కారం దోశ కేరాఫ్ నెల్లూరు, చూశారంటే నోట్లో నీళ్లూరాల్సిందే!
నెల్లూరు జిల్లా పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది అక్కడి కారం దోశే. అదిరిపోయే రుచితో చూడగానే నోట్లో నీళ్లూరేలా చేసే ఆ కారం అంటే అమృతంతో సమానం. మీరూ ఓ లుక్కేయండి.
మనకు ఏ మాత్రం నోరు రుచిగా అనిపించకపోయినా, ఒంట్లో బాలేకపోయినా, ఏదైనా ఆరోగ్య సమస్యలతో శస్త్ర చికిత్సలు జరిగినా కూరకు బదులుగా ఎక్కువగా తినాలని చెప్పేది, తనిపించమని చెప్పేది కారం పొడి. ఎన్నెన్ని కొత్త వంటకాలు ఉన్నా చాలా మందికి కారప్పొడి విత్ నెయ్యి అంటే ప్రాణం. అంత రుచిని అందించే ఆ కారం పొడిని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తయారు చేస్కుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా వెల్లుల్లి పాయలతో ఈ కారం పొడిని తయారు చేస్కుంటారు. కానీ నెల్లూరులో మాత్రం కారం అంటే ఎండు మిరపకాయలు, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలతో చేసిన చట్నీ. కొంతమంది దీంట్లో టమోటా కూడా మిక్స్ చేస్తుంటారు. ఈ కారాన్ని దోశపై వేసి దోరగా వేయిస్తే అది కారం దోశ అవుతుంది. కారం దోశను నూనెతో కాకుండా నెయ్యితో వేయిస్తే అది నెయ్యికారం.
నెల్లూరులో వేసే కారందోశ టేస్టే వేరప్పా..
అయితే నెల్లూరులో చేసే కారం దోశకు, నెయ్యి కారం దోశకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కల్గక మానదు. కానీ అక్కడ దొరికే ఆ దోశ రుచిని ఒక్కసారి తిన్నారంటే.. ఎంత దూరంలో ఉన్న వాళ్లైనా సరే పదే పదే దోశ తినడానికి రావాల్సిందే. అయితే నెల్లూరులోని ప్రతీ చోటా ఈ కారం దోశలు దొరకవు. దొరికినా అంత రుచిని అందించవు. కేవలం కొన్ని హోటళ్లలో మాత్రమే ఈ అద్భుతమైన దోషలు దొరుకుతాయి. అయితే ఎక్కడెక్కడ అంత కమ్మటి దోశలు దొరుకుతాయో అక్కడి ప్రాంత వాసులకు బాగా తెలుసు. అందుకే కాస్త దూరం ఎక్కువైనా, ధర ఎక్కువైనా ఆ కమ్మటి కారం దోశలనే తింటుంటారు. పిజ్జాలు, బర్గర్లు.. ఇలా ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడుతున్న రోజుల్లో కూడా నెల్లూరు నెయ్యికారం దోశలకు అభిమానులున్నారు.
"నేను పనిమీద హైదరాబాద్ నుంచి వచ్చాను. పని అయిపోవడంతో అట్ల బయటకు వచ్చినం. ఏమైనా తినాలని అక్కడా ఇక్కడా తిరుగుతుంటే.. కొందరు నెల్లూరు కారం దోశ చాలా ఫేమస్ అని చెప్పారు. దీంతో ఇక్కడకు వచ్చి ముందు ఒకటి ఆర్డర్ చేశాం. చాలా బాగుంది. రెండోది కూడా ఆర్డర్ చేశా.. ఇంకో రెండు మూడు తింటే తప్ప సాటిస్ ఫై అయ్యేలా లేము. చాలా బాగున్నాయి. అలాగే చాలా నీట్ గా మెయింటేన్ చేస్తున్నరు. సూపర్" - వినోత్కర్, కస్టమర్
"చెన్నె, బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మా హోటల్ లో తినేందుకు వస్తుంటారు. మీరు ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు. మీరూ కూడా ఓసారి వచ్చి మా కారందోశం, నెయ్యి కారం దోశ తినండి."- కృష్ణారెడ్డి, హోటల్ నిర్వాహకుడు
నెయ్యికారం రెసిపీని మాత్రం అక్కడి హోటల్స్ నిర్వాహకులు చెప్పమని మొహం మీదే చెప్పేస్తుంటారు. నెల్లూరులోని ప్రతి ఇంట్లో కూడా నెయ్యి కారం దోశలు చేసుకుంటారు కానీ.. హోటల్ లో వేసినంత టేస్ట్ మాత్రం రాదనే చెప్పాలి. గ్యాస్ పొయ్యిపై కాకుండా బొగ్గుల పొయ్యిపైనే నెయ్యికారం దోశలకు టేస్ట్ వస్తుందని అంటుంటారు. ఇక హోటల్ లో వేసే చట్నీతో కూడా టేస్ట్ మరింత పెరుగుతుంది.