Set Dosa Recipe : స్పాంజ్లాంటి సెట్ దోశల కోసం ఈ రెసిపీని ఫాలో అయిపోండి
Set Dosa : మీరు మెత్తని, క్రిస్పీ, టేస్టీ దోశలు తినాలనుకుంటున్నారా? వాటిని ఇంట్లోనే తయారు చేసుకోగలిగే రెసిపీ ఇక్కడుంది. వీటిని వేసుకోవడానికి కొన్ని టిప్స్ కూడా ఫాలో అవ్వాలి.
South Indian Breakfast : కొన్నిసార్లు రోటీన్కి భిన్నంగా మెత్తటి, స్పాంజ్ లాంటి దోశలు తినాలని అనిపిస్తుంది. అప్పుడు మనం సెట్ దోశలు తినేందుకు ప్రయత్నిస్తాము. అయితే వాటిని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తెలుసా? కొన్ని పదార్థాలు ఉంటే.. మీరు మెత్తని, టేస్టీ సెట్ దోశలు తయారు చేసుకోవచ్చు. వాటిని ఏ విధంగా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? వేటితో తింటే టేస్ట్ బాగుంటుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 200 గ్రాములు
పోహా - అర కప్పు
మినపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మెంతి గింజలు - 1 టీస్పూన్
నీరు - తగినంత
చక్కెర - పావు టీస్పూన్
ఉప్పు - అర టీస్పూన్
బేకింగ్ సోడా -పావు టీస్పూన్
నెయ్యి - దోశలకు తగినంత
తయారీ విధానం
బియ్యం, మినపప్పు, మెంతులను ఓ గిన్నెలో తీసుకుని బాగా కడగండి. మీరు బియ్యంకి బదులు అన్నం కూడా ఉపయోగించవచ్చు. వాటిలో నుంచి నీరు పోయేవరకు వడకట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు మరోగిన్నెలో పోహాను తీసుకుని రెండుసార్లు నీటితో శుభ్రం చేసుకోండి. ఇప్పుడు బియ్యం, మినపప్పు, మెంతులు, పోహాను వేసి నీరు పోసి.. ఓ 5 గంటలు వాటిని నానబెట్టండి. అవి బాగా నానిన తర్వాత వాటిని నీటిని వడబోసి.. మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. అవి పూర్తిగా మెత్తగా, దోశ పిండి మాదిరిగా రెడీ చేసుకోండి. అవసరానికి తగ్గట్లు నీరు పోయండి.
తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకోండి. ఈ పిండిలో పంచదార వేసి దానిని బాగా కలపండి. పిండి గిన్నెపై మూతపెట్టి.. ఓ 8 గంటలు బయటనే ఉంచి పులియనివ్వండి. ఇలా పులిసిన పిండిలో ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. పిండి పులిస్తేనే దోశలు టేస్టీగా వస్తాయని గుర్తించుకోండి. పిండి మందంగా ఉంటే నీటిని వేసి బాగా కలపండి. దోశలు వేసుకునేందుకు పిండి సిద్ధం. ఇప్పుడు సెట్ దోశలు ఎలా వేసుకోవాలో చుద్దాం.
స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ లేదా తవాను పెట్టి వేడి చేయండి. కాస్త నెయ్యి వేసి.. పిండిని ఓ సారి బాగా కలిపి దోశలుగా వేయాలి. చిన్న, మందపాటి సైజ్లో దోశను వేయాలి. మంట మీడియంగా ఉండేలా చూసుకోండి. లేదంటే దోశలు మాడిపోతాయి. పైన, చుట్టూపక్కలా నూనె వేసి వేడి చేయండి. మీకు నచ్చితే.. దానిపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వంటివి కూడా వేసుకోవచ్చు. దోశ అడుగుభాగం గోధుమరంగులోకి మారినప్పుడు దోశను తిప్పి మరోవైపు కాల్చండి. ఇలా మిగిలిన పిండితో కూడా దోశలు వేయాలి. అంతే వేడి వేడి టేస్టీ, మెత్తని సెట్ దోశలు రెడీ.
ఈ సెట్ దోశలను మీరు కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఆలు కుర్మా, సాంబార్లతో సర్వ్ చేసుకోవచ్చు. దోశలు వేసేప్పుపుడు మీరు నెయ్యికి బదులు నూనె కూడా వాడొచ్చు. పిండిని పులియబెట్టేప్పుడు దానిని ఏ మాత్రం ఫ్రిజ్లో ఉంచకూడదు. మీరు బియ్యం ప్లేస్లో అన్నం, ఇడ్డీ రవ్వను కూడా ఉపయోగించవచ్చు. కానీ ఇడ్డీ రవ్వ వేస్తే నీరు ఎక్కువ పీల్చుకుంటుంది.
Also Read : టేస్టీ, క్రిస్పీగా ఉండే గోధుమ దోశలు.. ఇన్స్టాంట్ రెసిపీ ఇదే