Tasty Punugulu Recipes : పునుగులు టేస్టీగా రావాలంటే మినప పిండితో ఇలా చేయాలి.. మైదా పిండితో అలా చేయాలి
Punugulu Recipes : పునుగులను చాలామంది ఇష్టంగా తింటారు. అయితే వీటిని వివిధ రకాల పిండులతో తయారుచేస్తారు. అయితే మినపపిండితో ఎలా చేస్తారో.. మైదా పిండితో ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం.
Tasty Breakfast Recipes : మీకు పునుగులు తినడమంటే ఇష్టమా? అయితే దీనిని మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా, స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. అయితే వాటిని ఇంట్లోనే టేస్టీగా చేసుకోవాలంటే రెండు మంచి రెసిపీలు ఉన్నాయి. మైదా పిండిని ఇష్టపడని వారు మినపపిండితో.. మినపపిండి చేసేంత టైమ్ లేదనుకునేవారు మైదా పిండితో హాయిగా పునుగులు చేసుకుని లాగించేయవచ్చు. ఇంతకీ ఏయే ఏయే పిండితో ఎలా తయారు చేయాలి? వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఏ టిప్స్ ఫాలో అయితే నూనె లాగకుండా ఉంటుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ దోశ పిండి - 2 కప్పులు
పోహా - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రై చేయడానికి
పచ్చిమిర్చి -2
ఉల్లిపాయ - 1 పెద్దది
జీలకర్ర - అర టీస్పూన్
అల్లం - అంగుళం
తయారీ విధానం
మీ దగ్గర ఇడ్లీ దోశ పిండి లేకపోతే.. మీరు పునుగుల కోసం పిండిని తయారు చేసుకోవచ్చు. పావు కప్పు మినపప్పు, ముప్పావుకప్పు బియ్యం నానబెట్టాలి. నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత వాటిని మిక్సీ వేసుకోవాలి. పిండిని మెత్తగా చేసుకోవాలి. అలా అని కారుతున్నట్లు కాకుండా.. చిక్కగా ఉండేలా రుబ్బుకోవాలి. పిండి లూజ్‌గా ఉంటే నూనెను ఎక్కువగా పీల్చుకుంటుంది. పిండిలో అటుకులు వేసి రాత్రంతా పులియనిచ్చి.. పొద్దున్న పునుగుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి.
మిక్సింగ్ గిన్నెలోకి పిండిని తీసుకుని.. దానిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం తరుగు వేయాలి. జీలకర్ర, ఉప్పు కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచండి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి.. వేడిచేయండి. స్టౌవ్‌ను మీడియం మంట మీద ఉంచి.. పిండిని తీసుకుని చిన్నచిన్న ముద్దలుగా నూనెలో వేయాలి. నూనె బాగా వేడి అయ్యాకే పునుగులు వేయాలి. లేదంటే పునుగులు కడాయికి అంటుకుంటాయి. వేడిగా ఉంటే.. పునుగులు పైకి తేలుతాయి. కొన్ని నిమిషాలు వాటిని అలాగే వేగనివ్వండి. అనంతరం వాటిని మరోవైపు తిప్పండి. పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే.. వాటిని తీసేయొచ్చు. మిగిలిన పిండితో కూడా ఇదే మాదిరిగా పునుగులు వేసుకోవాలి. అంతే వీటిని మీకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా లాగించేయవచ్చు.
మైదా పునుగులు ఎలా చేయాలంటే..
ముప్పావు కప్పు మైదాను మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిలో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పెరుగు, పచ్చిమిర్చి తురుము, ఉల్లిపాయ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మీకు నచ్చితే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. పావు టీస్పూన్ సోడా కూడా వేసి బాగా కలిపి పిండిని ఓ గంట పక్కన పెట్టాలి. నూనెను డీప్ ఫ్రైకి వేడి చేసుకుని.. పునుగులు వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే మైదా పునుగులు రెడీ. మీకు నచ్చిన చట్నీతో ఆస్వాదించవచ్చు.
Also Read : ఈస్టర్ స్పెషల్ టేస్టీ చిక్ కప్ కేక్స్.. చాలా ఈజీగా తయారుచేసుకోగలిగే రెసిపీ ఇదే