Aviri Kudumulu : విశాఖలో ఆవిరి కుడుములకు గిరాకీ, రెసిపీ చాలా ఈజీ!
Aviri Kudumulu : విశాఖలో కుడుములకు గిరాకీ పెరిగింది. ఇడ్లీ కన్నా ఆవిరి కుడుములను ఆరగించేందుకు వైజాగ్ వాసులు మొగ్గుచూపుతున్నారు. వీటిని ఇలా తయారుచేసేయండి.
Aviri Kudumulu : విశాఖలో ఆవిరి కుడుములకు గిరాకీ పెరుగుతుంది. బ్రేక్ ఫాస్ట్ అంటే గుర్తొచ్చే ఇడ్లీ ప్లేస్ లో ఆవిరి కుడుములను తినడానికే విశాఖ వాసులు ఓటేస్తున్నారు. ఇడ్లీ కంటే చాలా పెద్దసైజులో చేసే ఆవిరి కుడుమును వేడివేడిగా అల్లం చట్నీ ,లేదా బొంబాయి చట్నీ తో కలిపి తింటే ఆ టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది అంటున్నారు స్మార్ట్ సిటీ జనాలు. ఉదయమే వాకింగ్ పూర్తయ్యాకో .. సాయంత్రం సరదాగా బయటకి వచ్చేవాళ్లకో ఆవిరికుడుములు మంచి ఈటింగ్ ఆప్షన్ గా మారాయి. ఆవిరి కుడుములు అనేవి ఇప్పటి వంటకం కాదు. మన తాతల కాలం నుంచి ఉన్నవే. ఇడ్లీలు ఇంకా తెలుగునాట ప్రవేశించక ముందు కుడుములే ఆహారంగా తీసుకునేవారు. దీంట్లో ఇడ్లీనూక వెయ్యరు. వేసినా చాలా తక్కువ మోతాదులో కలుపుతారు. ఇడ్లీకి ఆవిరి కుడుములకూ ఇదే ప్రధాన తేడా. కేవలం మినప్పిండితో మాత్రమే చెయ్యడం వలన ఇడ్లీ కంటే ఆవిరి కుడుములు ఆరోగ్యకరం అంటారు పెద్దలు. ముఖ్యంగా బలహీనంగా ఉన్నవారు, బాలింతలకు, పాలిచ్చే తల్లులకు, నీరసంగా ఉండేవారు తింటే బలం చేకూరుతుంది అంటారు.
తయారు చేసే విధానం :
మినపప్పును కనీసం 4 నుంచి 6 గంటలు నానబెట్టుకుని .. ఆ తరువాత మినపప్పు పైనున్న పొట్టును తీసివేయాలి. అయితే ఈ పొట్టును మొత్తంగా తీసేయకుండా ఉంటేనే హెల్త్ కి మంచిది అంటారు. తరువాత ఆ పప్పును గ్రైండర్ లో వేసుకుని అతితక్కువ నీటితో రుబ్బుకోవాలి. ఆ సమయంలోనే కొద్దిగా ఉప్పు వెయ్యాలి. ఉప్పు వెయ్యగానే పిండి కాస్త లూజ్ అవుతుంది. తరువాత ఆ పిండిని ఆవిరి కుడుములు వేసే గిన్నెపై క్లాత్ ని గట్టిగా కట్టి ఆ క్లాత్ పై పిండిని వేసి మళ్లీ ఆ పైన కూడా క్లాత్ తో కవర్ చేసెయ్యాలి. తరువాత ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఆవిరి మీద 10 నుంచి 15 నిముషాలు ఉడికించాలి. ఎక్కడా ఆయిల్ తగలకూడదు. కావాలనుకుంటే పిండిని రుబ్బే సమయంలో కొద్దిగా ఇడ్లీ నూకను కలుపుకోవచ్చు. ఇలా తయారైన ఆవిరి కుడుములను చట్నీతోనో, ధనియాల కారంతోనో కలిపితింటే ఆ రుచికి ఎవరైనా దాసోహం కావాల్సిందే.
వైజాగ్ లో ఆవిరి కుడుములకు గిరాకీ
వైజాగ్ లో ఆవిరి కుడుముల బిజినెస్ 30 ఏళ్ల నుండే మొదలైంది. వ్యాపార పనుల మీద దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇతర టిఫిన్స్ కన్నా ఆవిరికుడుములనే ఎక్కువగా తినడంతో నెమ్మదిగా వీటి బిజినెస్ ఊపందుకుంది. ప్రస్తుతం వైజాగ్ లో 15 వరకూ ఆవిరి కుడుములు అమ్మే షాపులు ఉన్నాయి. కొందరు బళ్ల మీద అమ్మితే మరికొందరు షాపులు పెట్టే వరకూ ఎదిగారు. ఎలా అమ్మినా ఎక్కడ అమ్మినా కుడుముల టేస్ట్ లోనూ .. డిమాండ్ లోనూ మాత్రం మార్పు ఉండదు. ప్రస్తుతం ఒక్కో కూడుమూ 30 రూపాయలకు అమ్ముతున్నారు. అదే రేటుకు ప్లేట్ ఇడ్లీ వస్తున్నా.. జనం మాత్రం ఆవిరి కుడుమే ముద్దు అంటున్నారు. ఈ మధ్య జనాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరుగుతుండడంతో ఇడ్లీ కన్నా కుడుములే ముద్దు అంటున్నారు వారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో విశాఖలో వీటిని అమ్మే షాపులు మరింతగా పెరుగుతాయి అంటున్నాయి మార్కెట్ వర్గాలు. అంతే కాదు నెమ్మదిగా పక్క ఊళ్లకూ ఈ ట్రెండ్ పాకుతూ ఉంది అంటున్నారు వ్యాపారులు.