Fatty Liver Symptoms : కాళ్ల వాపు చిన్న విషయం కాదు.. ఇది ఫ్యాటీ లివర్ ప్రారంభ సంకేతం కావచ్చు, నిపుణుల సూచనలు ఇవే
Early Sign of Fatty Liver : కాలేయ సమస్య ప్రారంభ సూచనలలో కాళ్ళ వాపు ఒకటి అని అస్సలు దానిని విస్మరించవద్దంటున్నారు నిపుణులు. సకాలంలో చికిత్స చేస్తే మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే..

Swelling in Legs Can Be an Early Sign of Fatty Liver : ప్రపంచవ్యాప్తంగా కాలేయానికి సంబంధించిన వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వేగంగా పెరుగుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. కాలేయ వ్యాధులు జీవనశైలిలోని మార్పులు, ఆహారపు అలవాట్లకు సంబంధించిన వాటివల్లే ఎక్కువగా వస్తోన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేయ సమస్యలు వస్తోన్న వారిలో పాదాల్లో వాపు, ఎడీమా వంటివి కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇది ఫ్యాటీ లివర్ ప్రారంభ సంకేతంగా చెప్తున్నారు. పాదాల్లో వాపు తరచుగా కనిపిస్తే అస్సలు విస్మరించవద్దని చెప్తున్నారు. ప్రారంభ సంకేతమే కాబట్టి.. ఫ్యాటీ లివర్‌ను ముందుగా గుర్తించవచ్చని.. దానికి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
ఫ్యాటీ లివర్ ప్రారంభ సంకేతం
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫ్యాటీ లివర్ ప్రారంభ సంకేతం కాళ్ల వాపు లేదా పెడల్ ఎడీమా. అయితే ఇది చాలా సాధారణమైన వాపుగా భావించి.. తరచుగా నిర్లక్ష్యం చేస్తున్నారని అది ఎంత మాత్రం మంచిది కాదని చెప్తున్నారు. ఫ్యాటీ లివర్‌ను సకాలంలో నయం చేయకపోతే.. అది క్రమంగా సిర్రోసిస్ లేదా క్యాన్సర్ వంటి తీవ్రమైన కాలేయ వ్యాధులకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఫ్యాటీ లివర్ అంటే..
ఫ్యాటీ లివర్ లేదా హెపాటిక్ స్టీటోసిస్ అనేది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. ఇది చిన్న స్థాయిలో సాధారణమైన కొవ్వుగా ప్రారంభమవుతుంది. కానీ కొవ్వు పెరిగినప్పుడు అది కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది. NAFLD సాధారణంగా ఊబకాయం, మధుమేహం, పేలవమైన ఆహారం, శారీరక శ్రమతో ముడిపడి ఉంటుంది. దీనిని సకాలంలో నియంత్రించకపోతే.. అది NASH సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది.
పాదాల వాపును ఎలా గుర్తించాలి..
పెడల్ ఎడీమాను ఇంట్లో సులభంగా తెలుసుకోవచ్చు. మీ పాదాలపై, ముఖ్యంగా చీలమండలపైన కొన్ని సెకన్ల పాటు ప్రెస్ చేయండి. ఒత్తిడిని తొలగించిన తర్వాత మీ చర్మంపై గుంట లేదా పిట్ ఉంటే.. దానిని పిట్టింగ్ ఎడీమా అంటారు. సాధారణంగా వాపు ఎక్కువసేపు నిలబడటం లేదా నడవటం వల్ల రావచ్చు. దీనిని కూడా అలాగే భావించి నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ కాలేయానికి హాని కలిగించే ప్రారంభ సంకేతం కావచ్చని అంటున్నారు.
సరైన సమయంలో గుర్తిస్తే..
ఫ్యాటీ లివర్ లక్షణాలు పెరిగే వరకు వేచి ఉండకుండా ప్రారంభ సంకేతాలతోనే వైద్య సహాయం తీసుకుంటే సమస్యను పూర్తిగా నివారించవచ్చు. అలాగే లైఫ్స్టైల్లో మార్పులతో దానిని రాకుండా చేసుకోవచ్చు. కానీ ఆలస్యం చేసేకొద్ది తీవ్రత పెరగడంతో పాటు.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం రెట్టింపు అయి.. ప్రాణాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.






















