Diabetes: డయాబెటిస్‌కు వాడే ఆ ఔషధంపై సంచలన రిపోర్ట్ - ఆ రోగాన్ని కూడా తగ్గిస్తుందా?
డయాబెటిస్ వ్యాధి నివారణకు వాడే ఔషధం మెట్ ఫార్మిన్. ఈ మందు ఊబకాయ నివారణతో పాటు మానసిక జబ్బుల నివారణకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు తేల్చారు.
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగులు తీసుకునే ఔషధం మెట్ ఫార్మిన్. సాధారణంగా రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ ఔషధాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే డయాబెటిస్ తో పాటు ఇతర వ్యాధులకు కూడా మెట్ ఫార్మిన్ వినియోగించవచ్చని ఇటీవల ఓ అధ్యయన బృందం తేల్చి చెప్పింది. మెట్‌ఫార్మిన్ బరువు పెరగడాన్ని కూడా నిరోధిస్తుందట. అంతేకాదు ఇది మానసిక జబ్బును కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. యాంటిసైకోటిక్స్ (SGAs) అని పిలవబడే బైపోలార్ డిజార్డర్ చికిత్సలో కూడా మెట్ ఫార్మిన్ వాడవచ్చని ఇటీవల పరిశోధనలో తేలింది.
ఎందుకంటే ఈ మానసిక జబ్బు నివారణ కోసం వాడే మందులు తరచుగా అధిక రక్తపోటు, గ్లూకోజ్, ఆకలిపెరగడం, బరువు పెరగడం వంటి దుష్ప్రభావాలు కలిగి ఉంటాయని. సిన్సినాటి విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు తేల్చారు.
బైపోలార్ డిజార్డర్‌తో మందులు తీసుకునే 8-19 సంవత్సరాల వయస్సు గల మొత్తం 1,565 మంది రోగులపై అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ మందులు తీసుకునే యువతలో 33 శాతం మందికి ప్రారంభంలో మెటబాలిక్ సిండ్రోమ్ ఉందని అధ్యయనం కనుగొంది.
మెటబాలిక్ సిండ్రోమ్ బాధితుల్లో ఊబకాయం, అధిక రక్తపోటు, ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ ఎలివేటెడ్ గ్లూకోజ్ కనుగొన్నట్లు మానసిక వైద్యులు తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి మెట్‌ఫార్మిన్ ఇస్తే బరువు పెరగడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు మెట్ ఫార్మిన్ ఔషధం సురక్షితమైనదని కొన్ని జీర్ణశయ వ్యాధులపై కూడా ఇది మెరుగ్గా పనిచేస్తుందని తేలింది.
బరువు.. హానికరమైన ఆరోగ్య ఫలితాలకు కూడా దారితీయవచ్చు. అయితే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ రోగులు మెట్ ఫార్మిన్ ఔషదాన్ని పెద్ద ఎత్తున వాడుతున్నారు. ప్రస్తుతం ఈ ఔషధం డయాబెటిస్ మాత్రమే కాకుండా ఇతర వ్యాధుల నివారణకు కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రస్తుత ఈ పరిశోధన తేల్చి చెప్పింది. కానీ మెట్ ఫార్మిన్ ఎక్కువ మొత్తంలో వాడినట్లయితే కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని గతంలో కొన్ని పరిశోధనల్లో తేలింది. అయితే ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా కూడా డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చని చాలా పరిశోధనలు పేర్కొన్నాయి.
డయాబెటిస్ చికిత్సకు వాడే మెట్ ఫార్మిన్ మందును కొన్నిసార్లు ఊబకాయం కంట్రోల్ చేయడానికి కూడా డాక్టర్లు సిఫార్సు చేస్తూ ఉంటారు. ఈ మందులో ఆకలిని తగ్గించడంతోపాటు శరీరంలో కొవ్వును నియంత్రిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం ఈ పరిశోధన ప్రాథమిక దశలో మాత్రమే ఉందని వైద్య నిపుణుల సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : టేస్టీగా రొయ్యల పోహా, తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.