World's Highest ATM:ఈ ATMలో డబ్బులు తీయాలంటే 4,693 మీటర్ల పర్వతం ఎక్కాలి, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏటీఎం!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏటీఎం చైనా-పాకిస్తాన్ మధ్య ఖుంజెరాబ్ పాస్ సరిహద్దు దగ్గర ఉంది. 4,693 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరం మీద నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ దీనిని 2016లో ఏర్పాటు చేసింది.
ఏటీఎం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉపయోగకరమైన మిషన్. నిత్యం కోట్లాది మంది ప్రజలు వీటి ద్వారా నగదు లావాదేవీలు జరుపుతారు. ఆయా బ్యాంకులు రద్దీ ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసి తమ కస్టమర్లకు నగదు పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇదే ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం అరుదైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఇన్ స్టాల్ చేసిన ఏటీఎంగా గుర్తింపు పొందింది.
పాకిస్తాన్ ఉత్తర గిల్గిట్- బాల్టిస్తాన్ ప్రావిన్స్ లోని ఖుంజెరాబ్ పాస్ సరిహద్దు పాస్ ప్రాంతంలో ఈ ఏటీఎం ఏర్పాటు అయ్యింది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (NBP) 2016లో దీనిని ఇన్ స్టాల్ చేసింది. ఈ ఏటీఎం సౌర, పవన శక్తితో పని చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరిహద్దు క్రాసింగ్ అయిన ఖుంజెరాబ్ పాస్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు, ఈ ఏటీఎం అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఏటీఎంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది.
ఈ ఏటీఎంను ఏర్పాటు చేయడానికి నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కు సుమారు నాలుగు నెలల సమయం పట్టింది. మెయింటెనెన్స్ చేయడంతో పాటు మెషిన్‌లో రోజూ డబ్బు నింపడం కూడా చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఈ ఏటీఎంకు సంబంధించిన బ్యాంకు సుమారు 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఈ ఏటీఎంను చక్కగా నడిపిస్తున్నట్లు NBP బ్రాంచ్ మేనేజర్ గా జాహిద్ హుస్సేన్ తెలిపారు. అప్పుడప్పుడు విపరీతమైన గాలులు, తుఫానులు, తరచుగా కొండ చరియలు విరిగిపడుతున్నా, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించి ఏటీఎంను రన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
అత్యవసర మరమ్మతులు అవసరమైన సమయంలో ఈ ఏటీఎంకు చేరుకోవడానికి బ్యాంకు సిబ్బందికి రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 4,693 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఏటీఎంను ఎక్కువ మంది వినియోగించరు. దీనిని ఎక్కువగా వారి నెలవారీ జీతాలు తీసుకునే సరిహద్దు గార్డులు, కొద్దిమంది స్థానికులతో పాటు పాస్ ద్వారా సరిహద్దును దాటే వారు ఉపయోగించుకుంటారు. ప్రతి రెండు వారాలకు మెషిన్ నుంచి దాదాపు 4 మిలియన్ నుంచి 5 మిలియన్ రూపాయలు ($18,350 - $23,000) విత్ డ్రా జరుగుతున్నట్లు బ్యాంకు అధికారులు చెప్పారు.
వాస్తవానికి ఎక్కువ లావాదేవీలు జరగకపోయినా.. ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని NBP అధికారులు తెలిపారు. ఈ ఏటీఎంపై ఆధారపడే వ్యక్తుల కారణంగా దీనిని రన్ చేస్తున్నట్లు చెప్పారు. తమ జీతాలను కుటుంబ సభ్యులకు బదిలీ సరిహద్దు గార్డులకు ఈ ఏటీఎం ఒక్కటే మార్గమని వెల్లడించారు. స్థానికంగా ఉండే కొంత మంది ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అటు సరిహద్దును దాటే ప్రజలకు కూడా నగదు ఇబ్బందులను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also read: ఉల్లిపాయ తొక్కలు పడేయకుండా పొడి చేసి దాచుకుంటే వంటల్లో ఇలా వాడుకోవచ్చు
Also read: రాత్రిపూట ఏడుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువే