Shocking: ఒక్కసారిగా వేల కొద్దీ నల్ల పక్షులు నేలపై దబ్బున పడ్డాయి, ఈ షాకింగ్ వీడియోను చూడండి
మెక్సికోలోని సెక్యూరిటీ కెమెరాలో షాకింగ్ వీడియో రికార్డు అయ్యింది. అదిప్పుడు వైరల్‌గా మారింది.
గుంపులుగా ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు ఒక్కసారిగా కింద పడ్డాయి... ఈ ఘటన సెక్యూరిటీ కెమెరాలో రికార్డు అయ్యింది. పోలీసులు ఆ వీడియోను మీడియా వారికి అందించడంతో అదిప్పుడు వైరల్ గా మారింది. ఇదంతా జరిగింది మెక్సికోలోని చిహువాహ నగరంలో. పసుపు రంగు తల, నలుపు శరీరం కలిగిన అనేక పక్షులు ఏటా కెనడా నుంచి మెక్సికోకు వలస వస్తాయి. ఆ పక్షులు సాయంత్రమయ్యేసరికి గూళ్లకు గుంపులుగా ఓ క్రమపద్ధతిలో ఎగురుకుంటూ వెళతాయి. అవి ఒక్కసారిగా కింద పడిపోవడం ఒక మహిళ చూసింది. వేలాదిగా కిందపడిన పక్షుల్లో కొన్ని లేచి ఎగిరివెళ్లిపోయాయి. కానీ కొన్ని పక్షులు మాత్రం చనిపోయాయి. చనిపోయినవి వెయ్యిదాకా ఉంటాయని మెక్సికో అధికారుల అంచనా.
ఎందుకిలా...
అవెందుకు అలా హఠాత్తుగా కిందపడ్డాయో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. అవి ఎగురుతున్న ప్రాంతానికి దగ్గర్లోనే కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. అందులోంచి వచ్చిన కొన్ని వాయువులను పీల్చడం వల్లే పక్షులు అదుపుతప్పి కిందపడి ఉంటాయని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో చాలా తీవ్రస్థాయిలో కాలుష్యం ఉంది. అలాగే ఆ దారిలో ఉన్న కరెంటు తీగలు కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. దారినపోయే ఒక వ్యక్తి మాట్లాడుతూ పక్షులన్నీ కరెంటు తీగలపై వాలి ఉన్నప్పుడు విద్యుత్ షాక్ కొట్టిందని, అందుకే అవన్నీ కిందన పడ్డాయని చెప్పాడు.
ఈ ఘటన జరిగాక ఆ వీధిలో నివసిస్తున్న ఓ మహిళ అధికారులకు సమాచారాన్ని ఇచ్చింది. వారు వచ్చి చూసేసరికి గుండె తరుక్కుపోయేలా ఉంది అక్కడ పరిస్థితి. చెల్లాచెదురుగా పక్షులు విగతజీవుల్లా పడి ఉన్నాయి. వాటిని వారు సంచులలోకి ఎత్తి తీసుకెళ్లారు. దాదాపు పది పెద్ద సంచులు ఆ పక్షుల దేహాలతో నిండిపోయాయి. 2019లో కూడా ఇలాగే జరిగింది. వందల కొద్దీ పక్షులు ఒక్కొక్కటిగా నేలపై పడి చనిపోయాయి. అప్పుడు కూడా అసలు కారణమేంటో తెలియలేదు.
WARNING: GRAPHIC CONTENT
— Reuters (@Reuters) February 14, 2022
Security footage shows a flock of yellow-headed blackbirds drop dead in the northern Mexican state of Chihuahua pic.twitter.com/mR4Zhh979K
Also read: ముప్ఫై ఏళ్ల క్రితం మునిగిన గ్రామం తొలిసారి బయటపడింది, వీడియో చూడండి
Also read: పోషకాలతో నిండిన కొర్రల ఎగ్ ఫ్రైడ్ రైస్, మధుమేహులతో పాటూ ఎవరైనా తినొచ్చు