Throat Cancer : ఆహారం మింగడంలో ఇబ్బందిగా ఉందా? ఈ ప్రాణాంతక క్యాన్సర్ సంకేతం కావొచ్చు
గొంతు నొప్పి తరచూ వస్తుంటే జాగ్రత్త పడాల్సి ఉంది. ఎందుకంటే ఇది గొంతు క్యాన్సర్ లక్షణం కూడా.
జలుబు చేసిన సమయంలో ఆహారం మింగడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. గొంతు నొప్పిగా ఉంటే తినడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి జలుబు చేయనప్పుడు కూడా ఆహారం మింగడంలో ఇబ్బందిగా అనిపిస్తే నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే ఇది గొంతు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి సంకేతం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో ప్రతి సంవత్సరం గొంతు క్యాన్సర్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య 2-3 శాతం వరకి పెరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకి 13 వేల కేసులు నమోదయ్యాయి.
అసలు ఏంటి ఈ క్యాన్సర్?
మయో క్లినిక్ ప్రకారం.. గొంతు క్యాన్సర్ స్వర పేటిక, వాయిస్ బాక్స్ లో అభివృద్ధి చెందే క్యాన్సర్ కణితి. గొంతు క్యాన్సర్ చాలా తరచుగా మీ గొంతు లోపలి భాగంలో ఉండే ఫ్లాట్ కణాలలో మొదలవుతుంది. స్వర తంతువులతో కూడిన మృదులాస్థితో తయారుచేయబడిన వాయిస్ బాక్స్ లో గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఇది వచ్చే ప్రమాదం ఉంది.
గొంతు క్యాన్సర్ లక్షణాలు
క్యాన్సర్ కణితి ఉన్న ప్రదేశాన్ని బట్టి గొంతు క్యాన్సర్ లక్షణాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా కనిపించే లక్షణాలు
గొంతులో కణితి: గొంతులో శోషరస కణుపు విస్తరించిన లేదా వాపు కారణంగా ఇది ఏర్పడుతుడుని. వైద్యుల నివేదిక ప్రకారం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ శోషరస కణుపుల్లో వాపు గొంతు, తల, మెడ క్యాన్సర్ల ప్రధాన లక్షణం. సాధారణంగా క్యాన్సర్ల వల్లఅ గడ్డలు రావు. అవి ఒక ముద్దని ఏర్పరుస్తాయి. నెమ్మదిగా అది పెద్దదిగా మారుతుంది.
మింగడంలో సమస్య: ఆహారాన్ని నమలడం, మింగేటప్పుడు గోతులో తీవ్రమైన నొప్పి లేదా మంట వస్తుంది. తినే ఆహారం కొన్ని సార్లు గొంతులో అతుక్కుపోతుంది. దీని వల్ల సరిగా ఆహారం తీసుకోలేకపోతూ ఉంటారు.
గొంతు నొప్పి: ఈ రకమైన క్యాన్సర్ లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం గొంతులో నొప్పి. ఇది తరచూ వస్తూనే ఉంటుంది. గొంతు అంతా అసౌకర్యంగా ఉంటుంది.
వాయిస్ లో మార్పు: గొంతు క్యాన్సర్ ప్రముఖ లక్షణాల్లో స్వరంలో మార్పు రావడం మరొకటి. స్వరంలో స్వల్ప వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ఎందుకంటే అది వాయిస్ హస్కీగా ఉంటుంది. జలుబు చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది కానీ జలుబు చేయదు. కొన్ని పదాలు కూడా అస్పష్టంగా పలకుతారు. మరికొన్ని శబ్దాలు, పదాలు ఉచ్చరించడంలోని సమస్య ఉంటుంది.
నాలుకపై తెల్లని మచ్చ: గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. నాలుకపి కూడా దీర్ఘకాలికంగా తెల్లని మచ్చలు రావడం గమనించవచ్చు.
గొంతు క్యాన్సర్ ని త్వరగా గ్రహించి సరైన సమయంలో చికిత్స తీసుకోవచ్చు. రేడియేషన్ థెరపీ ద్వారా ముందుగా చికిత్స చేస్తారు. క్యాన్సర్ ఉన్న దశని బట్టి చికిత్స చేయడం జరుగుతుంది. ముదిరితే శస్త్ర చికిత్స చేసి కణితి తొలగించాల్సి ఉంటుంది. దీని వల్ల ఒక్కోసారి మాట పోయి మూగవారిగా మారే ప్రమాదం లేకపోలేదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పొడి దగ్గు నిరంతరం వస్తుందా? కోవిడ్ దగ్గు ఏమో పరీక్షించుకోండి