క్లియోపాత్రా అందం రహస్యం ఇదే, ఇలా చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
క్లియోపాత్రా అందానికి రహస్యమేంటో తెలుసుకుంటే, మీరు కూడా చర్మసౌందర్యాన్ని పెంచుకోవచ్చు.
అందాల యువరాణి క్లియోపాత్రా. ఈజిప్టులోని టోలెమిక్ రాజ్యానికి మహారాణి. చరిత్రలో నిలిచిపోయిన అందగత్తె. తండ్రి నుంచి రాజ్యాధికారాన్ని పొంది దాదాపు 20 ఏళ్లు పాలించింది. ఈజిప్టుకు చిట్టచివరి ఫారో క్లియోపాత్రానే. ఈమె తరువాత ఈజిస్టు రోమన్ సామ్రాజ్యంగా మారింది. ఈమె ఎవరో కాదు రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ భార్య. క్లియోపాత్రా అందానికి ఎంతో మంది రాజులు దాసోహం అయ్యారు. జూలియస్ సీజర్ కూడా అలాగే అయ్యాడు. అందం అనగానే గుర్తొచ్చేది క్లియోపాత్రా అనేంతగా చరిత్రపై ముద్ర వేసింది ఆమె సౌందర్యం. ఆమె తన అందాన్ని కాపాడుకునేందుకు, మరింతగా మెరిసేందుకు గాడిదపాలను ఉపయోగించేదని పురాణాల కథనం. రోజూ గాడిద పాలతో స్నానం చేసేదని చెబుతారు. 2000 ఏళ్ల క్రితం గాడిద పాలను అందం కోసం ఎంతోమంది యువరాణులు ఉపయోగించేవారు.
నిజంగానే అందం పెరుగుతుందా?
గాడిద పాలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అవి చాలా తక్కువగా దొరుకుతాయి. గాడిద ఆవులా లీటర్ల కొద్దీ పాలను ఇవ్వదు. అందుకే అంత డిమాండ్. ఇది మంచి సూపర్ ఫుడ్ కూడా. ఈ పాలు వృద్ధాప్యాన్ని నిరోధించడంలో ముందుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన గాడిద పాలను క్రీములు, సబ్బులు, షాంపూలు వంటి సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. సౌందర్య పరిశ్రమకు గాడిద పాలు ఎంతో ప్రాఫిట్‌ను తెచ్చిపెడుతున్నాయి. అందుకే మీరు కూడా గాడిద పాలతో తయారుచేసిన ఉత్పత్తులు కొనుక్కుని వాడితే అందం రెట్టింపు అవుతుంది. లేదా గాడిద పాలు అందుబాటులో ఉంటే వాటిని రోజూ ముఖానికి రాసుకున్నా మంచిదే.
ఆరోగ్యానికి...
చర్మసంరక్షణకే కాదు ఆరోగ్యానికి కూడా గాడిద పాలు చాలా మేలు చేస్తాయి. వివిధ అనారోగ్యాలకు చికిత్స చేయడంలో, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించడంలో ముందుంటుంది. వీటిని శిశువులకు కూడా తాగించడం మంచిదే. వారిలో గ్యాస్ సమస్యలు రావు. ఇవి తల్లిపాలను పోలి ఉంటాయి. అనేక రకాల ఖనిజాలు, ప్రొటీన్లు, విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పాలలో విటమిన్ డి ఉంటుంది.అలాగే దీనిలో ఉండే ప్రొటీన్ ఇన్ఫెక్షన్లను రాకుండా అడ్డుకుంటుంది. దీనికి యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికం.
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా యూరప్‌లో గాడిద పాలను వివిధ ఆహార సంబంధిత వస్తువుల తయారీలో వాడతారు. చాక్లెట్ల తయారీకి, చీజ్ తయారీకి వినియోగిస్తారు. ఈ పాలలో కేసైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
పిల్లలకు...
పిల్లలకు కూడా గాడిద పాలను తాగించవచ్చు. బరువు, ఎత్తు సరిగా పెరిగేందుకు ఇందులోని పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. ఈ పాలలో కాల్షియం కూడా అధికం, ఎముకలను బలోపేతం చేస్తుంది. రోగనిరోధకశక్తిని బలపరచడంలో ఇది ముందుంటుంది. ఈ పాలు నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది రక్తనాళాలను వ్యాకోచించేలా చేసి రక్త ప్రవాహం సరిగా జరిగేలా చేస్తుంది. రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడ్డానికి సహాయపడుతుంది.
Also read: గర్భనిరోధక మాత్రల వల్ల భవిష్యత్తులో గర్భస్రావం, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయా? ఏది అపోహ, ఏది నిజం?
Also read: హిమాలయాల్లో దొరికే నల్లటి ఖనిజం శిలాజిత్తు, దీన్ని తింటే మగవారి సమస్యలు దూరం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.