Sleep: వయసుకు తగ్గట్టు నిద్రపోవాలి, మీ వయసుకు మీరు ఎంత నిద్రపోవాలో తెలుసా?
వయసుకు తగ్గట్టే నిద్రపోయే గంటలు కూడా ఆధారపడి ఉంటాయి.
మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర లేకపోతే శరీరం కృశించిపోతుంది. అనారోగ్యాలు చుట్టుముడతాయి. ప్రతిరోజూ కచ్చితంగా ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలని చెబుతుంటారు. అయితే ఎంత సమయం నిద్రపోవాలి అనేది వయసుకు తగ్గట్టు ఉంటుంది. వయసును బట్టి ఎవరు, ఎంతసేపు నిద్ర పోవాలో వివరిస్తున్నారు వైద్యులు.
అప్పుడే పుట్టిన నెలల పిల్లలు ప్రతిరోజూ 18 గంటల పాటు నిద్రపోతూనే ఉంటారు. ఆ తర్వాత నిద్ర తగ్గుతూ ఉంటుంది. 6 నుంచి 13 ఏళ్ల మధ్య గల పిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతే మంచిది. వారు ఎక్కువ ఆరోగ్యంగా ఎదుగుతారు. వీరికి 11 గంటల నిద్ర అవసరం. ఇక 14 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న టీనేజీ పిల్లలు కనీసం రోజుల్లో 8 నుంచి 10 గంటల మధ్య నిద్రపోతే మంచిది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువత ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడరు. ఇలాంటివారు కచ్చితంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి. అప్పుడే వారి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. 25 నుంచి 65 సంవత్సరాల మధ్య గల వారంతా రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. అప్పుడే వారి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. ఇక 65 ఏళ్ల వయసు దాటినవారు కచ్చితంగా రోజులో 10 గంటల పాటు నిద్రపోవాలి. దీనివల్ల వారికి మానసిక ప్రశాంతతతో పాటు శారీరకంగా బలం చేకూరుతుంది.
యాభై ఏళ్లు దాటాక తీవ్రమైన అనారోగ్య సమస్యలకు అవకాశం ఎక్కువ. ఇలా గురవకుండా ఉండాలంటే వయసుకు తగ్గట్టు ముందు నుంచే నిద్రపోతూ ఉండాలి. నిద్ర తగ్గితే వయసు మీరాక అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. మనసుకు, శరీరానికి విశ్రాంతిని, ఉత్తేజాన్ని ఇవ్వడానికి నిద్ర ఉపయోగపడుతుంది. కాబట్టి నిద్రను తక్కువ అంచనా వేయకండి. నిద్ర తగ్గించుకొని పనులు చేయడానికి సినిమాలు చూడడానికి ప్రయత్నించకండి.
నిద్ర తగ్గితే ఆ ప్రభావం మీ మెదడుపై నేరుగా పడుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. జ్ఞాపకాలు తగ్గిపోతాయి. జీవక్రియకు కూడా నిద్ర తగ్గడం మంచిది కాదు. కాబట్టి నిద్రకు ప్రాధాన్యత ఇచ్చి ఎనిమిది గంటలు నిద్ర పోయేలా చూడండి. అప్పుడు మీ మనసు, శరీరం రెండూ ఉత్తేజంగా ఉంటాయి. పగటిపూట నిద్రపోకపోయినా ఫర్వాలేదు, రాత్రివేళ నిద్రపోవడం చాలా ముఖ్యం. మీ బెడ్ రూమ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. కాంతి తక్కువగా ఉంటే నిద్ర త్వరగా వస్తుంది. పరుపు కూడా మెత్తగా, నీట్‌గా ఉండేలా చూసుకోండి.
Also read: చూయింగ్ గమ్ నములుతూ అనుకోకుండా అలా మింగేస్తే ఏమవుతుంది?
Also read: టీ పొడి మీ ఇంట్లో ఉంటే మీరు కోటీశ్వరులే, దీని ధర ఆ రేంజ్లో ఉంటుంది మరి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.