Potato Milk: భవిష్యత్తంతా బంగాళాదుంప పాలదే, చెబుతున్న ఫుడ్ ట్రెండ్స్ రిపోర్టు
ఫుడ్ ట్రెండ్స్ లో ఎప్పటికప్పుడు కొత్త ఆహారాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
బంగాళాదుంపను పాత చింతకాయ పచ్చడిలా చూస్తారు చాలా మంది. దీనితో చేసే వంటలన్నీ పాతవేగా, ఇది ట్రెండింగ్ ఫుడ్ అయ్యే ఛాన్సే లేదనుకుంటారు. కానీ ఇటీవల వెయిట్రోస్ జర్నల్ ప్రచురించిన ప్రకారం 2022లో బంగాళాదుంప మిల్క్ ట్రెండింగ్ గా మారబోతోంది. ఇంతవరకు సోయా మిల్క్, బాదం మిల్క్ వంటివే ట్రెండయ్యాయి. వీటిని తలదన్నేలా బంగాళాదుంప మిల్క్ రాబోతోందట. బంగాళాదుంపల నుంచి తీసిన పాలు 2022లో ట్రెండ్ సెట్టర్ కాబోతున్నాయి ఆ రిపోర్టు చెబుతోంది. ఈ పాలు వీగన్ల కోసం ప్రత్యేకం కాబోతున్నాయి. వారు మొక్కల ఆధారిత ఆహారాన్నే తింటారు కాబట్టి. వారి వల్లే ఈ పాలు ట్రెండయ్యే అవకాశం కనిపిస్తుంది.
వాటికి గట్టి పోటీ...
ఆవు, గేదెల నుంచి తీసే పాలు కాకుండా మార్కెట్లో బాదం పాలు, సోయా పాలు, ఓట్స్ పాలు లభిస్తున్నాయి. త్వరలో వీటికి గట్టిపోటీని ఇవ్వబోతోంది ఆలూ పాలు. బంగాళాదుంప పాలలో సంతృప్త కొవ్వులు, చక్కెర తక్కువగా ఉంటాయి. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజుల దీన్ని ఇష్టపడే అవకాశాలు ఎక్కువ.ఈ పాలను సాధారణ పాలలాగే టీ, కాఫీలకు కూడా ఉపయోగించుకోవచ్చు. బంగాళాదుంప పాల ప్యాకెట్లపై డైరీ ఫ్రీ, ఫ్యాట్ ప్రీ, కొలెస్ట్రీల్ ఫ్రీ అని రాసి ఉంటుంది. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఆవు పాలలో ఉన్నంత స్థాయిలోనే ఉంటుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. మిగతా పాలతో పోలిస్తే దీనిలో లభించే ఖనిజాలు, విటమిన్లు అధికం.
మాంసాహారం వైపు తక్కువగా మొగ్గు చూపే వారు బంగాళాదుంప పాలను ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా. అయితే బంగాళాదుంపు అధిక కార్బోహైడ్రేట్లు ఉండే దుంపగా ప్రస్తుతం పరిగణిస్తున్నాం. దీని కారణంగా ఎంతోమంది దీని జోలికి పోరు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం ఉన్న వారు బంగాళాదుంపను తినరు. అయితే బంగాళాదుంప నుంచి తీసిన పాలు మాత్రం ఎవరికీ హాని చేయవు. అవి ఆరోగ్యాన్నందించే కేటగిరీలోనే ఉంటాయి. మధుమేహులు కూడా వీటిని వాడవచ్చు. అయితే తక్కువ మోతాదులోనే. ఇక రుచి విషయానికి వస్తే సోయా పాలకు ఒక రుచి ఉన్నట్టే, బంగాళాదుంప పాలకు ఒక రుచి ఉంటుంది. ఈ రుచి అందరికీ నచ్చేట్టే ఉంటుంది. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో పొటాటో పాల వాడకం మొదలైంది. త్వరలో మనదేశంలో కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Also read: వింత వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ, ఇది వారసత్వంగా వస్తుందట!
Also read: మిగిలిపోయిన అన్నంతో ఇలా దోశెలు, టేస్టు అదిరిపోతుంది