Heart Health: ఈ లక్షణాలు తరచూ కనిపిస్తున్నాయా? గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని హెచ్చరికలు అవి
మనలో తరచుగా కనిపించే కొన్ని లక్షణాలు విస్మరిస్తే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు.
గుండె బలహీనంగా ఉంటే శరీర పనితీరు సక్రమంగా నిర్వహించడానికి తగినంత రక్తాన్ని సరఫరా చేయలేదు. కరోనరీ హార్ట్ డీసీజ్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వివిధ ఆరోగ్య పరిస్థితుల కారణమగా గుండె పని చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. శ్వాస ఆడకపోవడం, కాళ్ళు లేదా పాదాల్లో వాపు, ఛాతీలో ఒత్తిడి లేదా దీర్ఘకాలిక అలసట వంటి లక్షణాలు గుండె బలహీనంగా ఉంది అనేందుకు సంకేతాలు.
అనేక కారణాల వల్ల గుండె బలహీనపడుతుంది. హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, వాల్యులర్ హార్ట్ డిసీజ్, డయాబెటిస్ మెల్లిటస్, అనీమియా వంటి గుండె సమస్యలు వస్తాయి. ఈ సమయంలో గుండెకి సంబంధించిన ప్రమాదం గురించి రోగులకి అవగాహన కలిగించాలి. లేదంటే గుండె వైఫల్యం చెందే ప్రమాదం ఇండి. గుండెలో ఎటువంటి అసౌకర్యంగా అనిపించినా కూడా వెంటనే వైద్యులని సంప్రదించి తగిన టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం. గుండె కండరాల బలహీనతని సరైన సమయంలో గుర్తించలేకపోతే పెద్ద ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది.
గుండె బలహీనంగా ఉంటే...
గుండె ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపే ముందస్తు సంకేతాలు గురించి తెలుసుకోవాలి. తేలికగా అలసట, బరువు పెరుగుతూ ఉండటం, చిన్న పని చేసినా కూడా ఊపిరి ఆడకపోవడం, కళ్ళు తిరగడం, పాదాల వాపు రావడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఇవే కాకుండా ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆర్థోప్నియా, ప్లాట్ గా పడుకున్నప్పుడు శ్వాస ఆడకపోవడం, తలతిరగడం, దడ, మూత్రం తగ్గడం వంటివి కార్డియాక్ డిసీజ్ లక్షణాలని హృదయ సంబంధ నిపుణులు చెప్పుకొచ్చారు.
సంకేతాలు ఇవిగో...
☀కరోనరీ ధమనుల్లో అడ్డంకి కారణంగా రాత్రి వేళ శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతే కాదు నడిచేటప్పుడు కూడ అలసటగా ఉంటుంది.
☀గుండె బలహీనంగా ఉన్నప్పుడు శరీరానికి అవసరమైనంత రక్తాన్ని సరఫరా చెయ్యలేదు. దాని వల్ల తిమ్మిరిగా అనిపిస్తుంది.
☀హృదయ స్పందనలో తేడాలు కనిపిస్తాయి. గుండెల్లో డదగా ఉంటుంది. గుండె వైఫల్యం కారణంగా కణజాలంలో అదనపు ద్రవాలు పేరుకుపోతాయి. దీని వల్ల పాదం, చీలమండ, కాళ్ళలో వాపు వస్తుంది.
☀గుండె బలహీనంగా ఉంటే దాని ప్రభావం ఎక్కువగా మూత్రపిండాల మీద పడుతుంది. మూత్ర విసర్జన తగ్గుదలకి దారి తీస్తుంది. దీని వల్ల క్లిష్టమైన అనారోగ్య సమస్యలు వస్తాయి.
☀ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో ద్రవం ఉంటుంది. దీన్నే పల్మనరీ ఎడెమా అంటారు. రక్తపోటు పడిపోతుంది. రక్తపోటుని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు మందులు అవసరం అవుతాయి. దీన్నే కార్డియోజెనిక్ అంటారు. అందుకే మధుమేహం, రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి. గుండెని కాపాడుకోవాలంటే చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. సమతుల్య ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయాయం చెయ్యాలి. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే గుండెని సంరక్షించుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చలికాలంలో ఆర్థరైటిస్ నొప్పులు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? వాటిని తగ్గించుకోవడం ఎలా?