Winter Care : చలికాలంలో వచ్చే వ్యాధులు దూరం చేసే ఇంటి చిట్కాలు.. వీటితో జలుబు, దగ్గు, కీళ్లనొప్పులు దూరం
Winter Diseases : చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలని రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటే కొన్ని ఇంటి చిట్కాలతో పాటు జీవనశైలిలో మార్పులు చేయాలంటున్నారు. అవేంటంటే..

Home Remedies for Winter : చలికాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు వంటి వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉష్ణోగ్రతలోని తేమ, వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. వాటి ఎఫెక్ట్ పూర్తిగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడంతో పాటు.. కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వాలి. మరి వాటితో సీజనల్ వ్యాధులు ఎలా దూరం చేసుకోవచ్చో చూసేద్దాం.
చలికాలంలో చేసే అతిపెద్ద మిస్టేక్
చలికాలంలో కూడా శరీరానికి నీరు అవసరం. ఎక్కువమంది చేసే మిస్టేక్ ఏంటి అంటే.. ఊరికే వాష్‌రూమ్‌కి వెళ్లిరావాల్సి వస్తుందని.. నీటిని తక్కువగా తీసుకుంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే టాక్సిన్‌లను తొలగించడానికి, రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి హైడ్రేటెడ్‌గా ఉండడం అవసరం. కాబట్టి తగినంత నీళ్లు తీసుకోవాలి. లేదంటే గోరువెచ్చని నీరు, హెర్బల్ టీలు కూడా తీసుకోవచ్చు. ఇవి శరీరంలోని ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తాయి. మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి.
సీజనల్ వ్యాధులకు ఇంటి చిట్కాలు
బ్రీతింగ్ సమస్య ఉంటే.. చలికాలంలో వచ్చే వ్యాధులకు ఇంట్లోనే చెక్ పెట్టగలిగే టిప్స్ ఉన్నాయి. ఉదాహరణకు.. కొన్ని చుక్కల లావెండర్ నూనెను వేడి నీటిలో వేసి.. ఆవిరి పట్టుకోవచ్చు. దీనివల్ల ముక్కుదిబ్బడ దూరమవుతుంది. జలుబు వల్ల శ్వాస తీసుకోవడంలో వచ్చే ఇబ్బందులు దూరమవుతాయి.
గొంతు ఇన్ఫెక్షన్లు ఉంటే.. గొంతు ఇన్ఫెక్షన్లు ఉంటే టీ లేదా వేడిగా ఏదైనా తాగితే మంచిది అనుకుంటారు. దానికి బదులుగా మీరు హెర్బల్ డ్రింక్స్ లేదా సూప్ తీసుకోవచ్చు. అల్లం టీ కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. మిరియాల పాలు కూడా రిలీఫ్ ఇస్తుంది.
జీర్ణ సమస్యలు ఉంటే.. చలికాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. మలబద్ధకం, గుండెల్లో మంట వంటివి ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో మీరు గోరువెచ్చని నీరు తీసుకుంటే మంచిది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అలాగే వింటర్లో తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఫుడ్ తీసుకుంటే మంచిది. భారీ మసాలా ఫుడ్ తీసుకుంటే అసౌకర్యం వస్తుంది.
కీళ్ల నొప్పులు ఉంటే.. చలికాలంలో తేమ వల్ల కీళ్లనొప్పులు, కండరాలు పట్టేయడం వంటివి జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. కీళ్ల ఇబ్బందులు దూరం చేసుకోవడానికి వెచ్చని నీటితో మసాజ్ చేసుకోవడం లేదా హీట్ ప్యాక్ వంటివి ఉపయోగించవచ్చు.
వింటర్ సమస్యలను దూరం చేసే మార్పులు ఇవే
చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. హెల్తీ లైఫ్‌స్టైల్ ఫాలో అయితే ఇన్ఫెక్షన్లు రావని అంటున్నారు. వింటర్లో మిగిలిపోయిన ఆహారం కాకుండా.. తాజాగా, స్థానికంగా, తేలికగా వండిన ఆహారం తీసుకుంటే.. సహజంగానే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అధికంగా ప్రాసెస్ చేసిన, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తాయని అంటున్నారు. రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి తగినంత రాత్రి నిద్ర అవసరమని చెప్తున్నారు. కాబట్టి వీలైనంత ఎక్కువ రాత్రి నిద్ర ఉండేలా చూసుకోవాల్సి ఉంది.
చలికాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇంట్లో హ్యూమిడిఫైర్ వాడితే మంచిది. అలాగే ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పోషకమైన ఆహారం తీసుకుంటూ హెల్తీ డ్రింక్స్ తాగితే మంచిది. శ్వాస సమస్యలు దూరం చేసుకోవడానికి ధ్యానం, మెడిటేషన్ చేస్తే మంచిది. మీ రొటీన్ లైఫ్‌లో ఈ మార్పులు చేస్తే.. చలికాలంలో కూడా హెల్తీగా ఉండొచ్చు.






















