World's Best Fat Burner: వరల్డ్ బెస్ట్ ఫ్యాట్ బర్నర్ - శరీరంలోని కొవ్వును కరిగించే అత్యుత్తమ పండు ఇదేనట!
సరైన ఆహార పదార్థాలు తీసుకుని కూడా శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకోవచ్చు. సన్నగా మారిపోవచ్చు.
శరీరంలో కొవ్వును కరిగించేందుకు చాలా రకాల ఆహారాలు ఉన్నాయి. కొన్ని రకాల డైట్స్ పాటించడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. అయితే, మీరు ఊహించలేనిది ఏమిటంటే.. కొవ్వును కరిగించడంలో ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ పండు ఒకటి ఉందట. అది మరేదో కాదు.. బొప్పాయి పండు.
బొప్పాయి పండు. అత్యంత ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గించి కొవ్వుని కరిగించుకునేందుకు ఇది బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉపయోగపడుతుందట. కొవ్వు పోగొట్టుకునేందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే బొప్పాయి తినడం చాలా మేలని అంటున్నారు. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని వేళలా ఇది లభిస్తుంది. అంతే కాదు ఇందులో నారింజ కంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి చాలా దేశాలలో చౌకగా లభించే పండు. ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.
100 గ్రాముల బొప్పాయిలో 59 కేలరీలు మాత్రమే ఉంటాయి. కార్బోహైడ్రేట్లు 15 గ్రాములు, ఫైబర్ 3 గ్రాములు ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్లు ఏ, సి, బి9(ఫోలేట్), పొటాషియం లభిస్తాయి. జీర్ణక్రియ, ప్రోటీన్ శోషణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ మనం తీసుకునే ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. కండరాలను నిర్మించి అరిగిపోయిన కణాలు, కణజాలాలను మరమ్మత్తు చేస్తుంది. డెంగ్యూ రోగులకు బొప్పాయి అద్భు తమైన పండు. తక్కువ ప్లేట్ లేట్ కౌంట్ ఉన్నవాళ్ళు బొప్పాయి తినడం వల్ల వాటి స్థాయిలు మెరుగుపడతాయి. బొప్పాయి మాత్రమే కాదు దాని ఆకుల రసం కూడా తీసుకోవచ్చు.
బొప్పాయి వల్ల ప్రయోజనాలు
⦿ బరువు తగ్గాలి అనుకొనేవారికి ఇదే బెస్ట్ పండు. ఇందులోని ఫైబర్, తక్కువ కెలరీల కారణంగా పొట్ట నిండిన అనుభూతిని కలుగుతుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది.
⦿ బొప్పాయిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఆస్తమా సమస్యని తగ్గించడంలో సహాయపడుతుంది.
⦿ ఇందులో జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హానికరమైన నీలి కాంతి కిరణాలను వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చర్మాన్ని రక్షిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ వ్యాధులు, వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తాయి.
⦿ బొప్పాయిలో ఫైబర్, నీటి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థని ఇస్తుంది.
⦿ నారింజ కంటే ఎక్కువ విటమిన్-సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి. రోగాల బారిన పడకుండా అడ్డుకుంటుంది.
⦿ బొప్పాయిలో పొటాషియం అనే ఎలక్ట్రోలైట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
⦿ బొప్పాయిలో కొలిన్ ఉంది. అది కొవ్వుని గ్రహించి, శరీరంలోని మంటను తగ్గిస్తుంది.
⦿ విటమిన్లు ఏ, సి ఉండటం వల్ల చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి.
⦿ బొప్పాయి గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలు, మొటిమలు, నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
బొప్పాయి గర్భిణీలు తీసుకోవచ్చా?
బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందనే వాదన బలంగా ఉంది. కానీ గర్భిణీలు పచ్చి బొప్పాయి కంటే బాగా పండిన దాన్ని తీసుకోవచ్చు. సరిగా పండని బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది గర్భిణీలకు హాని కలిగిస్తుంది. పండిన బొప్పాయిలో ఈ పపైన్ ఉండదు. కాబట్టి పండిన బొప్పాయి తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదని అంటారు. ఈ రోజుల్లో పచ్చి బొప్పాయిని బాగా ముగ్గబెట్టి అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో గర్భిణీలు ఈ పండుకు దూరంగా ఉండటమే మంచిది. దీన్ని తినాలి అనుకుంటే తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.