Symptoms of Kidney Disease: మీ చర్మం ఇలా మారుతుందా? జాగ్రత్త, ఈ లక్షణాలు కిడ్నీ సమస్యలకు సంకేతాలు
మీ కిడ్నీలో సమస్యలు ఉంటే.. మీ చర్మం ముందుగానే చెప్పేస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. లేకపోతే నిత్యం అనారోగ్యంతో ముప్పుతిప్పలు పడాలి. మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన కిడ్నీలు(మూత్రపిండాలు) పాడైతే వెంటనే గుర్తించలేం. వ్యాధి ముదిరిన తర్వాతే లక్షణాలు బయటపడతాయి. అయితే, ముందుగా కనిపించే కొన్ని సంకేతాల ద్వారా కిడ్నీ సమస్యలను గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మంపై కనిపించే ఈ ఐదు లక్షణాలు మీలో కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
కాలానుగుణంగా మన చర్మం రకరకాలుగా స్పందిస్తుంది. చల్లని వాతావరణంలో శరీరం పొడిబారి దురద పుడుతుంది. వేసవిలో చెమట వల్ల కూడా దురద పుడుతుంటుంది. అయితే, ఇవన్నీ సర్వసాధారణమే. కానీ, కొన్ని సార్లు వీటిని నిర్లక్ష్యం చేయడం కూడా అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చర్మంపై కనిపించే కొన్ని లక్షణాలు తీవ్రమైన అంతర్లీన కారణాలను సూచిస్తాయని అంటున్నారు. వాటిలో కొన్ని మూత్రపిండాలు(కిడ్నీలు)తో ముడిపడి ఉండవచ్చని అంటున్నారు. ఆ లక్షణాలేమిటో చూసేయండి.
దురదలు ఏర్పడటం: నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ (NKF) ప్రకారం.. చర్మం పొడిగా లేదా దురదగా ఉండటం అనేది మూత్రపిండ వ్యాధికి సాధారణ సంకేతం. మీలో లక్షణం కనిపిస్తే.. మీ చర్మం గరుకు మారుతుంది. పొలుసులు, పగుళ్లతో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు చాలా ముఖ్యమైన పనులను చేస్తాయి. అవి మీ శరీరం నుంచి వ్యర్థాలు, అదనపు ద్రవాలను తొలగిస్తాయి. ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడతాయి. ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. మీ రక్తంలో సరైన మొత్తంలో ఖనిజాలను నిర్వహించడానికి పని చేస్తాయి. పొడిబారిన, చర్మం దురద పెట్టడం ఎముకల వ్యాధికి కూడా సంకేతం కావచ్చు. ఇది కూడా మూత్రపిండ వ్యాధితో పాటు వస్తుంది. మీ రక్తంలో ఖనిజాలు, పోషకాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మూత్ర పిండాలు సక్రమంగా పనిచేయవు.
చర్మం రంగు మారడం: కొందరిలో చర్మం రంగు కూడా మారుతుంది. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లక్షణం కూడా కావచ్చు. మీ శరీరంలో టాక్సిన్స్ ఏర్పడినా, మీ మూత్రపిండాలు మీ రక్తాన్ని ఫిల్టర్ చేయకపోయినా చర్మం రంగు మారవచ్చు అని ‘ఫ్రెసెనియస్ కిడ్నీ కేర్’ సంస్థ తెలిపింది. మీ చర్మం బూడిదరంగు లేదా పసుపు, నల్లగా మారినట్లయితే సందేహించాలి. మీ చర్మం అతిగా దురపెడుతూ.. రంగులు మారడం లేదా లేత ఎర్ర రంగు బొడిపెలు ఏర్పడినా వైద్యుడిని సంప్రదించాలి.
శరీరం వాపు: మూత్రపిండాల వ్యాధికి వాపు (ఎడెమా) మరో సాధారణ లక్షణం. ఎందుకంటే మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు ద్రవాలు, ఉప్పును తొలగించే బాధ్యత వహిస్తాయి. కిడ్నీలు పేలవంగా పని చేస్తున్నప్పుడు శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. దీని వలన కాళ్లు, చీలమండలు, పాదాలు, ముఖం లేదా చేతుల్లో వాపు ఏర్పడుతుంది. కిడ్నీ సమస్యలున్న చాలామందిలో కళ్ల చుట్టూ వాపు లేదా ఉబ్బినట్లు ఉంటుంది. మీ కాళ్లు లేదా కళ్ల వాపు ఎక్కువ రోజులు కొనసాగితే తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ‘నేషనల్ కిడ్నీ ఫౌండేషన్’ తెలిపింది.
చర్మంపై దద్దుర్లు: చర్మంపై పొక్కులు, దద్దర్లు ఏర్పడినట్లయితే మూత్రపిండ వ్యాధికి మరొక సంకేతంగా భావించాలి. మీ శరీరం నుంచి మూత్రపిండాలు వ్యర్థాలను తొలగించలేనప్పుడు, దద్దుర్లు ఏర్పడతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ (AAD) తెలిపింది. ఎండ్-స్టేజ్ కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో సంభవించే ఒక దద్దుర్లు చిన్న, గోపురం ఆకారంలో గడ్డల్లా ఉంటాయి. ఇవి చాలా దురద కలిగిస్తాయి. ఈ గడ్డలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు చిన్న గడ్డలన్నీ ఒకే చోట కలిసి పాచెస్‌గా కనిపిస్తాయి. మూత్రపిండ వ్యాధి తుది దశలో ఉన్న రోగుల చేతులు, ముఖం లేదా పాదాలపై బొబ్బలు కూడా ఏర్పడవచ్చు.
Also Read: చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోతారా? తాజా అధ్యయనంలో ఏం తేలింది?
కాల్షియం డిపాజిట్స్: కొన్నిసార్లు మూత్రపిండ రోగులు చర్మంలో కాల్షియం డిపాజిట్స్ కూడా కనిపిస్తాయి. మూత్రపిండాలకు అనేక పనులు చేస్తుంటాయి. మీ రక్తంలో సోడియం, ఫాస్ఫేట్ వంటి కొన్ని ఖనిజాలను సమతుల్యం చేస్తుంటాయి. మూత్రపిండాలు అందులో విఫలమైతే సోడియం, ఫాస్పేట్ తదితర ఖనిజాల స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా చర్మంలో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. మోచేతులు, మోకాలు లేదా వేళ్ల కీళ్ల వద్ద ఇది ఏర్పడుతుంది. కాబట్టి, పై లక్షణాల్లో ఏది గమనించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Also Read: హెలికాప్టర్‌ను కూల్చేసిన షార్క్, కిరణ్ బేడీని తిట్టిపోస్తున్న నెటిజన్స్, ఎందుకంటే..
గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య ప్రచురుణల ఆధారంగా ఈ కథనాన్ని.. మీ అవగాహన కోసం అందించాం. ఇది వైద్యుల సలహాలు సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. మీకు దీనిపై ఎలాంటి సందేహాలున్నా డాక్టర్‌ను సంప్రందించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించవు.