Sleep Deprivation Effects: రాత్రంతా జాగారం చేస్తున్నారా? జాగ్రత్త - ఆలస్యంగా నిద్రపోతే మీ మెదడులో జరిగేది ఇదే
Late sleeping: చేతిలో ఫోన్ ఉంటే.. నిద్ర రమ్మన్న రాదు. ఒక వేళ వచ్చినా.. మనమే వాయిదా వేస్తుంటాం. బలవంతంగా నిద్రను ఆపేసి మరీ ఫోన్ చూసేస్తాం. దానివల్ల మెదడుకు ఏమవుతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా?
Late Sleeping Side Effects: మన పెద్దలు ఎప్పటి నుంచో సరైన సమయంలో భోజనం చేయాలని, నిద్రించాలని.. అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేవారు, ఆ నియమాలను కచ్చితంగా పాటించేవారు కూడా. ఆయుర్వేద నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి అల్పాహారాన్ని ముగించాలని, సాయంత్రం చీకటి పడిన వెంటనే భోజనం చేయాలనే నియమాలను తప్పక పాటించాలని చెబుతున్నారు. మన పూర్వికుల ఆరోగ్య రహస్యం కూడా ఇదేనని తెలుపుతున్నారు. అయితే, ఈ రోజుల్లో పని ఒత్తిడి, మొబైల్ వాడకం వల్ల కంటి నిండా నిద్రపోయేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అర్ధరాత్రిళ్లను కూడా పట్టపగలుగా ఫీలవుతూ గడిపేస్తున్నారు. ఆలస్యంగా నిద్రపోతూ కొత్త రోగాలను తెచ్చుకుంటున్నారు. నిద్రనాణ్యత లోపించడం వల్ల డయాబెటిస్, గుండె సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.
చాలామంది స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడి గంటల తరబడి నిద్రపోవడం లేదు. అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము వరకు మెలకువగా ఉంటున్నారు. ఇలా మెలకువగా ఉండటం వల్ల మెదడు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటుంది. ఫలితంగా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం మీ రోగ నిరోధక శక్తి పైన కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, డయాబెటిస్ వంటి రుగ్మతలు సైతం వచ్చేందుకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంలో హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ అవుతాయని, చివరకు అది శరీరంలో అనేక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మెదడులో ఏం జరుగుతుంది?
నిద్రలో మన శరీరానికి పెద్ద పని ఉండదని అనుకుంటాం. కానీ అసలు పని అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో మన మెదడు చాలా కష్టపడి పనిచేస్తుంది. మన జ్ఞాపకశక్తిని మరింత మెరుగుపరిచే పని అప్పుడే అభివృద్ధి చేస్తుంది. కేవలం రాత్రివేళల్లో మాత్రమే మన మెదడు ఈ పనులన్నీ చేస్తుంది. మెలకువ ఉన్నట్లయితే.. అది మనం చెప్పే పని మాత్రమే చేస్తుంది. మన శరీర ఆరోగ్యం, మెమరీ, మానసిక ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచేందుకు చేయాల్సిన పనులు చేయలేదు. మనం నిద్రపోయినప్పుడు మాత్రమే దానికి అవన్నీ సరిచేసేందుకు టైమ్ దొరుకుతుంది. కానీ, మనం నిద్రపోకుండా మెదడుకు ఎక్కువ పని చెబుతున్నాం. దాని పని అది చేసుకోడానికి తక్కువ సమయం ఇస్తున్నాం. ఫలితంగా అనేక రోగాలకు ఆహ్వానం పలుకుతున్నాం.
స్లీప్ స్పెషలిస్ట్‌ల సూచనల ప్రకారం.. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. ఇందుకు మీ వర్క్ షెడ్యూల్ మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు సరైన సమయానికి నిద్రపోయేందుకు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. నిద్రలేమి వల్ల డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లకు గురయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థులు నిద్ర లేకపోవడం వల్ల తమ కెరీర్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా సరైన సమయానికి నిద్రపోయి ఆరోగ్యంగా ఉండండి. నిద్రపోకుండా రాత్రిళ్లు జాగారం చేసే మీ స్నేహితులకు ఈ విషయాన్ని షేర్ చేయండి.
Also Read : చలికాలంలో సన్షైన్ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.