చల్లదనం కోసం ఏసీలో ఎక్కువగా ఉంటున్నారా? మీ చర్మంపై ఈ మార్పులు తప్పవు
ఏసీని ఎక్కువగా వాడేవారు త్వరగా ముసలి వారిలా కనిపించడం మొదలవుతుంది.
ఏసీలో ఉండడం అనేది గొప్పగా భావిస్తారు ఎంతోమంది. నిజానికి అది ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు. తట్టుకోలేనంత వేసవి ఉన్నప్పుడు ఏసీని కోరుకోవడం సహజమే. కానీ అవసరం ఉన్నా, లేకపోయినా, బయట వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఈ కృత్రిమ చల్లదనాన్ని ఇచ్చే ఏసీలోనే ఉండడం వల్ల ఆరోగ్యం పై ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఆఫీసుల్లో 24 గంటలు ఏసీలు ఆన్‌లోనే ఉంటాయి. ఇలా ఎయిర్ కండిషన్లలో ఉండే వారికి చర్మం అనారోగ్యం పాలవుతుంది. ముడతలు పడి, చర్మం కుచించుకుపోయి ముసలిగా కనిపిస్తుంది. అంటే 30 ఏళ్లలో ఉన్నా కూడా 40 ఏళ్ల వయసు వారిలా కనిపించడం మొదలవుతుంది. ఇంట్లో, కార్లో ఏసీలు వేసుకొని తిరిగేవారు ఆ అలవాటును మార్చుకుంటే మంచిది.
నిత్యం ఏసీలో ఉండడం వల్ల చర్మం లో చెమట, నూనె ఉత్పత్తి కావడం తగ్గిపోతుంది. దీనివల్ల వ్యర్ధాలన్నీ చర్మంలోనే ఉండిపోతాయి. అప్పుడు మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. చర్మం కాంతి హీనంగా తయారవుతుంది. పాలిపోయినట్లు కనిపిస్తుంది. దీనివల్ల మీరు ఎన్ని క్రీములు రాసినా చర్మం అందంగా ఉండదు. ఏసీలో నిత్యం ఉండే వారిలో చర్మంలో తేమ తగ్గిపోతుంది. దీనివల్ల పొడిదనం పెరిగి కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల చూడగానే ముఖం ముసలిగా కనిపించే అవకాశం ఉంది.
కొన్ని రకాల చర్మవ్యాధులు కూడా త్వరగా వస్తాయి. సొరియాసిస్, తామర వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని గంటల పాటు చర్మానికి సూర్య రశ్మి తగలడం చాలా అవసరం. శీతాకాలం, వానాకాలంలో పూర్తిగా ఏసీని మానేయడం ఉత్తమం. దీనివల్ల చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది. అలాగే తగినంత నీటిని కూడా తీసుకుంటూ ఉండాలి. ఏసీలో ఉండడం వల్ల దాహం వేయదు. మీకు తెలియకుండానే శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. ఏసీలో ఉన్నా, లేకపోయినా ప్రతి గంటకు గుక్కెడు నీళ్లు తాగడం చాలా అవసరం. దాహం వేసినా, వేయకపోయినా రోజుకు 8 గ్లాసులు నీరు తగ్గకుండా తాగాలి. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మాయిశ్చరైజర్లను కూడా రాసుకుంటూ ఉండాలి. ఏసీలో ఉండేవారు కచ్చితంగా మాయిశ్చరైజర్ ను వాడాల్సిందే. లేకుంటే వారి చర్మం త్వరగా పొడిబారిపోతుంది.
ఏసీలలో ఎక్కువ కాలం పాటూ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి త్వరగా వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, జలుబు, దగ్గు వంటివి త్వరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏసీలను అలవాటు చేసుకోవడం మంచిది కాదు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏసీలను దూరం పెట్టాలి.
Also read: ఎత్తుగా ఉన్నామని మురిసిపోకండి, ఈ జబ్బులు వచ్చే అవకాశం మీకే ఎక్కువ
Also read: ఈ ఆహారాలను రోజూ తింటే గుండెపోటు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.