(Source: ECI/ABP News/ABP Majha)
World music day 2024: ఏవండోయ్.. ఈ రోజు మ్యూజిక్ డే, ఇంతకీ ఈ రోజును ఎందుకు పాటిస్తారు? మీ ఫ్రెండ్స్‌తో ఇలా సెలబ్రేట్ చేసుకోండి
శిశుర్వేత్తి, పశుర్వేత్తి అని సంగీతం సకల ప్రాణులను అలరించే కళారూపం. అలాంటి సంగీతాన్ని ప్రపంచ మానవులతో పంచుకునే రోజే ప్రపంచ సంగీత దినోత్సవం. మరి ఈ రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా?
మ్యూజిక్.. ఇది ప్రతి ఒక్కరి ఎమోషన్. బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్నా మ్యూజిక్ ఉండాల్సిందే. కాసేపు మన ప్రపంచాన్ని మరిచిపోయి.. హాయిగా గడిపేయాలంటే మ్యూజిక్ ఉండాల్సిందే. సంగీతం.. మనసుకు రెక్కలనిచ్చి ఊహలకు స్వేచ్ఛనిస్తుంది. ఏటా జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజున వీధుల్లో, పార్కుల్లో, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో సంగీత ప్రదర్శనలు చేయ్యాలనే ఆతృత ఉంటుంది సంగీత ప్రియులకు. సంగీతం ఎల్లలు లేని ప్రపంచ భాష. ఔత్సాహిక కళాకారులకు ఒక వేదికను అందించడమే ఈ రోజు ప్రత్యేకత.
వరల్డ్ మూజిక్ డే సందర్భంగా ప్రొఫెషనల్ కళాకారులు మాత్రమే కాదు. ఔత్సాహిక సంగీతకారులను ఫెయిట్స్ డిలా మ్యూజిక్ అనే నినాదంతో ప్రోత్సహిస్తారు. ఫెయిట్స్ డి లా మ్యూజిక్ అంటే కళాకారులను ప్రోత్సహించడం అని అర్థం.
మొదట ఎప్పుడు జరిగింది?
ఫ్రాన్స్ లో మొదటిసారిగా 1982లో చాలా అట్టహాసంగా మ్యూజిక్ డే జరుపుకున్నారు. ఫ్రాన్స్ సంస్కృతిక మంత్రి జాక్ లాంగ్, సంగీత దర్శకుడు మారిస్ ఫ్లూరెట్, రేడియో నిర్మాత ఇద్దరూ కూడా సంగీతానికి ఒక రోజుండాలని ప్రతిపాదించారు. జూన్ నెల ఫ్రాన్స్ లో వేసవి కనుక బహిరంగ ప్రదేశాల్లో సంగీతకారులు ఒకచోట చేరేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఈ జూన్ 21న సంగీత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇదే రోజున సంగీత దినోత్సవం జరుపుకుంటున్నారు.
సంగీతాన్ని ఎల్లలు లేని విశ్వభాషగా భావిస్తూ వివిధ వైవిద్య భరిత సంగీతాన్ని ఆస్వాదించడం ఈ రోజు లక్ష్యం. సంగీతాన్ని అన్ని వయసుల వారికి మరింత చేరువ చేయ్యటమే ప్రపంచ సంగీత దినోత్సవం లక్ష్యం. సంగీతం ఎక్కడో స్టూడియోల్లో, లేదా ఆడిటోరియంలో పరిమితం కాకుండా వీధుల్లోకి రావాలని, వివిధ రకాల సంగీత శైలులను ప్రపంచ ప్రజలకు పరిచయం చెయ్యాలనేది ఈ రోజు ఉద్దేశం. భవిష్యత్తు తరాలకు పురాతన సంగీతాన్ని అందించే అవకాశం కూడా ఈ సందర్భంగా దొరుకుతుంది. నిజానికి సంగీతాన్ని అందరూ ఇష్టపడతారు. పని చేసుకుంటూ, ప్రయాణం చేస్తూ ఏ పని చేస్తూనైనా సరే సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సంగీత ప్రియులందరికీ శుభాకాంక్షలు. ఈ సార్వత్రిక ప్రపంచ భాష అన్ని సందర్భాల్లోనూ కూడా తోడు నిలుస్తుంది. అవసరమైనపుడు మార్గదర్శనం చేస్తుంది, దిగులుగా ఉన్నపుడు ఓదార్పుగానూ, నమ్మకం సడలినపుడు ప్రేరణగానూ ఆత్మతో స్నేహం చెయ్యగలదు సంగీతం. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సంగీతం శాంతిని, సంతోషాన్ని, ఐకమత్యాన్ని ప్రపంచానికి అందించాలి. ప్రపంచ మానవులకు సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.
ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి?
ఈ మ్యూజిక్ డేను స్నేహితులతో సరదాగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని ఇంట్లోనే చిన్న డీజే ఏర్పాటు చేసుకోండి. ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసుకోవడం కష్టం అనుకుంటే.. మీ స్నేహితులకు ఇష్టమైన సాంగ్స్‌ను డెడికేట్ చెయ్యండి. వారికి ఆ సాంగ్ యూట్యూబ్ లింక్స్‌ను వాట్సాప్ చెయ్యండి. బాగా కావలసిన వ్యక్తి అయితే.. హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్, పాకెట్ రేడియో.. ఇలాంటివి ఏమైనా గిఫ్ట్‌గా ఇవ్వండి.
Also Read : మహిళలూ.. ఈ వయసులో బీట్ రూట్ జ్యూస్ తప్పక తాగండి