Shilajit: హిమాలయాల్లో దొరికే నల్లటి ఖనిజం శిలాజిత్తు, దీన్ని తింటే మగవారి సమస్యలు దూరం
నల్లటి బొగ్గులా కనిపించే ఖనిజం శిలాజిత్తు. దీని గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
ఆయుర్వేదం మందులు వాడే వారికి శిలాజిత్తు గురించి తెలుస్తుంది. చూడటానికి బొగ్గు ముక్కలా ఉంటుంది. అదే పొడి చేసి దాచుకుంటే బొగ్గు పొడే అనుకుంటాం. నిజానికి ఇది ఒక దివ్యౌషధం. ఎక్కడపడితే అక్కడ ఇది దొరకదు. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే లభిస్తుంది. దీన్ని ఏ పదార్థంతోనో తయారుచేస్తారు అనుకోకండి, ఇది అలాగే దొరుకుతుంది. హిమాలయాలు, హిందుకుష్ పర్వత శ్రేణుల్లో ఈ ఖనిజం లభిస్తుంది. ఆ చుట్టు పక్కల ప్రాంతాల వారు ఈ ఖనిజాన్ని వెతికేందుకు హిమాలయాల్లోకి, పర్వతశ్రేణుల్లోకి వెళతారు. అక్కడ ఎంతో మంది జీవనాధారం ఈ శిలాజిత్తు. ఇదొక రెసిన్ లాంటిది. నల్లటి లక్కలా అనిపిస్తుంది.
ఎలా ఏర్పడుతుంది?
ఇది లక్కలాంటిదని ముందే చెప్పా కదా. మొక్కలు, చెట్ల సంబందిత పదార్థాలు రాళ్లమధ్యలో చిక్కుకపోయి కొన్ని వేల ఏళ్ల పాటూ కుళ్లి నల్లగా మారి గట్టి బంక వంటి పదార్థంగా మారుతాయి. అదే శిలాజిత్తు. దీనిలో ఎన్నో అద్భుత గుణాలున్నట్టు వేల ఏళ్లనాడే గుర్తించారు. అందుకే అప్పట్నించే ఆయుర్వేదం ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పటికే శిలాజిత్తును పొడి రూపంలో, చిన్న ముక్కల రూపంలో, ద్రవ రూపంలో అమ్ముతున్నారు. కేవలం రెండు మూడు చుక్కల శిలాజిత్తుతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రయోజనాలు
అధికబరువు ఉన్న వారు ఆయుర్వేద నిపుణుల సూచన మేరకు దీన్ని వాడితే ఎంతో మంచిది. త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాదు పురుషులు ఈ శిలాజిత్తును తరచూ తీసుకోవడం వల్ల వారిలో సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయి. వారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. వీర్యకణాలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. నాణ్యమైన వీర్యం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఎక్కువ. కాబట్టి ఆయుర్వేద వైద్యులను కలిసి వారి సూచన మేరకు శిలాజిత్తును వాడవచ్చు.
రక్తహీనత సమస్య ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో నిండుగా ఐరన్ ఉంటుంది. కాబట్టి దీన్ని రోజుకు పావు చెంచా పొడి రూపంలో తీసుకున్న, రెండు మూడు చుక్కలు ద్రవ రూపంలో తీసుకున్నా చాలా ప్రయోజనం కలుగుతుంది. అల్జీమర్స్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. పొట్టలో అల్పర్లు ఉన్నవారు కూడా దీన్ని వాడవచ్చు. గుండె, హైబీపీ సమస్యలకు ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి శిలాజిత్తు ఎంతో మేలు చేస్తుంది.
శిలాజిత్తును మాత్రల రూపంలో అమ్ముతున్నారు. అలాగే ద్రవరూపంలో కూడా దొరుకుతుంది. మాత్రల రూపంలో అయితే రోజుకు 300 ఎంజీ లేదా 500 ఎంజీ మోతాదులో వేసుకోవచ్చు. అయితే వైద్యుల సలహా మేరకే ఇలాంటి మందులను వాడండి. ఆయుర్వేద వైద్యులను సంప్రదించి వినియోగించడం మొదలుపెట్టండి.
దీని ధర కూడా కాస్త అధికమే. వందగ్రాములు అయిదు వేల రూపాయల వరకు ఉంటుంది.
Also read: పండంటి బిడ్డ కోసం ప్రెగ్నెన్సీకి ముందు కచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే
Also read: మధుమేహులకు తెల్లన్నం ఎంత హాని చేస్తుందో చపాతీలు అంతే హాని చేస్తాయి, ICMR అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.