Dosa Recipe: సొరకాయ - పెసర దోశె, ఒకసారి తిని చూడండి
ఒకేలాంటి దోశెలు తిని తిని బోరు కొట్టిందా? అయితే ఓసారి సొరకాయ - పెసర దోశె ప్రయత్నించండి.
మసాలా దోశె, ఆనియన్ దోశె, పెసరట్టు ఎప్పుడూ ఇవే టిఫిన్లు తిని బోరు కొట్టేస్తుంది. ఓసారి కొత్తగా సొరకాయ - పెసర దోశెను ప్రయత్నించండి. రుచి అదిరిపోవడం ఖాయం. ఇందులో అనేక పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి తినడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా.
కావాల్సిన పదార్థాలు
సొరకాయ ముక్కలు - ఒక కప్పు
పెసర పప్పు - ఒక కప్పు
బియ్యప్పిండి - ఒక టీ స్పూను
కొత్తి మీర - ఒక కట్ట
అల్లం ముక్క - చిన్నది
పచ్చి మిర్చి - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
తయారీ ఇలా
1. పొట్టు తీసిన పెసరపప్పు నాలుగు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
2. నానిన తరువాత మిక్సీజార్లో పెసర్లు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఇప్పుడు సొరకాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేయాలి.
4. పెసర్లతో కలిపి రుబ్బుకోవాలి. ఆ పిండిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
5. ఆ పిండిలో సన్నగా తరిగిన కొత్తిమీర, బియ్యప్పిండి, తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి
6. దోశెలు పోసుకోవడానికి వీలుగా వచ్చేలా అవసరం అయితే నీళ్లు కలుపుకోవచ్చు.
7. పెనం వేడెక్కాక ఆయిల్ వేసి దోశెల్లా పోసుకోవాలి.
8. ఈ దోశెలను కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు.
ఈ రెసిపీలో రెండు ఉత్తమ ఆహారాలను ఉపయోగించాం. అవి సొరకాయ, పెసర పప్పు. ఈ రెండు కూడా శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. సొరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత తిన్నా బరువు పెరగరు. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, మూత్ర నాళాల జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో అధికంగా నీరు ఉంటుంది. కాబట్టి శరీరం తేమవంతంగా మారుతుంది. దీనిలో ఇనుము, సోడియం, పొటాషియం అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. సొరకాయ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
పెసరపప్పు ఎంత బలమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెసరపప్పును తినడం వల్ల శరీరానికి అధికమొత్తంలో ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. పెసరపప్పు తినడం వల్ల కూడా అధిక బరువు తగ్గుతారు. దీనిలోనూ ఫొలేట్, నియాసిన్, విటమిన్ బి6, పొటాషియం, ఐరన్, ప్రొటీన్ ఉంటాయి. ఇవన్నీ మనకు అవసరం అయినవే.
సొరకాయ వేసుకోవడం మీకు నచ్చకపోతే కింద ఇచ్చిన ఇన్ స్టా లింకులో చూపించినట్టు పెసరపప్పు, బియ్యం, మినపప్పులతో టేస్టీ పెసరట్టు వేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల కొత్త రుచి రాదు, ఎప్పుడు చేసుకున్న దోశెల్లానే ఉంటాయి. సొరకాయను జత చేయడం వల్ల రుచిలో కొత్తదనం వస్తుంది.
View this post on Instagram
Also read: ఇవన్నీ సూపర్‌ఫుడ్స్ - నానబెట్టుకుని తింటే ఆరోగ్యంతో పాటు అందం కూడా