Gold Kulfi: ఇండోర్ వీధుల్లో నోరూరించే బంగారు కుల్ఫీ, ధర తక్కువే
ఆహారానికి బంగారాన్ని జతచేయడం అనేది ఈనాటిది కాదు. ఎప్పటినుంచో ఆహారంలో బంగారాన్ని భాగం చేస్తున్నారు.
వేసవి వచ్చిందంటే కుల్ఫీల అమ్మకాలు పెరిగిపోతాయి. నోటికి తీపి రుచిని ఇవ్వడంతో పాటు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది కుల్ఫీ. ముఖ్యంగా కుల్ఫీలో పాలను కలుపుతారు. అందుకే కుల్ఫీ ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. సాధారణంగా కుల్ఫీల్లో సాదా కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, మామిడి కుల్ఫీ... ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ జాబితాలో గోల్డ్ కుల్ఫీ కూడా చేరింది. ఇండోర్ కు చెందిన ఒక వీధి వ్యాపారి గోల్డ్ కుల్ఫీని తయారు చేసి అమ్ముతున్నాడు. దాన్ని తినేందుకు ఎంతో మంది బారులు తీరుతున్నారు.
ఈ బంగారు కుల్ఫీ గురించి తొలిసారిగా ఇన్స్టాగ్రామ్ ఒక ఫుడ్ బ్లాగర్ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ వీధి వ్యాపారి కుల్ఫీని బంగారు రేకులో చుట్టి విక్రయిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి కూడా ఒంటినిండా బంగారు ఆభరణాలతో నిండి ఉన్నాడు. ఫ్రిజ్ నుండి ఒక కుల్ఫీని తీసి దానిని 24 క్యారెట్ల గోల్డ్ లీఫ్ లో చుట్టాడు. దాని ధర 351 రూపాయలు మాత్రమే. ఈ కుల్ఫీ అమ్మకం దారుడు ఇండోర్లోని సరాఫాలో ఈ వీటిని అమ్ముతున్నాడు. ఆయన షాపు పేరు ప్రకాష్ కుల్ఫీ. ఇండోర్ వెళ్లిన వారు ఓసారి అక్కడికి వెళ్లి రుచి చూసి రావచ్చు.
అంత తక్కువ ధరకే ఎలా అమ్ముతున్నాడు? అది 24 క్యారెట్ల బంగారం కదా అనుకోవచ్చు. బంగారాన్ని చాలా పలచటి పొరలా తయారుచేయిస్తున్నాడు. ఆ పొరను తయారు చేయడానికి ఉపయోగించే బంగారం చాలా తక్కువ. అందుకే 350 రూపాయలకే అమ్ముతున్నాడు. ఒక గ్రాము బంగారంలో అలాంటి పలుచటి పొరలు వందల్లో తయారుచేయచ్చు.
">
ఇలా బంగారు ఆహారాలను అమ్మడం ఇదే మొదటిసారి కాదు. లక్నోలో ఒక వ్యక్తి బంగారు టీ ని తయారు చేసి అమ్మాలు. టీ పై పలుచటి బంగారు రేకులు వేసి అందించాడు. అలాగే విశాఖపట్నంలో 23 క్యారెట్ల బంగారు ఆకులతో కూడిన ప్రత్యేక బిరియాని తయారు చేశారు. అలాగే బంగారు దోశెలు కొన్ని రెస్టారెంట్లు అమ్మాయి. స్వీట్లపై కూడా బంగారు పూతను పోస్తారు.
బంగారు పూతరేకులు ఆ మధ్య చాలా వైరల్ అయ్యాయి. పూతరేకులోపల పలుచని పొరలా బంగారాన్ని పోసి అమ్మారు. ఒక్కో బంగారు పూత రేకు ఖరీదు 800 రూపాయలు. జనం ఆ పూతరేకును ఎగబడి మరీ కొన్నారు. అక్షయ త్రుతీయ సందర్ధమంగా ఏపీలోని కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో ఒక దుకాణదారు ఈ పూత రేకులను 24 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగించి తయరుచేసి అమ్మారు.
సింగపూర్ లో బంగారు టీ పొడి కూడా ఉంది. ఈ బంగారు టీ పొడితో వేడి వేడి టీని తయరు చేసి ఇస్తారు. 24 క్యారెట్ల బంగారంతో టీ ఆకులకు బంగారు పూతలను పూస్తారు. అలా వీటిని తయారుచేస్తారు. జపాన్ వంటకమైన సుషీని కూడా బంగారు రేకులు చుట్టి విదేశాల్లో అమ్ముతున్నారు.
Also read: తెలంగాణ సాంప్రదాయ పానీయం నీరా - కల్లుకు, నీరాకు మధ్య తేడా ఏంటి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.