Hair Loss: మీ షాంపూలో ఈ పదార్థాలు ఉంటే జుట్టు రాలిపోవడం ఖాయం!
ఒత్తిడి, కాలుష్యం, మురికి వల్ల మాత్రమే కాదు సరైన షాంపూ వినియోగించక పోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
ఎవరికైనా అదనపు అందాన్ని ఇచ్చేది జుట్టు. దాని సంరక్షణ కోసం చాలానే కష్టపడతాం. వారానికి రెండు సార్లు, కొంతమంది అయితే రోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. జుట్టు సంరక్షణ దినచర్యలో షాంపూలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అన్ని షాంపూలు ఒకే విధంగా ఉండవు. కొన్ని చుండ్రు తగ్గించేవి అయితే మరికొన్ని జుట్టుకు పోషణ అందిస్తాయి. నిజానికి కొన్ని షాంపూలు జుట్టు రాలడానికి దారితీసే పదార్థాలు కలిగి ఉంటాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. అందుకే మీరు షాంపూ కొనుగోలు చేసేటప్పుడు లేబుల్ మీద అందులో ఉపయోగించిన పదార్థాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.
సల్ఫేట్
సల్ఫేట్ అనేవి అనేక షాంపూలో కనిపించే సాధారణ పదార్థమే. ఇది జుట్టు రాసుకున్నప్పుడు నురుగుని ఇస్తుంది. మురికి, నూనె వదిలించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. కానీ సల్ఫేట్ జుట్టుని పొడిగా, పెళుసుగా కూడా మార్చగలదు. దాని సహజ నూనెలు తొలగిస్తుంది. కాలక్రమేణా జుట్టుని బలహీనపరుస్తుంది. జుట్టు రాలడం చేస్తుంది. అందుకే కఠినమైన రసాయనాలు లేకుండా శుభ్రపరిచే సల్ఫేట్ లేని షాంపూ కోసం ప్రయత్నించడం మంచిది.
పారాబెన్స్
పారాబెన్స్ అనేది షాంపూ షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి ఉపయోగించే సింథటిక్ ప్రిజర్వేటివ్స్. ఇవి హార్మోన్ల సమతుల్యతని దెబ్బతీస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది కూడా జుట్టు రాలడానికి దారి తీస్తుంది. అందుకే పారాబెన్ రహిత షాంపూలు ఎంచుకోవడం ఉత్తమం.
ఫార్మాల్డిహైడ్
ఇవి ప్రిజర్వేటివ్స్. డయాజోలిడినల్ యూరియా వంటి బ్యాక్టీరియా పెరుగుదల నివారించడానికి షాంపూలో జోడిస్తారు. ఈ రసాయనాలు నీటిలో కలిసినప్పుడు ఫార్మాల్డిహైడ్ ని విడుదల చేస్తాయి. ఇది జుట్టు పలుచబడటం చేస్తుంది. తల మీద చికాకు పెడుతుంది. అందుకే ఫార్మాల్డిహైడ్ విడుదల కానీ ఏజెంట్లు ఉండే షాంపూ ఎంపిక చేసుకుంటే మంచిది.
సిలికాన్లు
జుట్టుకి సిల్క్ నెస్, మృదుత్వాన్ని అందించడం కోసం వీటిని తరచుగా షాంపూలో ఉపయోగిస్తారు. ఇవి తాత్కాలికంగా జుట్టుని ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపించేలా చేస్తాయి. కానీ కాలక్రమేణా జుట్టు కుదుళ్ళని బలహీన పరిచి జుట్టు పెరుగుదలని అడ్డుకుంటాయి. తల చర్మం శుభ్రంగా ఉండాలని అనుకుంటే సిలికాన్ లేని షాంపూ ఎంచుకోవాలి.
ఫ్రాగ్రెన్స్
చాలా వరకు షాంపూలు మంచి సువాసన అందిస్తాయి. కానీ సింథటిక్ సువాసనలు స్కాల్ఫ్, జుట్టుని బలహీనపరిచే రసాయనాలు కలిగి ఉంటాయి. కొంతమందికి ఈ సువాసన అలర్జీ కూడా కలిగిస్తుంది. జుట్టు రాలిపోతుంది. స్కాల్ఫ్ చికాకు తగ్గించుకునేందుకు సువాసన లేని సహజంగా ఉండే షాంపూలు ఉపయోగించాలి.
సరైన షాంపూని ఎలా ఎంచుకోవాలి?
☀ షాంపూ బాటిల్ మీద ఉండే పదార్థాల జాబితాకు సంబంధించిన లేబుల్ తప్పనిసరిగా చూసుకోవాలి.
☀ మొక్కల ఆధారిత పదార్థాలు, తక్కువ సింథటిక్ రసాయనాలు కలిగిన ఆర్గానిక్ షాంపూలకు మారేందుకు ప్రయత్నించండి.
☀ జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే ట్రైకాలజిస్ట్ ని సంప్రదించడం ఉత్తమం. అవసరాలకు అణుగుణంగా వాళ్ళు షాంపూని సిఫారసు చేస్తారు.
☀ జుట్టుని క్రమం తప్పకుండా కడగాలి. ఓవర్ వాష్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది తల మీద ఉండే సహజ నూనెలు తొలగించే ప్రమాదం ఉంది. స్కాల్ఫ్ శుభ్రం చేసుకునేందుకు గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి.
☀ విటమిన్లు, ఖనిజాలతో కూడిన సమతుల్య ఆహారం జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. ఆకుకూరలు, కొవ్వు చేపలు, గింజలు డైట్లో ఉండేలా చూసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: గుడ్ న్యూస్- హెచ్ఐవీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్- వచ్చే ఏడాదికి ఫలితాలు