Shilpa Shetty Diet Tips : శిల్పా శెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకునే ఫుడ్ ఇదే.. 50 ఏళ్లల్లో ఫిట్‌గా ఉండేందుకు ఇవి ట్రై చేసేయండి
Shilpa Shetty : హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఏమాత్రం అందం తగ్గకుండా హెల్తీగా, ఫిట్‌గా కనిపించే హీరోయిన్ శిల్పా శెట్టి. ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె చెప్తుందో చూసేద్దాం.

Shilpa Shetty Fitness & Diet Secrets : హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలనుకుంటే.. మీరు శిల్పా శెట్టి ఫిట్‌నెస్ టిప్స్ ఫాలో అయిపోవచ్చు. తెలుగు వారికి సాగర కన్యగా తెలిసిన ఈ భామ.. ఈ ఏడాది తన 50వ పుట్టినరోజును జరుపుకుంది. అయితే ఆమె స్కిన్, ఫిట్‌నెస్ మాత్రం ఇంకా 20ల్లోనే ఉంది. ఆమె మెరిసే చర్మం, ఫిట్ బాడీని చూస్తే ఎవరూ ఆమెకు అంత వయసు ఉంది అనుకోరు. హీరోయిన్స్ మేకప్ వేసుకుంటారు. అందుకే కనిపిస్తారు అనుకోవచ్చు. కానీ వారు ఫిట్‌నెస్ కోసం, హెల్తీ స్కిన్ కోసం ఓ రొటీన్‌ను సెట్ చేసుకుంటారు. శిల్పా శెట్టి కూడా తన గ్లామర్, ఫిట్‌నెస్ కోసం ఆరోగ్యకరమైన దినచర్యను ఫాలో అవుతుంది.
శిల్పా శెట్టి పెద్ద ఫుడీ. ఆమెను చూస్తే ఇది తెలియదు. అయితే ఈమె నోటికి రుచిగా ఫుడ్స్ తీసుకుంటూ.. తన ఆరోగ్యం గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అసలు ఆమె రోజువారీ ఫాలో అయ్యే ఆహార ప్రణాళిక ఏంటో.. రొటీన్ ఎలా ఉంటుందో.. 50 ఏళ్లు వచ్చిన స్లిమ్ బాడీకోసం ఆమె ఫాలో అయ్యే టిప్స్ ఏంటో చూసేద్దాం.
మార్నింగ్ రొటీన్
శిల్పా తన రోజును ఆరోగ్యకరమైన జ్యూస్, గోరువెచ్చని నీటిని తాగి ప్రారంభిస్తుంది. దీనితో పాటు ఉదయాన్నే తులసి ఆకులు, బెల్లం, అల్లంను కలబంద రసంలో కలిపి తాగుతుంది. ఆమె తన పుస్తకం ది గ్రేట్ ఇండియన్ డైట్‌లో ఈ రెసిపీ గురించి రాసుకొచ్చింది. ఇక డైట్ విషయానికొస్తే.. శిల్పా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటుందట. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదాహరణకు - ముస్లీ, తాజా పండ్లు లేదా ఓట్స్ తీసుకుంటుందట. షుగర్‌కు వీలైనంత దూరంగా ఉంటుందట శిల్ప. స్వీట్ క్రేవింగ్స్ ఉంటే బెల్లం లేదా తేనెను తీసుకుంటుందట.
లంచ్, డిన్నర్ టిప్స్
లంచ్ సమయంలో శిల్పా ఎక్కువగా ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్నే తీసుకుంటుందట. ఇందులో పప్పు-బియ్యం నుంచి చపాతీ, కూరల వరకు అన్నీ ఉంటాయి. దీనితో పాటు.. ప్రోటీన్ కోసం ఆమె చికెన్ లేదా చేపలను తీసుకోవడానికి ఇష్టపడుతానని తెలిపింది. సలాడ్ శిల్పా డైట్‌లో కచ్చితంగా ఉంటుందట. కొన్నిసార్లు తేలికగా తినగలిగే, జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటుందట. బ్రౌన్ రైస్, చికెన్, కూరగాయలు, సలాడ్‌తో చేసిన బ్యాలెన్స్డ్ డైట్ తినడానికి ఇష్టపడుతుందట. శిల్పా అల్పాహారం నుంచి డిన్నర్ వరకు టైమింగ్స్ కచ్చితంగా ఫాలో అవుతుందట. రాత్రి భోజనం 7:30 గంటల్లోపే ముగించేస్తుందట.
ఫిట్‌నెస్ రొటీన్
శిల్పా ఫిట్ స్లిమ్ బాడీకి అతిపెద్ద రహస్యం ఆమె రోజువారీ దినచర్యలో చేసే వ్యాయామం, యోగా. ఈ విషయం ఆమెను ఫాలో అయ్యేవారికి కచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే శిల్పా తరచుగా ఇన్‌స్టా రీల్స్‌లో యోగా వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఇది ఆమె శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. మనసును చేయాల్సిన అంశాలపై ఫోకస్ చేసేలా చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. మెరిసే ఆరోగ్యకరమైన చర్మానికి కూడా యోగా కారణమే. ఇది శరీరం సరిగ్గా పనిచేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీనితో పాటు మెటబాలీజం పెంచి ఫిట్‌గా, స్లిమ్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.
మీరు 20ల్లో ఉన్నా.. 30 దాటినా మంచి ఫిట్‌నెస్ రొటీన్ ఏర్పాటు చేసుకోవడానికి వెనకాడకండి. మీరు ఇప్పుడు ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేస్తే శిల్పా శెట్టిలా కాలేకపోవచ్చు కానీ.. చెక్కిన శిల్పంలా అందంగా మారవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా మీరు కూడా ఓ హెల్తీ రొటీన్‌ని సెట్ చేసుకోండి.























