Pesarapappu Pungulu : క్రిస్పీ పెసర పునుగులు.. చాలా సింపుల్‌గా ఈవెనింగ్ స్నాక్స్‌ని చేసేయండిలా
Tasty Evening Snack : ఈవెనింగ్ స్నాక్స్ తినాలనుకుంటున్నారా? అయితే బయట కాకుండా ఇంట్లోనే టేస్టీ పునుగులను తయారు చేసుకోవచ్చు. రెసిపీ కూడా చాలా సింపుల్.
Punugulu Recipe in Telugu : వర్షం పడుతున్న సమయంలో వేడి వేడిగా.. ముఖ్యంగా క్రిస్పీగా, కాస్త కారంగా నోటికి రుచిని అందించే స్నాక్స్ తింటే ఎంత బాగుంటుంది. ఇలాంటి టేస్టీ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కచ్చితంగా పెసర పునుగులు ట్రై చేయవచ్చు. వీటిని చేయడం చాలా తేలిక. పైగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ టేస్టీ, క్రిస్పీ పునుగులను ఏ విధంగా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పెసర పప్పు - 2 రెండు కప్పులు
అల్లం - అంగుళం
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 3
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
కొత్తిమీర - చిన్నకట్ట
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడేంత
తయారీ విధానం
పెసర పునుగులను పెసలు, పెసర పప్పు రెండింటీతో చేయవచ్చు. కానీ ఇన్‌స్టాంట్‌గా చేసుకోవాలనుకుంటే పెసరపప్పు వాడితే మంచిది. పెసలుతో చేసుకోవాలనుకుంటే కనీసం నాలుగు లేదా ఐదు గంటల ముందు పప్పును నానబెట్టుకోవాలి. మిగతాది అంతా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. పెసరపప్పు ఉపయోగిస్తే అరగంట, నలభై ఐదు నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ప్రాసెస్ స్టార్ చేసే ముందు పెసరపప్పును బాగా కడిగి.. నానబెట్టుకోవాలి.
పప్పు నానేలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లాన్ని సన్నగా తురుమి పక్కన పెట్టుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. కరివేపాకు, కొత్తిమీరను కూడా సన్నగా తురుముకోవాలి. పెసరపప్పు నానిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలో వేయండి. నీరు వేయకుండా పిండిని మిక్సీ చేసుకోవాలి. పిండి కాస్త కచ్చాపచ్చాగానే ఉండాలి. అప్పుడే నూనెలో పిండి వేగాక.. పప్పు కరకరలాడుతూ మంచి రుచిని అందిస్తుంది.
పిండి మరీ జారుగా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా ఉండకుండా చూసుకోండి. ఇలా తయారు చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కరివేపాకు, కొత్తిమీర తురుము వేసి గట్టిగా పిసుకుతూ కలపాలి. ఇలా చేయడం వల్ల పునుగులు గుల్లగా, క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి.. నూనె వేడికానివ్వాలి.
నూనె వేడి అయిన తర్వాత దానిలో పెసరపిండిని పనుగులుగా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే టేస్టీ, క్రిస్పీ పునుగులు రెడీ. ఇవి ఛాయ్‌కి బెస్ట్ కాంబినేషన్. పైగా వీటిని తీసుకోవడానికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు. పిల్లలనుంచి పెద్దలవరకు అందరూ ఈ టేస్టీ పునుగులను ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం. సాయంత్రం ఈ స్నాక్స్ మీరు ట్రై చేసి.. ఇంటిల్లిపాది హాయిగా లాగించేయండి.
Also Read : టేస్టీ మైసూర్ బోండా రెసిపీ.. ఈ టిప్స్‌తో పిండి ముద్దలుగా రాదు, నూనె ఎక్కువ పీల్చదు