Travel: మనదేశంలో బంగీ జంప్‌కు థ్రిల్లింగ్ లొకేషన్లు ఇవే, ధరలు కూడా తక్కువే
బంగీ జంప్ చేసే వాళ్లని చూస్తుంటే థ్రిల్ ఫీలవుతాం. ఇక మనమే చేస్తే ఆ కిక్కే వేరప్పా.
వేసవి సెలవులు వస్తే చాలా కుటుంబాలు, కాలేజీ యువత షికార్లు కొట్టేందుకు సిద్దమైపోతారు. స్నేహితులతో కలిసి వెళ్లేటప్పుడు సాహసాలు చేసేందుకు ఇష్టపడతారు యూత్. అలాంటి సాహసాల్లో బంగీ జంపింగ్ కూడా ఒకటి. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం చిరంజీవి ఓ సినిమాలో బంగీ జంప్ చేశారు. తెలుగు వారు అప్పట్లో ఆ బంగీ జంప్‌ను చాలా ఆశ్చర్యంగా చూశారు. ఇప్పుడు సామాన్య జనానికి ఈ సాహస క్రీడ అందుబాటులో ఉంది. అయితే ఎక్కడ పడితే అక్కడ బంగీ జంప్ చేయడం కుదరదు. ఎత్తయిన ప్రదేశం నుంచి దూకాలి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దీన్ని ఏర్పాటు చేయలేరు . బంగీజంపింగ్ చేయాలనుకునే వారికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి స్నేహితులతో సరదాగా వెళ్లి బంగీ జంప్ చేయచ్చు.
గోవా
గోవా ఎంతో మందికి డ్రీమ్ డెస్టినేషన్. అక్కడికి వెళితే డ్రీమ్ ల్యాండ్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది చాలా మందికి. అక్కడ అంజునా బీచ్ చాలా అందంగా ఉంటుంది. విదేశీ పర్యాటకులతో నిండిపోయి ఉంటుంది. గోవాలోని గ్రావిటీ జోన్లో బంగీ జంపింగ్ చేసే అవకాశం ఉంది. బంగీ జంప్ కోసం ఇక్కడ 25 మీటర్ల ఎత్తయిన టవర్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కసారి బంగీ జంపింగ్‌కు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
లోనావాలా
భారత్‌లోని అతిపెద్ద అడ్వెంచర్ పార్కులలో ఒకటి డెల్లా అడ్వెంచర్స్. ఇది ముంబైలోని లోనావాలా దగ్గరలో ఉంది అక్కడ బంగీ జంపింగ్ చేయడం కోసం చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. జంపింగ్ ప్లాట్ ఫారం నుంచి 45 మీటర్లు కిందకి దూకాలి. దూకడానికి 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. పది సంవత్సరాల వయసు దాటిన వారికే అనుమతి. ఒకసారి జంప్ చేయడానికి రూ.1500 ఖర్చు అవుతుంది.
రిషికేష్
ఉత్తరాఖండ్‌లోని రిషికేష్లోని మోహన్ చట్టి దగ్గర ఉంది ‘జంపిన్ హైట్స్’. ఇది మనదేశంలో ఎత్తయిన బంగీ జంపింగ్ స్పాట్‌లలో ఒకటి. దాదాపు 83 మీటర్ల ఎత్తు నుంచి దూకాల్సి ఉంటుంది. కేవలం చాలా ధైర్యవంతులు మాత్రమే ఇంత ఎత్తు నుంచి దూకగలరు. దూకడానికి దాదాపు పదినిమిషాలు పడుతుంది. పెద్ద రాతి కొండ నుంచి ఈ బంగీ జంప్ స్పాట్ ను సిద్ధం చేశారు. పద్దెనిమిదేళ్లు దాటిని వారికి మాత్రమే అనుమతిస్తారు. ఒక్కసారి జంప్ చేయడానికి రూ.3,350 ఖర్చు పెట్టాలి.
దిల్లీ
దేశరాజధానిలోని ఒక అందమైన ప్రదేశం ‘వాండర్‌లస్ట్’. ఇక్కడి సిబ్బంది జర్మనీలో శిక్షణ పొంది వచ్చారు. సాంకేతికంగా ఇక్కడ బంగీ జంప్ చాలా పటిష్టంగా సిద్ధం చేశారు. ఇది 130 అడుగుల ఎత్తు ఉంటుంది. క్రేన్ సాయంతో అంత ఎత్తు నుంచి దూకేలా చేస్తారు. 14 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారికే ఇక్కడ అనుమతి ఉంది. ఒక్కసారి జంప్ చేసేందుకు మనిషికి రూ.3000 రుసుము వసూలు చేస్తారు.
బెంగళూరు
హైదరాబాద్‌కు దగ్గరైన బంగి జంపింగ్ లొకేషన్ ఇది. బెంగళూరులోని ‘ఓజొన్ అడ్వెంచర్స్’ బంగీ జంప్‌కు వేదికగా మారింది. ఇక్కడ 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్కులను మాత్రమే జంప్ చేసేందుకు అనుమతిస్తారు. ఒక్కసారి జంప్ చేసేందుకు రూ.400 ఖర్చవుతుంది. దీనిలో భద్రతా చర్యలు కూడా అధికంగానే చేపట్టారు.
Also read: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారం తినాల్సిందే, కొత్త అధ్యయన ఫలితం
Also read: భోజనం చేశాక తమలపాకు ఎందుకు నమలాలి?