Who is Rhea : మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేతగా రియా సింఘా- భారత్ నుంచి విశ్వసుందరి 2024 పోటీలకు ఎంపిక
Who is Rhea Singha: నవంబర్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్ నుంచి రియా సింఘా పోటీపడనున్నారు. మిస్ ఇండియా యూనివర్స్ 2024 పోటీల్లో విజేతగా నిలవడంతో ఆమె పేరు ఖరారు అయింది.
Who is Rhea Singha: ఈ ఏడాది చివర్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్ నుంచి 18 ఏళ్ల రియా సింఘా పోటీ పడనుంది. జైపూర్‌లో జరిగిన మిస్ ఇండియా యూనివర్స్ 2024 పోటీల్లో విజేతగా నిలిచిన రియా.. మెక్సికోలో జరగనున్న పోటీల్లో భారత్‌కు ఈసారి మిస్ యూనివర్స్ కిరీటం తెస్తుందని అంచనా వేస్తున్నారు.
51 మందిని వెనక్కి నెట్టిన గుజరాతీ అందం:
ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో 52 మంది అందగత్తెలు పోటీపడగా.. వారందరినీ గుజరాత్‌కు చెందిన రియా సింఘా వెనక్కి నెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ప్రంజల్ ప్రియా రన్నరప్‌గా నిలవగా. చ్ఛావి వెర్గ్ సెకండ్ రన్నరప్, సుష్మితారాయ్ నాలుగో స్థానం, వీసో ఐదో స్థానంలో నిలిచారు. జడ్జ్‌ల ప్యానెల్‌లో మాజీ విశ్వసుందరి ఇండియా ఊర్వశి రౌటేలా, నిఖిల్ ఆనంద్, వియత్నాం స్టార్ ఎన్‌గుయెన్ క్యున్, ఫాషన్ ఫొటోగ్రాఫర్ రియా ఫెర్నాండేజ్, వ్యాపారవేత్త రాజీవ్ శ్రీవాత్సవ ఉన్నారు.
విశ్వసుందరి భారత్ -2024గా ఎంపికవడం పట్ల 18 ఏళ్ల రియా సింఘా భావోద్వేగానికి గురైంది. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇక్కడి వరకూ రావడానికి ఎంతో శ్రమించానని.. ఈ అవార్డుకు తాను పూర్తి అర్హురాలినన్న రియా .. ఇప్పటి వరకూ ఈ కిరీటాన్ని ధరించిన వాళ్ల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని తెలిపింది. రియాతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన 2015 విశ్వసుందరి భారత్ విజేత ఊర్వశి రౌటేలా.. ఈ ఏడాది భారత అందమే విశ్వ సుందరి పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. నవంబర్ 16న మెక్సికోలో ఈ పోటీలు జరగనున్నాయి.
రియా నటి కూడా:
రియా సింఘా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పరిశీలిస్తే తనను తాను ఒక నటిగా, టెడ్‌ఎక్స్ స్పీకర్‌గా పేర్కొంది. ఆమె ఇన్‌స్టా అకౌంట్‌కు 47 వేల మంది వరకూ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం రియా ఆర్ట్స్‌లో డిగ్రీ చేస్తోంది. తనొక బడ్డింగ్ ఫ్యాషన్ డిజైనర్ కూడా. తన డిజైన్స్‌లో భారతీయ ముఖ్యంగా గుజరాత్ సంస్కృతి మేళవించి ఆధునికతతో కూడిన దుస్తులను డిజైన్ చేస్తూ ఉంటుంది. కళల పట్ల తనకు ఉన్న మక్కువే ఇక్కడి వరకూ తీసుకొచ్చినట్లు తను పేర్కొంది. 2005లో పుట్టిన రియా ఎత్తు 5 అడుగులా 9 అంగుళాలు ఈ ఎత్తే తనకు ఈ పోటీల్లో కొన్ని అంశాల్లో స్టేజ్‌పైన కలిసి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. విమెన్ ఎంపవర్ మెంట్, ఫిట్‌నెస్ అడ్వైజర్‌గానూ పని చేస్తోంది. తన కుటుంబ సపోర్ట్ కూడా తనకు ఉందని రియా పేర్కొంది.
రియా సింఘా భారత మిస్ యూనివర్స్‌గా ఎన్నికైన తర్వాత ఇండియా మిస్ యూనివర్స్ పేజ్ కోల్డ్‌ప్లే బ్యాండ్.. ది యూనివర్స్ సాంగ్‌ను పోస్ట్ చేసింది. భారత్‌లో ప్రస్తుతం ఈ బ్రిటీష్ బ్యాండ్ ట్రెండింగ్‌లో ఉండగా.. ఆ బ్యాండ్ నిర్వహించబోయే ఈవెంట్‌కి ఇప్పటికే టిక్కెట్లనీ అమ్ముడు పోయాయి.
Also Read: యాపిల్ ప్రాడక్ట్స్‌లో ఇంత హై రిస్క్ ఉందా? ఐఫోన్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక