ఈ ఆహారాలు డేంజర్, శరీరంలో సీక్రెట్‌గా కొలెస్ట్రాల్ పెంచేస్తాయి
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా కష్టం, ఆరోగ్యం ఇరకాటంలో పడుతుంది.
మనం తినే ఆహారాన్ని బట్టే శరీరంలో చేరే కొలెస్ట్రాల్ ఆధారపడి ఉంటుంది. అవి వండిన విధానం కూడా వాటిలో కొవ్వును పెంచుతుంది. కొవ్వు చెడ్డదని చెప్పడం లేదు. శరీరానికి కొవ్వుతో అవసరం ఉంది. కణాలు,సాధారణ హార్మోన్లను తయారుచేయడానికి ఇది అవసరం. కానీ మితిమీరి శరీరంలో చేరితే మాత్రం అనర్ధాలే జరుగుతాయి. ముఖ్యంగా బరువు విపరీతంగా పెరిగిపోతారు. గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే ఆహారాలను దూరంగా పెట్టాలి. కొన్ని రకాల ఆహారాలు తరచుగా తింటే మీకు తెలియకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. సంతృప్త, ట్రాన్స్‌ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలు తినడం తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
వేపుళ్లు
చికెన్, చేపలు, కూరగాయలు... ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కానీ వాటిని ఉడకబెట్టి కూరలా వండుకుని తింటే మంచిది. కానీ వేపుళ్ల రూపంలో తినడం వల్ల వాటిలో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా హానికరం. వీటిని తినడం వల్ల కేలరీలు, కొలెస్ట్రాల్ కూడా శరీరంలో అధికంగా చేరుతుంది. ఇవే కాదు ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్, జంక్ ఫుడ్లు కూడా దూరం పెట్టాలి.
కాల్చిన ఆహారం
కాల్చిన లేదా మంటపై గ్రిల్ చేసిన ఆహారాలను తినడం తగ్గించాలి. ఇవి అధిక కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి మీ రక్తంలో ట్రైగ్లిజరైడ్లను పెంచుతాయి. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ కలిగిస్తాయి. మీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతాయి.
ప్రాసెస్డ్ మాంసం
ప్రాసెస్ చేసిన మాంసంలో సంతృప్త కొవ్వు, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఒక అధ్యయనం ప్రకారం ప్రాసెస్ చేసిన మాంసంలో ట్రైగ్లిజరైడ్లు అధికంగా ఉంటాయి. అందుకే అధికంగా శుద్ధి చేసి, నిల్వ చేసి అమ్మే మాంసాన్ని తినకూడదు.
మద్యం
రోజూ మద్యం తాగేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అధిక ఆల్కహాల్ వినియోగంవల్ల గుండెకు చాలా హాని కలుగుతుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మద్యపానాన్ని తరచుగా చేయడం మంచిది కాదు.
పైన చెప్పిన పదార్థాలు పూర్తిగా తినడం మానేయక్కర్లేదు. కానీ తరచూ కాకుండా, రెండు మూడు వారాలకోసారి తింటే ఫర్వాలేదు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అవసరం. రోజూ వ్యాయామం చేయడం, కంటి నిండా నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి కూడా చేయాలి.
Also read: సముద్రగర్భంలో టైటానిక్ టూర్, ముప్పయ్యేళ్ల కష్టాన్ని ఖర్చు చేసి శిధిలాలను చూసి వచ్చిన మహిళ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.