Papaya: నెలసరి వస్తే బొప్పాయి, పైనాపిల్ తినకూడదా? తింటే ఏమవుతుంది?
నెలసరి వస్తే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
మహిళ జీవితంలో నెలసరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా సమయానికి నెలసరి వస్తేనే ఆమె ఆరోగ్యం చక్కగా ఉన్నట్టు. నెలసరి ఆలస్యం అవుతున్నా లేక రాకపోయినా ఖచ్చితంగా వైద్యులను కలవాల్సిందే. నెలసరి సమయానికి రాకపోతే పునరుత్పత్తి వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్టు భావిస్తారు వైద్యులు. అందుకే ప్రతి నెలా నెలసరి కావడం చాలా ముఖ్యం. ఈ నెలసరి సమయంలో ఉండాల్సిన తీరుపై ఎన్నో కట్టుబాట్లు సమాజంలో ఉన్నాయి. కొంతమంది ఆ రోజుల్లో స్నానం చేయకూడదని అంటే మరికొందరు ఏవి ముట్టుకోకుండా దూరంగా ఉండాలని అంటారు. అలాగే తినే పదార్థాలపై కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నెలసరి సమయంలో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల రుతుస్రావం అధికంగా అవుతుందనే అపోహ ఎక్కువ మందిలో ఉంది. ఇది ఎంతవరకు నిజమో వివరిస్తున్నారు వైద్య నిపుణులు.
నిజానికి పీరియడ్ సమయంలో బొప్పాయి తినడం చాలా సురక్షితం. అంతేకాదు ఎంతో ప్రయోజనకరం కూడా. ఎందుకంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, బొప్పాయి ద్వారా అందుతాయి. ఇది రుతు చక్రాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది. పొట్ట ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. కాబట్టి నెలసరి సమయంలో బొప్పాయి తినడం అనేది చాలా ఆరోగ్యకరం.
చాలామంది నెలసరి సమయంలో పైనాపిల్స్ దూరం పెడతారు. అలా పెట్టాల్సిన అవసరం లేదు. మీ పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా పైనాపిల్స్ తినడం మంచిదే. రుతుస్రావ సమయంలో కాస్త తక్కువగా తింటే చాలు. అయితే అధికంగా తింటే మాత్రం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పైనాపిల్స్ రెండు మూడు ముక్కలతో ఆపేయాలి. అంతేతప్ప అంతకన్నా నెలసరి సమయంలో పైనాపిల్ తినడం వల్ల జరిగే నష్టమేమీ లేదు. దీనివల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నెలసరి సమయంలో శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. ప్యాడ్ మార్చుకున్న తర్వాత కచ్చితంగా సబ్బుతో చేతులు కడుక్కోండి. ప్రతి ఏడు గంటలకు ఒకసారి పాడ్ మారుస్తూనే ఉండండి. రోజుకు కనీసం మూడు ప్యాడ్లు వాడడం చాలా ముఖ్యం. లేకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. నెలసరి సమయంలో ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యకరం.
బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రెండు పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ రెండు పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి వారానికి కనీసం రెండు సార్లు ఈ పండ్లను తింటే ఎంతో ఆరోగ్యకరం.
Also read: వయసుకు తగ్గట్టు నిద్రపోవాలి, మీ వయసుకు మీరు ఎంత నిద్రపోవాలో తెలుసా?
Also read: చూయింగ్ గమ్ నములుతూ అనుకోకుండా అలా మింగేస్తే ఏమవుతుంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.