Vitamin A: శరీరంలో విటమిన్ ఎ అధికంగా చేరితే వచ్చే సమస్యలు ఇవే
విటమిన్ ఎ శరీరానికి ఎంతో అవసరం. అలా అని దాన్ని అధికంగా తీసుకున్నా ప్రమాదమే.
శరీరానికి విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరం. అందులోనూ విటమిన్ ఏ మరీ అవసరం. వివిధ రకాల ఆహారాల ద్వారా విటమిన్ ఏ ను పొందవచ్చు. అయితే చాలా మంది అతి జాగ్రత్తతో విటమిన్ ఏ ఉండే ఆహారాన్ని అధికంగా తినేస్తారు. దీనివల్ల శరీరంలో ఆ విటమిన్ ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ ఏ అధికంగ తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్టులు కలుగుతాయి.
ఎంత అవసరమంటే...
కళ్ల ఆరోగ్యానికి విటమిన్ ఏ చాలా అవసరం. దీన్ని రెటినోల్ అని కూడా పిలుస్తారు. రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేసేందుకు ఇది చాలా అవసరం. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భాశయ, ఊపిరితిత్తులు, మూత్రాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనవి రాకుండా అడ్డుకుంటుంది. ఆరోగ్యసంస్థలు చెప్పిన ప్రకారం పురుషులకు 700 మైక్రోగ్రాములు, స్త్రీలకు 600 మైక్రోగ్రాముల విటమిన్ ఏ అవసరం. కేవలం ఆహారం ద్వారానే ఈ మొత్తం విటమిన్ ఏ ను పొందాలని కూడా చెబుతున్నారు. ఈ విటమిన్ ఏ కాలేయంలో రెటినైల్ ఈస్టర్లుగా నిల్వ ఉంటుంది.
ఎక్కువైతే ఈ సమస్యలు...
అవసరానికి మించి విటమిన్ ఏ తీసుకోవడం వల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహారం ద్వారా కాకుండా సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం వల్ల ఎముకలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని వల్ల పగుళ్లు త్వరగా వచ్చే అవకాశం ఉంది. విటమిన్ ఏ ఉన్న ఆహారాన్ని, విటమిన్ ఏ సప్లిమెంట్లను ఒకేసారి తీసుకోకూడదు. దీనివల్ల సమస్య పెరిగిపోతుంది. విటమిన్ ఏ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టులు ఏంటంటే...
1. ఆకలి సరిగా వేయదు
2. వికారం, వాంతులు ఎక్కువైపోతాయి
3. సూర్యకాంతిని తట్టుకోలేరు
4. జుట్టు ఊడిపోతుంది
5. తలనొప్పి వస్తుంది
6. చర్మం పొడి బారిపోతుంది
7. చర్మంపై దురదలు వస్తాయి
8. శరీరంలో ఎదుగుదల ఉండదు.
9. చూపు సమస్యలు వస్తాయి.
మరీ తీవ్రమైతే...
శరీరంలో తీవ్రస్థాయిలో విటమిన్ ఏ పేరుకుపోతే కాలేయం దెబ్బతింటుంది. పచ్చకామెర్లు వచ్చే అవకాశం ఉంది. కీళ్లనొప్పులు వేధిస్తాయి. తీవ్రమైన తలనొప్పి వస్తుంది.
ఎవరికి ఎక్కువ రిస్క్...
విటమిన్ ఏ అధికంగా తీసుకుంటే మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు, ముసలివాళ్లు తీవ్రంగా అనారోగ్యం బారిన పడతారు. వీరికి ఆస్టియోపోరోసిస్ రావచ్చు. కాబట్టి ఆహారం ద్వారా విటమిన్ ఏను పొందితే సమస్యలు రావు. సప్లిమెంట్లను కూడా వేసుకుంటేనే సైడ్ ఎఫెక్టులు ఎక్కువవుతాయి.
Also read: శిక్షణ పొందిన పైలెట్ అతను, కానీ జొమాటో డెలివరీ బాయ్‌గా మారిపోయాడు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Also Read: మునక్కాయల నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలు తినొచ్చు