Sun Colour: సూర్యుడి అసలు ‘రంగు’ ఇదే - పసుపు, ఆరెంజ్ అనుకుంటే పొరపాటే: నాసా
సూర్యుడికి సంబంధించిన కీలక విషయం వెల్లడైంది. ఇంత కాలం సూర్యుడు పసుపు రంగులో ఉంటాడని అందరూ భావించినా.. అది వాస్తవం కాదంటున్నారు నాసా పరిశోధకుడు స్కాల్ కెల్లీ.
సూర్యుడు.. సౌర కుటుంబంలో అత్యంత కీలక నక్షత్రం. సౌర వ్యవస్థకు మూలాధారం. భూమ్మీద ఉన్న సమస్త ప్రాణకోటికి జీవాధారం. సూర్యుడి మూలంగానే భూమ్మీద ఈ జీవరాశి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అందులో ఎవరికి ఏమాత్రం అనుమానం అవసరం లేదు. అయితే సూర్యుడికి సంబంధించి ఓ కీలక విషయం బయటకు వచ్చింది. సూర్యుడు మనకు పసుపు వర్ణంలో కనిపిస్తుంటాడు. ఇంతకాలం అంతరిక్ష పరిశోధకులు సైతం ఇదే విషయాన్ని నమ్మారు. అయితే, సౌర్యుడి అసలు రంగు పసుపు కాదని వెల్లడించారు నాసా ఆస్ట్రోనాట్ స్కాల్ కెల్లీ. సూర్యుడు తెలుపు రంగులో ఉంటాడని ఆయన ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు. ఇంతకాలం సూర్యుడి వర్ణానికి సంబంధించి జనాల్లో ఉన్న అభిప్రాయం నిజం కాదని తేల్చి చెప్పారు.
అంతరిక్షం నుంచి చూస్తేనే తెలుస్తుంది!
సూర్యుడిని భూమి మీద నుంచి చూస్తే ఎవరికైనా పసుపు వర్ణంలోనే కనిపిస్తారని కెల్లీ వెల్లడించారు. అయితే, సూర్యుడి అసలు రంగు అంతరిక్షంలో నుంచి చూసినప్పుడే తెలుస్తుందంటున్నారు. భూమి పైన ఉన్న వాతావరణం కారణంగా ప్రజలకు పసుపు వర్ణంలో కనిపిస్తుందని ఆయన తెలిపారు. భూ వాతావరణం నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే పసుపు రంగులో కాకుండా తెల్లగా కనిపిస్తాడని తెలిపారు.
I can confirm this space fact. https://t.co/lLzcKgklvD
— Scott Kelly (@StationCDRKelly) September 12, 2022
సూర్యుడు పసుపు రంగులో ఎందుకు కనిపిస్తున్నాడంటే?
వాస్తవానికి ప్రజలు సూర్యుడి అసలు రంగును ఎందుకు గుర్తించలేరో నాసా వెల్లడించింది. సూర్యుడి నుంచి వచ్చే కాంతి కళ్లను తాకినప్పుడు.. కళ్లలోని ఫోటోరిసెప్టర్ కణాలు రంగును గ్రహిస్తాయని తెలిపింది. దీని వలన అన్ని రంగులు మిక్స్ అయిపోతాయని వెల్లడించింది. అందుకే సూర్యుడి అసలు రంగును గుర్తించే అవకాశం లేదని తెలిపింది. భూమిపై ఉండే వాతావరణం సూర్యుడి రంగుపై ప్రభావాన్ని చూపిస్తున్నట్లు వెల్లడించింది.
వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్ లో ఉండే ఓజోన్ లేయర్ యూవీ, గామా కిరణాలు భూమిపై రాకముందే గ్రహిస్తుందని తెలిపింది. ఇన్ ఫ్రా రెడ్ కిరణాలను కూడా వాతావరణంలోని నీటి ఆవిరి గ్రహిస్తుందని చెప్పింది. దీంతో సూర్యుడి అసలు కాంతిని వాతావరణం కనిపించకుండా చేస్తుందన్నట్లు ప్రకటించింది. మానవ మెదడు కూడా తక్కువ నీలం పసుపుతో ఉన్న రంగులను మాత్రమే కళ్లు గ్రహించేలా చేస్తుందని తెలిపింది. దీంతో సూర్యుడి అసలు రంగును ప్రజలు గుర్తించలేరని నాసా వెల్లడించింది.
అందుకే సూర్యుడు తెలుపు వర్ణంలో ఉన్నా.. మనకు పసుపు వర్ణంలో కనిపిస్తారని కెల్లీ వెల్లడించారు. అటు విశ్వంలోని అనేక నక్షత్రాలతో పోల్చుకుంటే సూర్యుడు ఓ చిన్న నక్షత్రం అని పేర్కొన్నారు. సూర్యుడితో పోలిస్తే కొన్ని వేల రెట్లు పెద్ద పరిమాణంలో అనేక నక్షత్రాలు పాలపుంతతో పాటు ఇతర గెలాక్సీల్లో ఉన్నాయని కెల్లీ తెలిపారు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?