Kidney Health: కిడ్నీ స్టోన్‌లతో బాధపడుతున్న వారు తినకూడనివి ఇవే, ఇక తినాల్సినవి ఏంటంటే
కిడ్నీ సమస్యలు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం అనే సమస్య ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. విపరీతమైన నొప్పితో బాధపడే వారు ఎంతో మంది. వీరికి ఏం తింటే ఏమవుతుందో అన్న భయం వెంటాడుతుంది. చాలా మంది సలహాలు కూడా చెబుతుంటారు... ఇది తినకూడదు, అది తినకూడదు అని. ఎవరెన్ని చెప్పినా వైద్యులు చెప్పినదే ఫైనల్ అని గుర్తుపెట్టుకోండి. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారికి వైద్యులు కొన్ని రకాల ఆహారాలు తినకూడదని సూచిస్తున్నారు. అలాగే తినాల్సినవి కూడా చెబుతున్నారు.
కిడ్నీలో రాళ్లు ఉన్న వారు తినాల్సినవి ముందు తెలుసుకుందాం.
1. మూత్రమే ఘనీభవించి రాళ్లుగా మారతాయని తెలుసు కదా, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అధికంగా ద్రవ పదార్థాలు తాగుతూ ఉండాలి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్న వారు రోజుకి కనీసం 10 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. అలాగని కూల్ డ్రింకులు తాగితే మాత్రం ఉపయోగం ఉండదు. గ్రీన్ టీ మేలు చేస్తుంది.
2. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. రాళ్లలో కాల్షియం ఆక్సలేట్ ఉంటుంది కనుక కాల్షియాన్ని తినకూడదని చాలా మంది భావిస్తారు. నిజానికి కిడ్నీ స్టోన్స్ ఉన్న వారు కాల్షియం మరింతగా తీసుకోవడం హానికరంగా కాదు. వారికి బలమైన ఎముకలు, కండరాలు కావాలంటే కాల్షియం తినాల్సిందే. కాకపోతే ఆహారం ద్వారానే కాల్షియం తినాలి. సప్లిమెంట్లను వాడకూడదు.
3. ఉప్పు అధికంగా వేసిన ఆహారాలు తినడం మానివేయాలి. మూత్రంలో అధిక శాతం ఉప్పు ఉంటే అవి రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. చీజ్, బటర్, పిజ్జాలు, చిప్స్ వంటివి అధిక మొత్తంలో సోడియాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఉప్పును దూరం పెట్టాలి. ఇంట్లో వండుకునే ఆహారాలలో ఉప్పును తక్కువ వినియోగించాలి.
4. నిమ్మరసంలో సిట్రేట్ ఉంటుంది. ఇది మూత్రంలో ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. రాళ్లు ఏర్పడకుండా ఆపుతుంది. కాబట్టి రోజూ గ్లాసుడు నీళ్లలో ఒక నిమ్మకాయ రసం కలుపుకుని తాగుతూ ఉండాలి.
5. విటమిన్ సప్లిమెంట్లు వైద్యులు సూచించకుండా మీకు మీరే వేసుకోవద్దు. వాటి వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు రావచ్చు. కొన్ని సప్లిమెంట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితులను పెంచుతాయి. చేప నూనె, విటమిన్ బి6 మాత్రం రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటాయి.
తినకూడనివి ఇవే...
మాంసం ఆధారిత ఆహారాలు తినడం తగ్గించుకోవాలి. గుడ్లు, చేపలు, చికెన్, మటన్ వంటివి పూర్తిగా మానేస్తే మంచిది. ఇందులో ఉండే జంతు ప్రొటీన్లు యూరిక్ ఆమ్లం స్థాయిని పెంచుతాయి. అలా మూత్రపిండాల్లో రాళ్లు మరింతగా ఏర్పడే అవకాశం ఉంది. ఆక్సలేట్ అధికంగా ఉండే పాలకూర వంటి వాటికి దూరంగా ఉండాలి. పాల ఉత్పత్తులు కూడా తగ్గిస్తే మంచిది.
Also read: బీట్‌రూట్ చపాతీ ఇలా చేసి పెడితే పిల్లలకు ఎంతో ఆరోగ్యం, రక్తహీనత రమ్మన్నా రాదు
Also read: షుగర్ తగ్గాలా? అయితే కాఫీ, టీలు మాని గ్రీన్ టీ తాగండి, చెబుతున్న కొత్త పరిశోధన
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.