించిన మూడు సినిమాల కంటే ఈ సినిమాలో మెరుగ్గా నటించాడు. ఎమోషనల్ సీన్లు, క్లైమ్యాక్స్‌లో తను మంచి నటన కనపరిచాడు. ఇక శివాని రాజశేఖర్ కూడా నటనలో మంచి మార్కులే కొట్టేసింది. సత్య తన కామెడీతో నవ్వించగా.. శివాజీ రాజా పాత్రకు ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంది. మిగతా నటీనటులందరూ తమ పరిధిలో బాగానే నటించారు.
సాంకేతిక నిపుణుల్లో ముందుగా కెమెరామెన్ విద్యా సాగర్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ విజువల్స్. ప్రతి సీన్ చాలా రిచ్‌గా.. ఒక పెద్ద హీరో సినిమా స్క్రీన్ మీద చూస్తున్నామా అన్నట్లు ఉంటుంది. తను ఎంచుకున్న బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కూడా అద్భుతంగానే ఉన్నాయి. రథన్ సంగీతంలో ఒకట్రెండు పాటలు వినడానికి, చూడటానికి కూడా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉండాల్సింది. లక్ష్మీ భూపాల రాసిన మాటలు బాగున్నప్పటికీ.. కథనం కొత్తగా ఉంటే బాగుండేది.
ఓవరాల్‌గా చూసుకుంటే.. ఈ అద్భుతం మరీ అద్భుతంగా లేకపోయినా ఆకట్టుకునేలానే ఉంది. కాన్సెప్ట్ ఇప్పటికే చూసేసిందే అయినప్పటికీ.. ట్రీట్‌మెంట్ కాస్త వేరుగా ఉంది. దీంతోపాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా సినిమాను రూపొందించారు. ఈ వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాను చూడాలనుకుంటే అద్భుతం మీకు మంచి చాయిస్.