Kids: పిల్లల్లోనూ అధిక రక్తపోటు ఆనవాళ్లు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
పిల్లలకు హై బీపీ ఎలా వస్తుంది? అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది.
పిల్లల్లో అధిక రక్తపోటు అనగానే ఎవరూ నమ్మలేరు. కానీ నిజంగానే కొంత మంది పిల్లల్లో హైబీపీ కేసులు బయటపడ్డాయి. మధుమేహంలాగే హైబీపీ కూడా పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్ చిన్న వయసులో పిల్లలకు వస్తుంది. అలాగే అధిక రక్తపోటు కూడా చిన్న వయసు పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో 1990ల కాలంలోనే అయిదు శాతం కన్నా ఎక్కువ మంది పిల్లల్లో అధిక రక్తపోటు ఉన్న విషయాన్ని కనిపెట్టారు వైద్యులు. ఇప్పుడు దాదాపు పది శాతం మంది పిల్లలు అమెరికాలో అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. మనదేశంలో కూడా ఏడు శాతం మంది పిల్లలు హైబీపీతో బాధపడుతున్నట్టు అంచనా.
పిల్లలకు అధిక రక్తపోటు కొలిచే విధానం పెద్దవారిలా ఉండదు. పిల్లలకు ఉండాల్సిన బీపీ ఎంత ఉండాలన్నది వైద్యులు నిర్ణయిస్తాయి. ఆరేళ్ల నుంచి 13 ఏళ్లలోపు పిల్లలకు నార్మల్ బీపీ రేంజ్ 105/70 వరకు ఉంటుంది. అది దాటితే హైబీపీ కింద లెక్క. ఇక ఆరేళ్లలోపు పిల్లల్లో ఇంతకన్నా తక్కువ ఉంటుంది. అయితే హైబీపీ ఎక్కువగా ఆరేళ్లు పైబడిన పిల్లల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఏ పిల్లల్లో అయితే కిడ్నీ, రక్త నాళ జబ్బులు, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యల వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి?
పెద్దలకు అధిక రక్తపోటు వస్తే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ పిల్లలకు రక్తపోటు వస్తే అంత స్పష్టంగా లక్షణాలు బయటపడకపోవచ్చు. గుర్తించడం కాస్త కష్టతరమే అవుతుంది. పిల్లలకు గుండె దడగా అనిపించినా, ఛాతీ నొప్పి, తలతిప్పడం, తలనొప్పి, ఆయాసం, పడుకుని లేవగానే తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. వీటిలో ఏ లక్షణం కనిపించినా కచ్చితంగా బీపీ పరీక్ష చేయించాలి.
ఇలా చేయకండి...
పిల్లలను మార్కుల కోసం, చదువుల కోసం తీవ్ర ఒత్తిడికి గురి చేయడం వల్ల హైబీపీ వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి అనేక వ్యాధులకు కారణం అవుతుంది. ఇంట్లో పిల్లల ముందే తల్లిదండ్రలు తగువులు పడడం, కొట్టుకోవడం వంటివి కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఆహారంలో అధికంగా ఉప్పు వేసి పెట్టడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే చిప్స్, బర్గర్లు, పిజ్జా, వేఫుళ్లు వంటివి అధికంగా తినే పిల్లల్లో కూడా హైబీపీ వచ్చే అవకాశం ఉంది.
Also read: చలికాలంలో ముల్లంగి వంటలను కచ్చితంగా ఎందుకు తినాలి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.