Stress Hormone: పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడానికి ఒత్తిడి హార్మోన్ కూడా ఒక కారణమే
అధిక బరువుతో బాధపడే వారిలో ఎక్కువగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది.
ఉద్యోగంలో పోటీ వాతావరణం ఉండడం, ఎక్కువసేపు పనిచేయాల్సి రావడం, క్లయింట్లతో మీటింగులు, కుటుంబ పనులు, పిల్లలు, ఆర్ధిక సమస్యలు ఇవన్నీ కూడా వ్యక్తుల్లో తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. శరీరంలో ఒత్తిడి పెరిగినప్పుడు కార్టిసోల్ అనే హార్మోను విడుదలవుతుంది. ఈ హార్మోన్ బరువు పెరిగేందుకు కూడా సహకరిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడానికి ఇది కారణం కావచ్చు అని చెబుతున్నారు అధ్యయనకర్తలు. తినే ఆహారం కూడా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్డే ఉండడం, తక్కువ సమయంలో వీటిని ఆర్డర్ చేసుకొని తినే వీలు ఉండడంతో... బర్గర్లు, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ వంటివి తిని రోజులు గడిపేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఈ ఒత్తిడి హార్మోను, అలాంటి ఆహారాలు కలిసి బొడ్డు చుట్టూ విపరీతమైన కొవ్వు పేరుకుపోయేలా చేస్తున్నట్టు వైద్యులు వివరిస్తున్నారు.
బరువు పెరగడానికి, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధం ఉంది. అలాగే బరువు పెరగడానికి, ఒత్తిడికి కూడా అనుబంధం ఉంది. తరచూ ఒత్తిడి బారిన పడేవారు త్వరగా బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. అలాగే ఒత్తిడి వల్ల కూడా గుండె సంబంధా వ్యాధులు వస్తాయి. దీన్ని బట్టి ఒత్తిడి ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణమవుతుందని అర్థం చేసుకోవచ్చు. అధిక కొవ్వుతో నిండిన ఆహారాల వల్ల కూడా ఒత్తిడి అధికంగా కలిగే అవకాశం ఉంది. ఇది జీర్ణ క్రియను నెమ్మదించేలా చేసి, పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది. దీని వల్ల కూడా ఒత్తిడి కలుగుతుంది.
కార్టిసాల్ అనేది ఒత్తిడి కలిగినప్పుడు అడ్రినల్ గ్రంధులు ఉత్పత్తి చేసే ఒక హార్మోన్. శరీరంలోని వివిధ శారీరక విధులను నియంత్రించడానికి ఈ హార్మోన్ చాలా అవసరం. రక్తపోటును నిర్వహించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, రోగనిరోధక వ్యవస్థను కాపాడడానికి చాలా అవసరం. ఇది శరీరంలో మంట, ఒత్తిడి వంటివి కలిగినప్పుడు ప్రతిస్పందనగా విడుదలవుతుంది. అయితే ఇది అధికంగా విడుదలైనా లేక దీర్ఘకాలం పాటు విడుదలవుతూ ఉన్నా సమస్యగా మారుతుంది. దీర్ఘకాలికంగా కార్టిసాల్ స్థాయిలు శరీరంలో అధికంగా ఉండడం వల్ల మనం ఎక్కువ ఒత్తిడికి లోనవుతాం. ఇది నిద్ర పట్టకుండా చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరిచేలా చేస్తుంది. బరువు పెంచుతుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి కాకుండా అవసరమైనంతవరకు మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేసుకోవాలి.
కార్టిసాల్ హార్మోను పొట్ట దగ్గర కొవ్వు పెరిగేలా చేయడంలో సహకరిస్తుంది. చెడు ఆహార అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వంటివన్నీ కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయినట్టు చేస్తాయి. కార్టిసాల్ స్థాయిలు శరీరంలో అధికంగా ఉన్నప్పుడు మీ శరీరం కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను తినాలని కోరుకుంటుంది. ఎందుకంటే అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. ఇన్సులిన్... కార్టిసోల్‌ను నియంత్రిస్తుంది. అధిక ఇన్సులిన్, కార్టిసాల్ మీ రక్త ప్రవాహంలో కలిసి కొవ్వును నిల్వ చేసే ఎంజైమ్ అయినా లిపో ప్రోటీన్ లైపేస్ ను సృష్టిస్తాయి. ఈ ఎంజైమ్ అధిక స్థాయిలో ఉత్పత్తి అయితే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది.
సన్నటి మనుషుల్లో కూడా కొంతమందికి పొట్ట దగ్గర కొవ్వు కనిపిస్తుంది. దానికి కారణం అధిక కార్టిసాల్ స్థాయిలే. ఆందోళన, నిరాశ వంటి వాటిలో కూరుకుపోయిన వారిలో కూడా పొట్ట దగ్గర కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. అధిక కార్టిసాల్ స్థాయిల వల్ల మధుమేహం, జీర్ణాశయంతర సమస్యలు, బరువు పెరగడం, రోగ నిరోధక పని తీరు తగ్గడం వంటివి ఏర్పడవచ్చు. కాబట్టి ఒత్తిడి బారిన పడకుండా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. మీ ఆలోచనలు తాజాగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ సంతోషంగా జీవించేందుకు ప్రయత్నించాలి.
Also read: నెలరోజుల పాటూ మద్యం తాగడం పూర్తిగా మానేస్తే జరిగేది ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.