Thyroid: ఈ ఆహారాలు థైరాయిడ్‌ను అదుపులో ఉండేలా చేస్తాయి
థైరాయిడ్ సమస్యతో బాధపడే మహిళల సంఖ్య అధికంగానే ఉంది.
ఎంతోమంది మహిళలను ఇబ్బంది పెడుతున్న సమస్య థైరాయిడ్. ఈ సమస్య కారణంగా బరువు పెరిగిపోవడం లేదా బరువు తగ్గిపోవడం, జుట్టు రాలిపోవడం వంటివి జరుగుతున్నాయి. కొన్ని రకాల ఆహారాలు తినడం ద్వారా ఈ గ్రంథి పనితీరును అదుపులో ఉంచవచ్చు. అలాగే వ్యాయామాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎలాంటి ఆహారాలు తింటే థైరాయిడ్ అదుపులో ఉంటుందో తెలుసుకుందాం.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు బి12 పుష్కలంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకొని తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా పండ్లు, కూరగాయలు, నువ్వులు, గుడ్లు, చీజ్, పాల ఉత్పత్తులు, బఠాణీలు వంటి వాటిలో ఉంటాయి. వీటన్నింటినీ రోజూ తినడం వల్ల థైరాయిడ్ గ్రంధి చక్కగా పనిచేస్తుంది. థైరాయిడ్ హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేయడం లేదా అల్పంగా ఉత్పత్తి చేయడం వంటివి జరగవు. దీనివల్ల థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది.
థైరాయిడ్ రెండు రకాలు. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. దీనిలో థైరాయిడ్ గ్రంధి తగినంత హార్మోను ఉత్పత్తి చేయనప్పుడు హైపో థైరాయిడిజం సమస్య వస్తుంది. థైరాయిడ్ హార్మోను అధికంగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం వస్తుంది. హైపో థైరాయిడిజం వల్ల నీరసంగా అనిపిస్తుంది. చలిని తట్టుకోలేరు. గుండె కొట్టుకునే వేగం మందగిస్తుంది. మెడ ముందు భాగంలో వాపు కనిపిస్తుంది.
థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోనును ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది. ఈ సమస్య బారిన పడితే మానసికంగా కల్లోలంగా ఉంటుంది. అకస్మాత్తుగా బరువు తగ్గిపోతారు. థైరాయిడ్ ఉబ్బినట్టు అవుతుంది. నిద్ర సరిగా పట్టదు. చేతులు, కాళ్లల్లో వణుకు వస్తుంది. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినా, అల్పంగా ఉత్పత్తి అయినా సమస్యే.
హైపోథైరాయిడిజం బారిన పడిన వారికి జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రోబయోటిక్స్ ను అధికంగా తినాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. అలాగే చీజ్‌లో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి తినడం వల్ల పొట్ట, పేగులు శుభ్రపడతాయి. రోజుకో కప్పు పెరుగు తింటే ఎంతో ఆరోగ్యం. అలాగే పుట్టగొడుగులు, బ్రౌన్ రైస్, గుడ్లు, చేపలు, మాంసం, పనస గింజలు వంటి వాటిని కూడా తరచూ తింటూ ఉండాలి. ప్రతిరోజూ గంట సేపు వాకింగ్ చేయడం మాత్రం మానవద్దు. తేలికపాలి వ్యాయామాలు చేయడం వల్ల థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి అదుపులో ఉంటుంది. అలాగే బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
Also read: ఆహారంలో ఉప్పు పూర్తిగా మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.